iDreamPost

కుప్పకూలిన వెస్టిండీస్! దంచికొడుతున్న టీమిండియా ఓపెనర్లు

  • Published Jul 13, 2023 | 7:47 AMUpdated Jul 13, 2023 | 7:47 AM
  • Published Jul 13, 2023 | 7:47 AMUpdated Jul 13, 2023 | 7:47 AM
కుప్పకూలిన వెస్టిండీస్! దంచికొడుతున్న టీమిండియా ఓపెనర్లు

వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి రోజు టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ జట్టు కేవలం 150 పరుగులకే కుప్పకూలింది. వరల్డ్ నంబర్ వన్ టెస్ట్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ మాయాజాలం ముందు విండీస్ బ్యాటర్లు నిలువలేకపోయారు. బంతిని అశ్విన్ గిర్రున తిప్పుతుంటే.. ఎదుర్కొలేక చతికిల పడ్డారు. చాలా రోజుల తర్వాత గ్రౌండ్లోకి దిగిన అశ్విన్.. వికెట్ల పండగ చేస్తున్నాడు. అతనికి మరో స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా కూడా తోడు కలవడంతో.. ఇద్దరూ కలిసి విండీస్ వెన్ను విరిచారు. అశ్విన్ 5 వికెట్లు దక్కించుకోగా.. జడేజా 3 వికెట్లు పడగొట్టాడు.

వెస్టిండీస్ బ్యాటర్లలో అలిక్ అథానాజ్ మినహా మరెవ్వరూ కనీసం పోటీ ఇవ్వలేకపోయారు. అతనొక్కడే 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 47 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్, లేదా 20 లోపలే అవుట్ అయ్యారు. అలిక్ రాణించడంతో విండీస్‌కు ఆ మాత్రం స్కోర్ అయినా దక్కిందని చెప్పాలి. భారత బౌలర్లలో అశ్విన్ 5, జడేజా 3 వికెట్లు తీసుకోగా సిరాజ్, శార్దుల్ ఠాకూర్ చెరో వికెట్ పడగొట్టారు. దీంతో వెస్టిండీస్ 64.3 ఓవర్లలో 150 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

టీమిండియా కొత్త ఓపెనింగ్ జోడీ సూపర్ హిట్..
ఈ మ్యాచ్‌లో యువ క్రికెటర్లు యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేశారు. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ జైస్వాల్‌తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించాడు. గతంలో ఓపెనర్‌గా ఆడిన గిల్ మూడో స్థానంలో ఆడనున్నాడు. అయితే.. తొలి మ్యాచ్ ఆడుతున్న జైస్వాల్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. వాటిని అందుకుంటూ.. అతను మంచి ఆరంభం అందుకున్నాడు. టెస్టు కెరీర్‌లో ఫోర్‌తో తన పరుగుల కౌంట్‌ను ప్రారంభించాడు.

మరో వైపు రోహిత్ సైతం తన అనుభవాన్ని ఉపయోగించి యువ పార్టనర్‌తో సమన్వయంతో ఆడాడు. తొలి రోజు టీమిండియా వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. జైస్వాల్ 73 బంతుల్లో 6 ఫోర్లతో 40 పరుగులు చేయగా, రోహిత్ శర్మ 65 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌తో 30 పరుగులు చేసి.. జట్టు పటిష్టస్థితిలో నిలిపారు. ఇదే ఊపును రెండో రోజు కొనసాగిస్తే.. విండీస్‌ను ఇన్నింగ్స్ తేడాతో ఓడించే అవకాశం ఉంది. అయితే.. టీమిండియా ప్రయోగించిన కొత్త ఓపెనింగ్ జోడీ తొలి రోజే మంచి మార్కులు కొట్టేసి సూపర్ హిట్ జోడీగా పేరుతెచ్చుకోవడంపై భారత క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి విండీస్‌తో తొలి రోజు ఆటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి:
ఒక వికెట్ రెండు రికార్డులు! అశ్విన్ అరుదైన ఘనత..
వీడియో: ఒంటిచేత్తో కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన సిరాజ్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి