iDreamPost

ఎవరీ ముంతాజ్‌?.. మదనపల్లితో ఏంటి బంధం?

ఎవరీ ముంతాజ్‌?.. మదనపల్లితో ఏంటి బంధం?

తాజాగా ప్రకటించిన పద్మ అవార్డుల్లో కేరళ రాష్ట్రం త్రివేండ్రంకు చెందిన ముంతాజ్‌అలీకి పద్మభూషణ్‌ వరించింది. ఈయన పుట్టింది, పెరిగింది కేరళలోని త్రివేండ్రంలో అయినా ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లితో 25 ఏళ్లకుపైగా అనుబంధం ఉంది. సంప్రదాయ ముస్లిం కుటుంబంలో జన్మించిన ఈయనకు చిన్నప్పటి నుంచే ఆధ్మాత్మిక విషయాలపై ఆసక్తి ఉండేది. ఆ క్రమంలోనే 19 ఏళ్ల ప్రాయంలో హిమాలయాలకు వెళ్లారు. అక్కడ గురువు మధుకర్‌నాథ్‌తో పరిచయం ఏర్పడింది. దాదాపు నాలుగేళ్లు హిమాలయాల్లోనే గడిపారు. వేదాలు, ఉపనిశషత్తులు, ధ్యానం, యోగా ప్రక్రియల్లో శిక్షణ తీసుకుని కేరళ చేరుకున్నారు. తర్వాత ప్రముఖ తత్వవేత్త జిడ్డుకృష్ణమూర్తికి చెందిన రిషివ్యాలీలో అనుబంధం పెంచుకున్నారు.

మొదట కర్ణాటకలోని నీల్‌బాగ్‌లోని పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరారు. తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లికి అప్పుడప్పుడూ వస్తుండేవారు. ఆ క్రమంలోనే 1996లో సత్సంగ్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ గిరిజన పిల్లలకు చదువుతోపాటు సంప్రదాయ కళలపై శిక్షణ ఇస్తున్నారు. మానవ్‌ ఏక్తా మిషన్‌ ఆధ్వర్యంలో బోధనలు చేస్తున్నారు. భారత్‌ యోగా విద్యా కేంద్రాన్ని నెలకొల్పి దేశ విదేశాల్లో యోగాపై ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. మదనపల్లి కేంద్రంగానే ఎన్నో కార్యక్రమాలకు రూపకల్పన చేశారు. ఏడాదిలో ఎక్కవ రోజులు ఇక్కడే గడపడానికి ఆయన ఇష్టపడుతారు. శాంతి, ప్రేమ, సామరస్యాన్ని పెంపొందించేందకు వాక్‌ ఆఫ్‌ హోప్‌ పేరిట 2015లో కన్యాకుమారి నుంచి శ్రీనగర్‌ వరకు యాత్ర చేశారు. దాదాపు 7,500 కిలోమీటర్లు సాగిన ఈ యాత్రలో ఎంతో మందిని తన శిష్యులుగా మలుచుకున్నారు. అలాగే ధ్యానం గురించి సుమారు 10 పుస్తకాలను రచించారు. వీటిని అన్ని భాషల్లోకి అనువాదం కూడా చేశారు. ఏ యోగీస్‌ ఆటోబయోగ్రఫీ పేరుతో ఆత్మకథ కూడా రాశారు. ముంతాజ్‌ అలీ ఆధ్వర్యంలో దేశ, విదేశాల్లో సత్సంగ్‌ సంస్థలు పనిచేస్తున్నాయి. అమెరికాలోని టెక్సాస్‌ ప్రధాన కేంద్రంగా.. స్విర్జర్లాండ్, ప్యారిస్, ఫిన్‌లాండ్, మాస్కో తదితర దేశాల్లోనూ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఈయన చేస్తున్న విశేష కృషిని గుర్తించి కేంద్రప్రభుత్వం పద్మభూషణ్‌ను ప్రకటించింది. దీంతో మదనపల్లిలోని సత్సంగ్‌ కుటీరం సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి