iDreamPost

సీక్వెల్ సినిమాలకు నెగటివ్ శాపం – బ్రేక్ చేసేదెవరో

సీక్వెల్ సినిమాలకు నెగటివ్ శాపం – బ్రేక్ చేసేదెవరో

హాలీవుడ్ లో వర్కౌట్ అయినట్టు సౌత్ సినిమాకు సీక్వెల్స్ అంతగా అచ్చిరాలేదన్నది చరిత్ర చెబుతున్న వాస్తవం. ఒక్క బాహుబలి తప్ప మిగిలినవేవి కనీస స్థాయిలో విజయం సాధించినవి లేవు. కిక్ 2, మన్మథుడు 2, ఆర్య 2, సత్య 2, గాయం 2, సర్దార్ గబ్బర్ సింగ్, నాగవల్లి, శంకర్ దాదా జిందాబాద్ ఇలా చెప్పుకుంటూ పోతే డిజాస్టర్ల లిస్టు చాలా పెద్దదే ఉంది. కెజిఎఫ్ 2 కనక బ్లాక్ బస్టర్ అయితే ఈ నెగటివ్ సెంటిమెంట్ ని బ్రేక్ చేసిన మరో మూవీగా నిలిచిపోతుంది. అయినా కూడా మన నిర్మాతలు దర్శకులు మాత్రం ఈ పార్ట్ 2 ఫార్ములాని వదిలిపెట్టడం లేదు. పుష్ప కూడా డిసెంబర్ లో ఒక భాగం 2022లో మరో భాగంతో వస్తున్న సంగతి తెలిసిందే.

బాలీవుడ్ లో మాత్రం పరిస్థితి దీనికి భిన్నంగా ఉంటుంది. ధూమ్ 2, రేస్ 2, ఫిర్ హేరా ఫేరీ లాంటివి ఫస్ట్ పార్ట్ కన్నా గొప్ప విజయం సాధించాయి. ఇప్పుడు ఇదంతా చెప్పుకోవడానికి కారణం ఉంది. కమల్ హాసన్ – ఖైదీ మాస్టర్ ఫేమ్ లోకేష్ కనకరాజ్ కాంబోలో రూపొందుతున్న విక్రమ్ ని కూడా రెండు భాగాలుగా తీసే దిశలో ప్రయత్నాలు మొదలయ్యాయట. ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి విలన్లుగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో లోక నాయకుడి పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది. ఇప్పటికే షూట్ చేసిన భాగం నాలుగు గంటల నిడివి దాటడంతో సీక్వెల్ లా ప్లాన్ చేసుకుంటే బిజినెస్ పరంగా ప్లస్ అవుతుందన్నది ఆలోచన.

క్రేజ్ ని తెచ్చుకునే విషయంలో ఈ పార్ట్ 2 ఫార్ములా బాగానే వర్కౌట్ అవుతోంది కానీ కేవలం దీని వల్లే అంచనాలు కూడా విపరీతంగా పెరిగిపోయి ఆశించిన ఫలితాలు దక్కని సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అదే ఇంగ్లీష్ సినిమాల్లో చూసుకుంటే స్పైడర్ మ్యాన్. కింగ్ కాంగ్, గాడ్జిల్లా, ఫ్రైడే 13త్ లాంటివి దశాబ్దాలు గడిచినా సీక్వెల్స్ వస్తూనే ఉంటాయి అక్కడి ప్రేక్షకులతోసహా మనమూ ఎగబడి చూసేసరికి ఘనవిజయం సాధిస్తూనే ఉంటాయి. ఏది ఏమైనా దక్షిణాదిలో ఇప్పుడీ సెంటిమెంట్ కనక రెండు మూడు సినిమాలు బ్రేక్ చేస్తే ఇక్కడా పార్ట్ 2 ఊపందుకుంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు

Also Read : రిలీజ్ డేట్ అయోమయంలో చిరు సినిమా

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి