iDreamPost

ప‌వ‌న్ స‌మ‌స్య సినిమాలా ..లేక ?

ప‌వ‌న్ స‌మ‌స్య సినిమాలా ..లేక ?

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాల గురించి చ‌ర్చ సాగుతోంది. జ‌న‌సేన పేరుతో దాదాపు ఏడాదిన్న‌ర పాటు షూటింగ్ ల‌కు దూరంగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు ఏక‌కాలంలో రెండు సినిమాలు ప్రారంభించారు. మ‌రో రెండు సినిమాల‌కు ఆయ‌న అంగీక‌రించారు. ఇక ముప్పైవ సినిమాగా మ‌రోసారి త్రివిక్ర‌మ్ తో జ‌త‌గట్టే అవ‌కాశం ఉంద‌ని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ సినిమాల విష‌యంపై జ‌న‌సేన‌లో అభ్యంత‌రాలు వ్య‌క్తం అయ్యాయి. చివ‌ర‌కు జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ త‌న రాజీనామా లేఖ‌లో కూడా ప్ర‌స్తావించాల్సి వ‌చ్చింది. దానికి ప‌వ‌న్ త‌న‌కు సినిమాలు చేయ‌డం త‌ప్ప‌నిస‌రి అంటూ స‌మాధానం కూడా చెప్పారు.

వాస్త‌వానికి వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ కి ప‌వ‌న్ సినిమాల‌తో స‌మ‌స్య ఏమ‌యినా ఉందా అంటే లేద‌నే చెప్పాలి. అయినా ఆయ‌న సినిమాల గురించి ఎందుకు లేఖ రాశారు అంటే ఏదో సాకు చెప్పాలి కాబ‌ట్టి అని జ‌న‌సేన శిబిరం భావిస్తోంది. అంటే గ‌త కొంత‌కాలంగా జ‌న‌సేన‌లో వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ సౌఖ్యంగా లేర‌ని స్ప‌ష్టం అవుతోంది. చివ‌ర‌కు ఇసుక స‌మ‌స్య‌పై విశాఖ‌లో ప‌వ‌న్ చేసిన లాంగ్ మార్చ్ లో చేతికి క‌ట్టుతో వేదిక మీద క‌నిపించిన ఆయ‌న హ‌ఠాత్తుగా మాయం అయ్యారు. చివ‌ర‌కు పార్టీ అధ్య‌క్షుడికి కూడా చెప్ప‌కుండానే వేదిక మీద నుంచి వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత పార్టీ స‌మావేశాల‌కు కూడా దూరంగా ఉంటూ వ‌స్తున్నారు. ఇవ‌న్నీ త్వ‌ర‌లో జ‌న‌సేన‌ను వీవీ వీడుతున్నార‌నడానికి సంకేతాలుగా చాలాకాలంగా క‌నిపిస్తున్నాయి. ఇక చివ‌ర‌కు బీజేపీతో బంధం త‌ర్వాత ఎవ‌రి భ‌విష్య‌త్ వారు చూసుకోవ‌డం ఉత్త‌మం అని ఆర్ఎస్ఎస్ తో స‌న్నిహిత సంబంధాలున్న వీవీ నిర్ణ‌యించుకున్న‌ట్టు క‌నిపిస్తోంది. నేరుగా బీజేపీలో ఉంటే శ్రేయ‌స్క‌రం త‌ప్ప దానికి తోక‌పార్టీ నాయ‌కుడిగా ఉండ‌డం వ‌ల్ల ఉప‌యోగం లేద‌నే అభిప్రాయానికి వ‌చ్చి ఉంటార‌ని భావిస్తున్నారు.

వీవీ ల‌క్ష్మీనారాయ‌ణ లేఖ నేప‌థ్యంలో ప‌వ‌న్ సినిమాల చుట్టూ చ‌ర్చించ‌డం విశేషంగా క‌నిపిస్తోంది. కానీ అస‌లు విష‌యం ఆ లేఖ‌లో పేర్కొన్న‌ట్టుగా నిల‌క‌డ‌లేమి. ఒక‌టి చెప్పి మ‌రోటి చేయ‌డం..తాను చెప్పిన దానికే త‌ద్విరుద్ధంగా వ్య‌వ‌హ‌రించ‌డం వంటి వైఖ‌రి అన్న‌ది అంద‌రికీ అర్థ‌మ‌వుతోంది. అయినా జ‌నసేన మాత్రం విష‌యాన్ని సినిమాల చుట్టూ తిప్పాల‌ని చూస్తోంది. నిజంగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ త‌న సినిమాలు తాను చేసుకోవ‌డం ఎవ‌రికీ పెద్ద అభ్యంత‌రం ఉండ‌దు. కానీ పార్టీ అధ్య‌క్షుడిగా శ్రేణుల‌కు త‌గిన స‌మ‌యం కేటాయించ‌కుండా, త‌న సినిమాలు తాను చేసుకుంటే ఇక పార్టీ ప‌రిస్థితి ఏమి కావాలి.. ఆయ‌న్ని న‌మ్ముకుని వ‌చ్చిన వారు ఏమి కావాలి.. వారంద‌రికీ ఇక పూర్తిగా రాజ‌కీయాలేన‌ని చెప్పిన మాట‌లు ఎందుకు..మ‌ళ్లీ దానిని మార్చ‌డం ఎందుకు అనే ప్ర‌శ్న‌లు ఉద‌యిస్తాయి. ఇప్పుడు జ‌న‌సేన‌ను దాదాపుగా బీజేపీ చేతుల్లో పెట్టేసి ప‌వ‌న్ చెప్పిన‌ట్టు త‌న మీద ఆధార‌ప‌డిన వారి కోసం సినిమాలు చేస్తే, మ‌రి రాజ‌కీయంగా ఆధార‌ప‌డిన వారి భ‌విత‌వ్యం ఏమి కావాలన్న‌దే ప్ర‌శ్న‌. అందుకే ఇప్పుడు ఈ అంశంలో చ‌ర్చ సాగుతోంది. ప‌వ‌న్ నిల‌క‌డ‌లేమి, గాలివాటంగా వ్య‌వ‌హ‌రించ‌డం, ఏది చెప్పినా దాని మీద నిల‌బ‌డ‌కుండా ప‌దే ప‌దే మాట మార్చ‌డం వంటి వైఖ‌రి కార‌ణంగానే స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌న్న‌ది సుస్ప‌ష్టం.

రాజీనామా లేఖ‌లో కూడా ఇలాంటి అంశాలున్న‌ప్ప‌టికీ వాటిని ప‌క్క‌న పెట్టి సినిమాలు, షూటింగ్ లంటూ చ‌ర్చించ‌డం ద్వారా ప‌వ‌న్ రాజ‌కీయంగా సాధించేదేమీ ఉండ‌దు. పైగా జ‌నసేన శిబిరంలో ఏర్ప‌డిన గంద‌ర‌గోళం స‌మ‌సిపోయేదానికి తోడ్ప‌డ‌దు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి