iDreamPost

పరస్పర గౌరవంతోనే వ్యవస్థలకు ప్రతిష్ట

పరస్పర గౌరవంతోనే వ్యవస్థలకు ప్రతిష్ట

శాసన, కార్యనిర్వాహక, న్యాయ శాఖ పనితీరుతోనే ప్రజా స్వామ్యం మనుగడసాగిస్తుంది. ఈ మూడు వ్యవస్థల్లో ఏ వ్యవస్థా.. ఎక్కువ కాదు.. తక్కువ కాదు. దేని ప్రాధాన్యత దానిదే. పరస్పర గౌరవం, సమన్వయంతో పరిధికిలోబడి పని చేయడం ఎంతో అవసరం. మూడు వ్యవస్థల్లో ఏ ఒక్క వ్యవస్థా.. తన పరిధికి మించి పని చేసినా.. ఇతర వ్యవస్థల గౌరవానికి భంగం వాటిల్లేలా వ్యవహరించినా.. సమస్యలు ఉత్పన్నమవుతాయి. ప్రజా శ్రేయస్సుకు అది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు.

శాసన వ్యవస్థ చట్టాలు చేస్తే, కార్యనిర్వాహక వ్యవస్థ వాటిని అమలు చేస్తుంది. చట్టాలలోనూ, వాటిని అమలు పరిచే విధానం రాజ్యాంగం ప్రసాదించిన సహజ న్యాయసూత్రాలకు లోబడి ఉన్నాయా..? లేదా..? అనేది న్యాయస్థానాలు పర్యవేక్షిస్తాయి. అయితే ఏపీలో ఇటీవల జరుగుతున్న పరిణామాలు న్యాయ వ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య ఒకింత వివాదాలకు దారి తీస్తున్నాయి. ప్రజా సంక్షేమ, అభివృద్ధి పనులపై హైకోర్టులో వచ్చిన తీర్పులు విమర్శలను ఎదుర్కొన్నాయి. కార్యనిర్వాహక వ్యవస్థపైనా, శాసన వ్యవస్థపైనా న్యాయ వ్యవస్థలోని కొందరు న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కార్యనిర్వాహక, శాసన వ్యవస్థల గౌరవాన్ని తగ్గించేలా ఉన్నాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ చేసిన వ్యాఖ్యలతో మూడు వ్యవస్థల పనితీరు, ప్రాముఖ్యత, పరిధిపై చర్చ జరుగుతోంది. ప్రభుత్వ భూముల ఇ–వేలంను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ నుంచి తప్పుకోవాలని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌ వేయడంపై తాను ఎంతో ఆవేదన చెందానని న్యాయమూర్తి జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. పదవి విమరణ చేయనున్న చివరి దశలో ఇలాంటి పిటిషన్లు చూస్తానని తాను అనుకోలేదన్నారు. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేందుకు అనుమతించనని వ్యాఖ్యానించారు. ఊపిరి ఉన్నంత వరకూ న్యాయవ్యవస్థను కాపాడతానని కూడా చెప్పుకొచ్చారు.

అయితే జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ ఆవేదనకు కారణమైన పిటిషన్‌ను ఏపీ ప్రభుత్వం ఎందుకు వేయాల్సి వచ్చింది..? అనేదే ఇప్పుడు ప్రముఖంగా ప్రస్తావించాల్సిన అంశం. ఏదైనా ప్రభుత్వం భూములను కొనడం, లేదా అమ్మడం, ప్రైవేటు వ్యక్తుల నుంచి సేకరించడం, వాటిని మళ్లీ అభివృద్ధి పనులకు, కంపెనీల ఏర్పాటుకు ఇతరులకు ఇవ్వడం సర్వసాధారణంగా సాగేదే. అమరావతిలో రైతుల నుంచి తీసుకున్న 33 వేల ఎకరాలను అభివృద్ధి చేసి, రైతుల వాటా పోను.. ఇంకా ప్రభుత్వానికి 10 వేల ఎకరాలు ఉంటాయని, వాటిని అమ్మడం వల్ల లక్ష కోట్ల రూపాయలు వస్తాయని, దాని ద్వారా అమరావతిని కడతానని మాజీ సీఎం చంద్రబాబు ఇప్పటికీ చెబుతున్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. మరి ఇలాంటిది ఏపీ ప్రభుత్వం మిషన్‌ బిల్డ్‌ ఏపీ పేరుతో.. కొన్ని ప్రభుత్వ భూములను విక్రయించాలని నిర్ణయిస్తే.. దాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణలో భాగంగా జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు..? అనేది ఇక్కడ ప్రస్తావించాలి. ‘‘ రాష్ట్రానికి చెందిన ఆస్తులను ప్రభుత్వం ఏ విధంగా వేలం వేస్తుంది..? ఆస్తులను వేలం వేయడానికి ప్రభుత్వం ఏమైనా దివాళా తీస్తోందా..? రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పుకూలాయని ప్రకటిస్తాం. పాలనను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తాం..’’ అంటూ జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ వ్యాఖ్యానించడం ఏ విధంగా పరిగణించాలనేదే ప్రధానాంశం.

విచారణ సందర్భంగా తన మనసులోకి వచ్చిన దానిని అడగడం అలవాటని, అలాంటి ప్రశ్నలకు సమాధానం చెబితే సరిపోతుందని జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ అన్నారు. ప్రశ్నలంటే.. రాష్ట్రానికి చెందిన భూములను అమ్మాల్సిన హక్కు ప్రభుత్వానికి ఉందా..? భూములను అమ్మాల్సిన అవసరం ఏమొచ్చింది..? సరిపడనంత ఆదాయం ప్రభుత్వానికి రావడం లేదా..? కేంద్ర నుంచి నిధులు రావడం లేదా..? వీటిని సాధారణంగా ప్రశ్నలంటారు. ఈ ప్రశ్నలకు వల్ల ఎవరి గౌరవానికి భంగం వాటిల్లదు. అంతేగానీ.. రాష్ట్రానికి చెందిన ఆస్తులను ప్రభుత్వం ఏ విధంగా వేలం వేస్తుంది..? ఆస్తులను వేలం వేయడానికి ప్రభుత్వం ఏమైనా దివాళా తీస్తోందా..? రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పుకూలాయని ప్రకటిస్తాం. పాలనను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తాం.. అనేవి ప్రశ్నలు మాదిరిగా ఉన్నాయా..? లేక ప్రభుత్వాన్ని అంటే శాసన వ్యవస్థను అవమానించేలా ఉన్నాయా..? అనేది ఇట్టే తెలిసిపోతోంది.

వ్యవస్థ ప్రతిష్టను దిగజార్చేందుకు అనుమతించను అని కూడా జస్టిస్‌ రాకేష్‌కుమార్‌ అన్నారు. విచారణ నుంచి తప్పుకోవాలని పిటిషన్‌ వేయడం రాజ్యాంగపరమైన హక్కు అని కూడా ఆయన పేర్కొన్నారు. అలాంటిది ఏపీ ప్రభుత్వం ఒక న్యాయమూర్తిని విచారణ నుంచి తప్పుకోవాలని, అలా అడగడానికి కారణాలను కూడా చెబితే.. న్యాయ వ్యవస్థ ప్రతిష్ట దిగజార్చేందుకు ప్రయత్నించినట్లా..? అనేది ఇప్పుడు అందిరిలోనూ మెదులుతున్న ప్రశ్న. అయితే.. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వాన్ని అవమానించేలా..? ప్రజా తీర్పును కించపరిచేలా.. రాజ్యాంగ వ్యవస్థలు కుప్ప కూలాయని ప్రకటిస్తాం.. పాలనను కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని హెచ్చరించడం అనేది.. శాసన వ్యవస్థను గౌరవిస్తున్నట్లా..? లేక అవమానిస్తున్నట్లా..? అనే ప్రశ్నలు ఉద్భవిస్తన్నాయి. ఆదిలోనే చెప్పుకున్నట్లు.. వ్యవస్థల మధ్య పరస్పర గౌరవభావాలతోనే వాటి ప్రతిష్ట ఇనుమడిస్తుంది. అంతిమంగా ప్రజాస్వామ్యం వర్థిల్లుతుందనేని పెద్దలు చెప్పే మాట.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి