iDreamPost

మరో 20 రోజుల్లో పెళ్లి.. వారం రోజులు మృత్యువుతో పోరాడి..

మరో 20 రోజుల్లో పెళ్లి.. వారం రోజులు మృత్యువుతో పోరాడి..

మృత్యువు ఎప్పుడు? ఎలా? ఏ రూపంలో మనిషిని పలకరిస్తుందో ఎవ్వరమూ చెప్పలేము. కులం, మతం, ప్రాంతం, పేద, ధనిక ఇలా ఎలాంటి తేడాలు చూడకుండా మనిషిని చేరుకునేది మృత్యువు ఒక్కటే. అలాంటి మృత్యువు చనిపోయిన వారిని శ్మశానానికి.. బతికున్న వారిని దుఃఖానికి చేరువచేస్తుంది. తాజాగా, ఓ యువకుడి జీవితం అర్థాంతరంగా ముగిసింది. మరో 20 రోజుల్లో పెళ్లి ఉండగా.. రోడ్డు ప్రమాదానికి గురైన అతడు వారం రోజులు ప్రాణాలతో పోరాడి కన్నుమూశాడు. ఈ సంఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.

ఆ పూర్తి వివరాల్లోకి వెళితే.. విశాఖ, జీవీఎంసీ 94వ వార్డుకు చెందిన పోతయ్య, వెంకటలక్ష్మి దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు వీరాంజనేయులు గోపాలపట్నం దరి 470 సచివాలయంలో విధులు నిర్వహిస్తున్నాడు. వీరాంజనేయకుమార్‌కు ఇటీవలే అనకాపల్లికి చెందిన అమ్మాయితో పెళ్లి కుదిరింది. నిశ్చితార్థం కూడా జరిగింది. ఈ నెల 28న పెళ్లి చేయటానికి ముహూర్తం కుదిరింది. ఏర్పాట్లు కూడా శరావేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత నెల 30న రోడ్డు దాటుతున్న వీరాంజనేయకుమార్‌ను రెండు బైకులు ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో అతడి తలకు బలమైన గాయాలయ్యాయి. దీంతో అతడు ఆపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు.

వాహనదారులు అతడ్ని హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వైద్యులు అతడి తలకు సర్జరీ చేశారు. అయినా లాభం లేకపోయింది. వీరాంజనేయకుమార్‌ ఆరోగ్య పరిస్థితి అంతకంతకూ క్షీణిస్తూ రాసాగింది. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఉదయం అతడి ఆరోగ్య పరిస్థితి వైద్యుల చెయ్యి దాటిపోయింది. చికిత్స పొందుతూ అతడు కన్నుమూశాడు. మరో 20 రోజుల్లో పెళ్లి ఉండగా వీరాంజనేయకుమార్‌ అర్థాంతరంగా చనిపోవటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామస్తులు సైతం శోక సంద్రంలో మునిగిపోయారు. మరి, ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి