iDreamPost

తీవ్ర విషాదం..డ్రైవింగ్‌ చేస్తూ ఫోన్ మాట్లాడుతుండగా పేలిన మొబైల్‌..!

  • Author Dharani Updated - 12:59 PM, Thu - 15 June 23
  • Author Dharani Updated - 12:59 PM, Thu - 15 June 23
తీవ్ర విషాదం..డ్రైవింగ్‌ చేస్తూ ఫోన్ మాట్లాడుతుండగా పేలిన మొబైల్‌..!

ఈమధ్య కాలంలో మొబైల్‌ ఫోన్‌లు పేలుతున్న సంఘటనలు తరచుగా చూస్తున్నాం. ఛార్జింగ్‌ పెట్టి ఉన్న సమయంలోనే కాక.. అసలే మొబైల్‌లో వినియోగించని సమయంలో కూడా పేలుడు చోటు చేసుకుంటున్న ఘటనలు చూశాం. కొన్ని రోజుల క్రితం.. వరంగల్ జిల్లాలోని ఎనుమాముల మార్కెట్లో స్మార్ట్ ఫోన్ పేలిన సంగతి తెలిసిందే. ఓ రైతు తను పండించిన మిరప పంటను అమ్ముకునేందుకు ఎనుమాముల మిర్చి మార్కెట్ కి వచ్చాడు. ఇంతలో ఆయనకు ఫోన్ కాల్ రాగానే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడే క్రమంలో ఒక్కసారిగా స్మార్ట్ ఫోన్ పేలింది. ఈ ఘటనలో ఆ రైతు చేయికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణం మరవకముందే.. అదే వరంగల్‌ జిల్లాలో మరోసారి మొబైల్‌ ఫోన్‌ పేలడంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు.ఆ వివరాలు..

ఈ విషాదకర సంఘటన వరంగల్‌ జిల్లా, పర్వతగిరి మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. సంధ్య తండా కు చెందిన గగులోతు రవి వ్యక్తి ట్రాక్టర్‌ డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు… తన ట్రాక్టర్ మరమ్మత్తుల నిమిత్తం వరంగల్ నగరానికి బయలుదేరాడు. డ్రైవింగ్‌లో ఉండగా.. రవికి కాల్‌ వచ్చింది. అలానే కాల్‌ లిఫ్ట్‌ చేసి మాట్లాడుతున్నాడు.

అలా ఫోన్ మాట్లాడుతుండగానే.. ఉన్నట్లుండి ఒక్కసారిగా ఫోన్ నుంచి మంటలు వచ్చి పేలిపోయింది. దీంతో డ్రైవింగ్ చేస్తున్న అతను ఒక్కసారిగా భయాందోళనకు గురై ట్రాక్టర్ స్టీరింగ్ ని విడిచిపెట్టాడు. రవి అలా చేయడంతో.. ఆ ట్రాక్టర్ కంట్రోల్‌ తప్పి.. ఒక్కసారిగా బోల్తా కొట్టి పక్కనే ఉన్న ఆటోని ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. ప్రమాదం గమనించిన స్థానికులు రవిని, ఆటో డ్రైవర్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ఫోన్లు పేలడానికి కారణాలు..

  1. బ్యాటరీ లోపం కారణంగా కొన్ని స్మార్ట్ ఫోన్లు పేలిపోతాయి.
  2. కొన్ని సార్లు తయారీ లోపం కారణంగా కూడా స్మార్ట్ ఫోన్లు పేలే అవకాశాలున్నాయి.
  3. ఛార్జింగ్‌ పెట్టిన సమయంలో బ్యాటరీ వేడెక్కడం వల్ల కూడా మొబైల్ ఫోన్స్ పేలుతాయి.
  4. అలానే ఛార్జింగ్‌ కోసం కంపెనీ చార్జర్ కాకుండా ఇతర చార్జర్లను వినియోగించడం వల్ల కూడా బ్యాటరీలు పేలే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.
  5. మొబైల్‌ ఛార్జింగ్ పెట్టి కాల్‌ మాట్లాడడం, యూట్యూబ్ వీడియోలు చూడడం వల్ల కూడా పేలుడు సంభవించే అవకాశం ఉంది.
  6. అలానే ఫోన్ మాట్లాడే సమయంలో ఇంటర్నెట్ ఆన్ చేసి మాట్లాడడం వల్ల కూడా మొబైల్‌ పేలవచ్చని నిపుణులు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి