iDreamPost

పుట్టినరోజు వేడుకల్లో అలా చేస్తే.. ఇకపై జైలుకే.. హెచ్చరించిన పోలీసులు

  • Published Aug 30, 2023 | 10:26 AMUpdated Aug 30, 2023 | 10:26 AM
  • Published Aug 30, 2023 | 10:26 AMUpdated Aug 30, 2023 | 10:26 AM
పుట్టినరోజు వేడుకల్లో అలా చేస్తే.. ఇకపై జైలుకే.. హెచ్చరించిన పోలీసులు

పుట్టినరోజు వేడుక అంటే.. ఎంతో సంతోషంగా కుటుంబ సభ్యులు, సన్నిహితులు మధ్య జరుపుకునే వేడుక. అయితే ఈ మధ్య కాలంలో కొందరు బర్త్‌డే వేడుకల పేరిట.. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తూ.. తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాక.. జనాలను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా బర్త్‌డే వేడుకల్లో మారణాయుధాలు వాడటం ఈ మధ్య కాలాంలో ఫ్యాషన్‌గా మారింది. తల్వార్‌, కత్తులు, తుపాకులతో కేక్‌ కటింగ్‌ చేస్తూ.. ఉన్మాదులుగా ప్రవర్తిస్తున్నారు కొందరు యువకులు. ఈ క్రమంలో తాజాగా పోలీసులు.. బర్త్‌డే వేడుకలకు సంబంధించి.. కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఆ వివరాలు..

బహిరంగంగా తల్వార్‌ను ప్రదర్శించడంతో పాటు.. దానితో ప్రదర్శనలు చేస్తే.. అలాంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని.. వరంగల్‌పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. ఇటీవల కాలంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో తల్వార్లు, కత్తుల సంస్కృతి పెరిగిపోవడంతో పాటు కొంత మంది వ్యక్తులు తల్వార్లు, కత్తులతో యథేచ్ఛగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫిర్యాదులు పెరగడంతో.. దీనిపై సీపీ రంగనాథ్‌ ప్రత్యేక దృష్టి సారించారు.

అంతేకాక ఇక మీదట ఎవరైనా పుట్టిన రోజుల వేడుకల సందర్భంగా కానీ.. లేదా ఇతర కార్యక్రమాల్లో భాగంగా కానీ.. తల్వార్లను బహిరంగంగా పైకి లేపి చూపడం.. వాటిని తిప్పతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేయటం లాంటివి చేస్తే.. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రంగనాథ్‌ హెచ్చరించారు. ముఖ్యంగా పుట్టినరోజు వేడుకల సందర్భంగా తల్వార్లు లేదా కత్తులతో కేకులను కట్ చేస్తున్నట్లుగా దిగిన ఫోటోలతో కూడిన ప్లెక్సీలను ఏర్పాటు చేసినా.. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసినా.. అలాంటి వారిపై ఆయుధాల చట్టం క్రింద కేసులు నమోదు చేసి జైలుకు పంపుతామని హెచ్చరించారు.

అంతేకాక ఈ మధ్యకాలంలో కొందరు యువకులు బర్త్‌డే సెలబ్రేషన్స్‌ పేరుతో.. ప్రధాన రోడ్డు మార్గాల్లో బైక్‌లు ఆపి.. పుట్టిన రోజు వేడుకలు చేసుకుంటూ.. సాధారణ జనాలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇకపై రోడ్ల మీద సెలబ్రేషన్స్‌ పేరుతో వేడుకలు చేసి.. జనాలను ఇబ్బంది పెడితే.. అలాంటి వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని.. ఇతరులను ఇబ్బంది పెట్టవద్దని సూచించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి