iDreamPost

ఇవేం టాస్కులు బిగ్ బాస్ గారూ

ఇవేం టాస్కులు బిగ్ బాస్ గారూ

ఏంటో బిగ్ బాస్ పైత్యాలు పరాకాష్టకు చేరుకుంటున్నాయి. టాస్కుల పేరుతో చేయిస్తున్న పనులు కొన్ని వినోదాత్మకంగా ఆసక్తికరంగా ఉన్నప్పటికి మరికొన్ని మాత్రం చాలా విచిత్రంగా నిలుస్తున్నాయి. వాటిని చేసిన వాళ్ళను నాగార్జున అతిశయోక్తితో పొగడటం ఏమిటో అంతు చిక్కడం లేదు. దానికి ఉదాహరణగా నిన్న జరిగిన అమ్మ రాజశేఖర్ అరగుండు ప్రహసనం గురించి చెప్పుకోవచ్చు. వచ్చే వారం నామినేషన్స్ నుంచి కాపాడుకోవడానికి హాఫ్ షేవ్(సగం గుండు, సగం గెడ్డం)చేయించుకోవడానికి ఎవరైనా సిద్ధమా అని నాగ్ పిలుపు ఇచ్చినప్పుడు రాజశేఖర్ ముందుకు వచ్చారు. సభ్యులు వద్దు వద్దు అంటూ ఘొల్లున మొత్తుకున్నారు.

దివి ఏకంగా భోరుభోరున ఏడ్చేసింది. ఈ కార్యక్రమాన్ని నోయెల్ ట్రిమ్మర్ సహాయంతో దిగ్విజయంగా పూర్తి చేశాడు. ఇక దీన్నో గొప్ప త్యాగంగా, అర్ధనారీశ్వడితో పోలుస్తూ దీని వల్ల ఎంతో ఎత్తుకు ఎదిగారని అమ్మ రాజశేఖర్ ని నాగార్జున పొగడ్తల పల్లకి ఎక్కించడం మరీ టూ మచ్ గానే ఉంది. జుట్టు అంటే అదేం కిడ్నీనో మరొకటో కాదు. పట్టుమని మూడు నెలలు గడిస్తే బారెడు వస్తుంది. అమ్మాయి అయితే ఏదో అనుకోవచ్చు. కానీ అందరికంటే వయసులో చాలా పెద్దవాడైన అమ్మ రాజశేఖర్ కురులను ఇచ్చేయడం వల్ల వచ్చిన తీవ్ర ముప్పేదో ఎవరికైనా అర్థమైతే ఒట్టు. కాకపోతే ఈ ఎపిసోడ్ ని మాంచి సీరియల్ తరహా డ్రామాతో పండించడం బహుశా బిగ్ బాస్ ఫ్యాన్స్ కి నచ్చుతుందేమో

ఇక తొమ్మిది నామినేషన్లలో ముగ్గురు సేఫ్ అయ్యారు. లాస్య, నోయెల్, హారికలు ఎండుమిర్చి, స్విమ్మింగ్ పూల్ టాస్క్ ద్వారా రక్షింపబడ్డారు. ఇక అమ్మ రాజశేఖర్ అరగుండు కొట్టుకున్నందుకు తనను తాను సేవ్ చేసుకున్నాడు. దీని కన్నా ముందు దోసలు వేసే పోటీ జరిగింది. అమ్మ రాజశేఖర్ టీమ్ 15, లాస్య టీమ్ 12 దోసెల చొప్పున వేసి విన్నర్ అండ్ రన్నర్ గా నిలిచారు. ఈ సందర్భంగా కూడా వేడి వేడి వాదోపవాదాలు జరిగాయి. నాగార్జున అందరికి వంతుల వారీగా యథావిధిగా క్లాసులు పీకారు. కొన్ని ఎపిసోడ్లకు తను ఉండబోవడం లేదనే పుకార్లకు చెక్ పెడుతూ నాగ్ స్వయంగా రావడంతో వాటికి శుభం కార్డు పడింది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి