iDreamPost

వలంటీర్లు అంటే ఎందుకంత భయం..?

వలంటీర్లు అంటే ఎందుకంత భయం..?

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ సర్కార్‌ తెచ్చిన వలంటీర్‌ వ్యవస్థను చూసి ప్రతిపక్ష టీడీపీ భయపడుతోందని ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరుతో అర్థమవుతోంది. వలంటీర్ల సేవలను గుర్తిస్తూ వారికి చిరు సత్కారం, కొద్దిపాటి మొత్తంలో నగదు బహుమతి ఇచ్చే కార్యక్రమాన్ని గురువారం సీఎం వైఎస్‌ జగన్‌ లాంఛనంగా ప్రారంభించారు. రాబోయే 20 రోజులు పాటు రాష్ట్ర వ్యాప్తంగా 2.60 లక్షల మంది వలంటీర్లకుగాను ఏడాది పాటు సేవలు అందించిన 2.40 లక్షల మందికి ఈ సత్కారం దక్కనుంది. ఈ క్రమంలో టీడీపీ నేతలు వలంటీర్లపై మళ్లీ విమర్శలు, ఆరోపణలు చేయడం ప్రారంభించారు. వలంటీర్లను ఔరంగజేబు కాలం నాటి వేగుల వ్యవస్థతో పోల్చిన టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వారిని అడ్డుపెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలిచిందని ఆరోపించారు. అడ్డగోలు దోపిడీకి సహకరించినందుకు వలంటీర్లకు సన్మానం చేస్తున్నారా..? అంటూ వర్ల రామయ్య తన అక్కసును వెళ్లగక్కారు.

అసలు విషయం మరచిపోయిన ఉమా..

వలంటీర్లను అడ్డుపెట్టుకుని స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ గెలిచిందంటూ మాట్లాడిన దేవినేని ఉమా.. గత ఏడాది స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన పరిణామాలను పూర్తిగా మరిచిపోయినట్లుగా ఉన్నారు. వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని డిమాండ్‌ చేసిన టీడీపీ.. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌కు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రాలు ఇచ్చింది. ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ విషయంలో నానా యాగీ చేశారు. టీడీపీ అనుకూల మీడియా వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటూ ప్రచారం చేసింది. అంతిమంగా ఎన్నికల సంఘం వలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలంటూ ఆదేశాలు జారీ చేసింది. వారి వద్ద ఉన్న ఫోన్లను ఎన్నికలు ముగిసేవరకూ వెనక్కి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం తు.చ తప్పకుండా అమలు చేసింది. వలంటీర్లు ఎన్నికల విధులకు దూరంగా ఉన్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే.. దేవినేని ఉమా మాత్రం వలంటీర్లను అడ్డుపెట్టుకుని వైసీపీ గెలిచిందంటూ వలంటీర్లపై ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉంది.

వర్లకు వ్యత్యాసం కనిపించడం లేదా..?

వలంటీర్లకు సన్మానం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్న వర్ల రామయ్య.. వారిని దోపిడీదారులు, దోపిడీకి సహకరించిన వారంటూ తన అక్కసును వెళ్లగక్కారు. వలంటీర్లు ఎలాంటి సేవలు అందిస్తున్నారో ప్రజల్లోకి వెళితే వర్లకు అర్థమవుతుంది. నిజంగా వర్ల రామయ్య అన్నట్లు వారు అలా వ్యవహరిస్తుంటే.. అది టీడీపీకే లాభం తెచ్చిపెడుతుంది. వలంటీర్లు ప్రజలను దోపిడీ చేస్తున్నా.. వైసీపీ నేతల దోపిడీకి సహకరిస్తున్నా.. ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది. గత ఎన్నికల్లో టీడీపీకి చెప్పినట్లుగానే వైసీపీకి ఓటుతో బుద్ధి చెబుతారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను, అధికారులను డమ్మీలను చేస్తూ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసింది. ఏ పథకం మంజూరు కావాలన్నా టీడీపీ కార్యకర్తలు, నేతలతో కూడిన జన్మభూమి కమిటీల అనుమతి తప్పనిసరి. దీంతో టీడీపీ నేతలు అడ్డగోలుగా ప్రజలను దోపిడీ చేశారు. పింఛన్‌ మంజూరు చేసేందుకు మూడు నుంచి ఐదు వేల రూపాయలు వసూలు చేశారు.

సేవలందించారా..? దోపిడీ చేశారా..? అప్పుడు తేలుతుంది..

జన్మభూమి కమిటీల అనుమతిలేనిదే జిల్లా కలెక్టర్‌ కూడా అర్హులైన వారికి పింఛన్‌ మంజూరు చేసే అధికారం కూడా లేదంటే.. టీడీపీ సర్కార్‌ హయాంలో వ్యవస్థలు ఏ విధంగా కూలిపోయింది, జన్మభూమి కమిటీలు ఎలాంటి అరాచకాలు చేసింది అర్థమవుతోంది. అడ్డగోలుగా జన్మభూమి కమిటీలు ప్రజలను దోపిడీ చేయడంతో.. 2019 ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి ఓటుతో బుద్ధి చెప్పారు. ఇప్పుడు వలంటీర్లు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారు. సీఎం జగన్‌ కూడా తన వల్ల మేలు జరిగితేనే ఆశీర్వదించండి.. లేదంటే ద్వేషించండి.. టీడీపీ నేతల మాటలు నమ్మకండంటూ ధైర్యంగా చెబుతున్నారు. వలంటీర్లు ప్రజలను దోపిడీ చేస్తుంటే టీడీపీ నేతలు భయపడాల్సిన పనిలేదు. వలంటీర్లు ప్రజలకు సేవలు అందించారా..? లేదా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నట్లు దోపిడీ చేశారా..? అనేది ఎన్నికల ఫలితాల తర్వాత బోధపడుతుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి