iDreamPost

స్థానిక ఎన్నిక‌లపై స్ప‌ష్ట‌త వ‌చ్చేనా

స్థానిక ఎన్నిక‌లపై స్ప‌ష్ట‌త వ‌చ్చేనా

ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల కోసం క్షేత్ర‌స్థాయిలో ప‌లువురు నేతలు ఎదురుచూస్తున్నారు. సుమారు రెండేళ్లుగా ఈ ఎన్నిక‌లు వాయిదా ప‌డుతూ వ‌స్తున్నాయి. స‌హ‌కార‌, పంచాయితీ, మండ‌ల, జిల్లా ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పూర్తి చేయాల్సి ఉంది. కానీ కాల‌ప‌రిమితి ముగిసినా అప్ప‌ట్లో ప్ర‌జా వ్య‌తిరేక‌త గ‌మ‌నించిన చంద్ర‌బాబు వాటి జోలికి పోలేదు. ఆ త‌ర్వాత జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డి 9 నెల‌లు గ‌డిచినా ఇంకా మోక్షం క‌ల‌గ‌డం లేదు.

ప్ర‌స్తుతం పంచాయితీ ఎన్నిక‌ల జాప్యానికి ప్ర‌ధాన కార‌ణం రిజ‌ర్వేషన్ల విష‌యంపై అభ్యంత‌రాలు. రిజ‌ర్వేష‌న్లు 50 శాతం మించి కేటాయించ‌డం ప‌ట్ల కొంద‌రు అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌భుత్వం మాత్రం భిన్న‌మైన వాద‌న వినిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో హైకోర్టులో ఈ అంశం న‌లుగుతోంది. ఇప్ప‌టికే ఈ కేసులో వాద‌న‌లు పూర్త‌య్యాయి. తీర్పు మాత్రం రిజ‌ర్వ్ చేశారు. ఎప్ప‌టికీ కోర్ట్ తీర్పు వ‌స్తుంద‌నే విష‌యంలో స్ప‌ష్ట‌త క‌నిపించ‌డం లేదు. దాంతో ఎన్నిక‌లు జ‌రుగుతాయా లేదా అన్న‌ది గ్రామీణ ప్రాంతాల్లో ఉత్కంఠ‌గా మారింది.

వాస్త‌వానికి జ‌న‌వ‌రిలోనే స్థానిక స‌మ‌రానికి ప్ర‌భుత్వం స‌ర్వం సిద్ధం చేసింది. కానీ న్యాయ‌ప‌ర‌మైన ఆటంకాల‌ను క‌ల్పించ‌డంతో అందుకు అవ‌కాశం ద‌క్క‌లేదు. ఆ త‌ర్వాత ఫిబ్ర‌వ‌రిలో జ‌రిగిన క్యాబినెట్ మీటింగ్ ఓ కీల‌క నిర్ణ‌యం కూడా తీసుకున్నారు. చ‌ట్టాల్లో మార్పులు చేస్తూ క‌ఠిన‌మైన నిబంధ‌న‌ల‌తో పంచాయితీ ఎన్నిక‌లు ప‌గ‌డ్భందీగా జ‌ర‌పాల‌ని తీర్మానించారు. 15 రోజుల వ్య‌వ‌ధిలోనే ఎన్నిక‌ల ప్ర‌క్రియ పూర్తిచేయ‌డం, ఎన్నిక‌ల్లో డ‌బ్బు, మ‌ద్యం పంపిణీకి బ్రేకులు వేసేందుకు ప‌లు చ‌ర్య‌లు తీసుకోవ‌డానికి చ‌ట్టాలు రూపొందించారు. అదే స‌మ‌యంలో పంచాయితీ ఎన్నికలు ముగిసిన త‌ర్వాత అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని కూడా నిర్ణ‌యించారు.

ఫిబ్ర‌వ‌రి చివ‌రికి స్థానిక ఎన్నిక‌లు పూర్త‌యితే మార్చి రెండో వారంలో అసెంబ్లీ బ‌డ్జెట్ సమావేశాలు జ‌ర‌పాల‌ని ప్ర‌భుత్వం భావించింది. కానీ కోర్ట్ నుంచి క్లారిటీ రాక‌పోవ‌డంతో ఎన్నిక‌లు వాయిదా ప‌డుతూ వ‌స్తున్నాయి. దాంతో చివ‌ర‌కు మార్చి మొద‌టి వారంలోనే అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాలు జ‌రిపేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. ఇక ఇంట‌ర్, టెన్త్ క్లాస్ ప‌రీక్ష‌లు కూడా ప్రారంభ‌మ‌వుతున్న ద‌శ‌లో ఏప్రిల్ రెండో వారం త‌ర్వాత మాత్ర‌మే ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ ఉంటుంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ఎప్ప‌టికీ స్ప‌ష్ట‌త వ‌స్తుంది..ఎప్పుడు స్థానిక స‌మ‌రం అన్న‌ది ప్ర‌స్తుతానికి రిజ‌ర్వ్ చేసిన కోర్ట్ తీర్పు ఆధారంగానే ఉంటుంద‌ని చెప్ప‌వ‌చ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి