iDreamPost

వరుణ్ డాక్టర్ రివ్యూ

వరుణ్ డాక్టర్ రివ్యూ

నిన్న బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన కొండపొలం, ఆరడుగుల బులెట్ తర్వాత ఈ రోజు శివ కార్తికేయన్ తమిళ డబ్బింగ్ సినిమా వరుణ్ డాక్టర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒరిజినల్ టైటిల్ లో వరుణ్ లేకపోయినా ఇక్కడేదో రిజిస్ట్రేషన్ సమస్య వల్ల హీరో పేరు జోడించినట్టు ఉన్నారు. నయనతార కోకో కోకిలతో తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకున్న నెల్సన్ దిలీప్ కుమార్ దీనికి దర్శకుడు కావడంతో ప్రేక్షకుల్లో దీని మీద ఓ మోస్తరు అంచనాలు ఉన్నాయి. ట్రైలర్ ఆసక్తికరంగా కట్ చేయడంతో వీకెండ్ కి బెటర్ ఆప్షన్ గా ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమయ్యింది. మరి డాక్టర్ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందో లేదో రివ్యూలో చూద్దాం

కథ

ఆర్మీ డాక్టర్ వరుణ్(శివ కార్తికేయన్)ఇంట్లో వాళ్ళు చూసిన సంబంధం పద్మిని(ప్రియాంక అరుళ్ మోహన్)తో పెళ్ళికి ఎస్ చెప్తాడు. కొద్దిరోజులు అయ్యాక వరుణ్ మనస్తత్వం తనకు సూట్ కాదని గుర్తించిన ఆ అమ్మాయికి అతనితో బ్రేక్ అప్ చెబుతుంది. సరిగ్గా అదే సమయంలో పద్మిని ఇంట్లో స్కూల్ కెళ్లే పాప కిడ్నాప్ కు గురవుతుంది. దాంతో వాళ్లకు సహాయం చేసేందుకు వరుణ్ రంగంలోకి దిగుతాడు. ఒక్కో చిక్కుముడిని విప్పుతూ పోతే ఇలా ఎందరో ఓ దుర్మార్గుడి చెరలో ఉన్నారని తెలుస్తుంది. దాంతో మొత్తం పద్మిని ఫ్యామిలీతో సహా గోవాకు షిఫ్ట్ అవుతాడు. అక్కడ ఎలా వాళ్ళను కాపాడాడు అనేది తెరమీద చూడాలి

నటీనటులు

శివ కార్తికేయన్ డాక్టర్ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యాడు కానీ ఇతనిలో అంతగా ఎక్స్ ప్రెషన్లు పలకవు. పాత్ర పరంగా సీరియస్ గా ఉండటం అవసరమే అయినా ఇది తను మాత్రమే చేయగలడు అనిపించే సీన్ కానీ ఫైట్ కానీ ఒక్కటీ ఇందులో లేవు. ఒకరకంగా చెప్పాలంటే చాలా చోట్ల బ్లాంక్ ఫేస్ అనిపిస్తుంది. బాగా నటించాడు అని చెబితే అవతలి వాళ్ళను మోసం చేసినట్టే. కాకపోతే రూపం చక్కగా ఉండటం ప్లస్ పాయింట్. ప్రియాంకా మోహన్ అందంగా ఉంది కానీ మొదటి పది నిముషాలు తర్వాత యాక్టింగ్ చేసే స్కోప్ లేకపోయింది. ఎప్పటిలాగే యోగిబాబు తన టైమింగ్ తో ఆడుకున్నాడు.

మెయిన్ విలన్ గా చేసిన వినయ్ రాయ్ స్టైలిష్ గా ఉండటమే కాదు ఆకట్టుకునేలా చేశాడు. ఇతను ఒకప్పటి వాన సినిమా హీరో అంటే ఆశ్చర్యం కలగక మానదు. మిలింద్ సోమన్ లాంటి టెర్రిఫిక్ ఆర్టిస్ట్ ని రెండు మూడు సన్నివేశాలకు పరిమితం చేసి వృథా చేశారు. ఇళవరుసు, దీప శంకర్, అరుణ్ అలెగ్జాండర్, రఘురాం తదితరులు పాత్రలకు తగ్గట్టు మంచి టైమింగ్ తో ఆకట్టుకున్నారు. పొట్టి పోలీస్ గా నటించిన ఆర్టిస్టు మంచి నవ్వులు పూయించారు. రోడీస్ షో కవల జడ్జీలు రఘురామ్ రాజీవ్ లక్ష్మణ్ లు మంచి ఛాయస్. వీళ్ళు కాకుండా ప్రత్యేకంగా ప్రస్తావించే వాళ్ళు ఎవరూ లేరు.

డైరెక్టర్ అండ్ టీమ్

డార్క్ కామెడీకి సౌత్ ప్రేక్షకులు ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నారు. నెల్సన్ మొదటి సినిమా ఈ జానర్ లోనే సక్సెస్ కొట్టింది. తెలుగు ఆడియన్స్ కూడా రాజరాజ చోర లాంటివాటిని బాగానే ఆదరించారు. చాలా సీరియస్ థీమ్ లో హాస్యాన్ని జొప్పించి కథనాన్ని పరుగులు పెట్టించడం ఈ శైలిలోని ప్రత్యేకత. నెల్సన్ దిలీప్ కుమార్ మరోసారి ఈ ఫార్ములానే నమ్ముకున్నాడు. ఒక అమ్మాయి కిడ్నాప్ కు గురై హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాకు చిక్కడం అనేది మాములుగా చూసుకుంటే ఒళ్ళు జలదరించే పాయింట్. కానీ దానికి పాత్రలు చెప్పే డైలాగుల ద్వారా నవ్వించే ప్రయత్నం చేసిన నెల్సన్ ఆ ఒక్క విషయంలో సగం విజయం సాధించాడు.

రెండున్నర గంటల పాటు ఇలాంటి డ్రామాని నడిపించడం అంత ఈజీ కాదు. పాటలని ఇరికించకుండా కేవలం టైం పాస్ చేయించే దాని మీదే దృష్టి పెట్టిన నెల్సన్ కాస్త సీరియస్ థ్రిల్స్ ని కూడా జోడించి ఉంటే బాగుండేది. మెట్రో ట్రైన్ లో ఫైట్, ప్రీ క్లైమాక్స్ కు ముందు జరిగే హీరో విలన్ క్లాష్ ఇవన్నీ ఆసక్తికరంగా పండాయి. కానీ ఎంగేజింగ్ గా చూసేందుకు ఇవొక్కటే సరిపోలేదు. పాప కిడ్నాప్ అయ్యాక జరిగే తతంగం చాలా సిల్లీగా ఉంటుంది. కాకపోతే అక్కడ జోకులు కరెక్ట్ గా పేలడంతో ఓ మోస్తరుగా ఎంజాయ్ చేస్తాం కానీ లాజికల్ గా ఆలోచిస్తే అక్కడ నెల్సన్ చిన్న చిన్న తప్పులు చాలా చేశాడు. కేవలం నవ్విస్తే చాలు అనుకునే బాపతు ఈయన

డాక్టర్ టైటిల్ కి అతను చేసే వృత్తికి అక్కడక్కడా లింక్ పెట్టారు తప్ప ఒకరకంగా చెప్పాలంటే ఇదే తరహా ట్రీట్మెంట్ మనం నాని గ్యాంగ్ లీడర్ లో చూశాం. కాకపోతే అందులో డ్రామా పండలేదు. కామెడీని విక్రమ్ కుమార్ బాలన్స్ చేయలేకపోయాడు. దాని వల్లే ఫెయిల్ అయ్యింది. కానీ నెల్సన్ ఈ విషయంలో జాగ్రత్త పడ్డాడు. అలా అని పూర్తిగా బెస్ట్ ప్రోడక్ట్ ఇవ్వలేదు కానీ ఇదేం సినిమారా బాబు అనిపించకుండా నెట్టుకొచ్చాడు. ఇదే కథను సీరియస్ మోడ్ లో చెప్పి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేని సెట్ చేసుకుంటే విజయ్ తుపాకీ లాగా ఇది కూడా గుర్తుండిపోయే యాక్షన్ ఎంటర్ టైనర్ అయ్యేది. కానీ నెల్సన్ చెప్పాలనుకున్నది నవ్విస్తూనే కాబట్టి జస్ట్ ఓకేగా మిగిలింది

సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎప్పటిలాగే ఎలివేట్ అయ్యింది కానీ రాను రాను ఇతను కూడా రొటీన్ దారిలో వెళ్తున్నట్టు అనిపిస్తోంది. ఉన్న ఒక్క పాట కూడా అతనే పాడేసి ఇంతకు ముందు ఎక్కడో విన్నట్టు ఉందే అనే ఫీలింగ్ కలిగించాడు. విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం బాగుంది. డిఫరెంట్ లొకేషన్లో క్లిష్టమైన పనితనాన్ని చక్కగా చూపించారు. నిర్మల్ ఎడిటింగ్ మొహమాటపడింది. అక్కడక్కడా కత్తెర్లకు ఛాన్స్ ఉన్నా వదిలేశారు. ప్రొడక్షన్ వేల్యూస్ మాత్రం బాగా రిచ్చు. దీన్ని థియేటర్ కోసమే ఎందుకు అన్నిసార్లు వాయిదా వేసుకుంటూ వచ్చారో అర్థమైపోతుంది. హీరో మార్కెట్ కి మించి బడ్జెటే ఇది

ప్లస్ గా అనిపించేవి

సిచువేషనల్ కామెడీ
క్యాస్టింగ్ పెర్ఫార్మన్స్
మెట్రో ట్రైన్ ఫైట్
కెమెరా వర్క్

మైనస్ గా తోచేవి

మంచి ఆర్టిస్టులను వాడుకోకపోవడం
స్లో పేస్
సెకండ్ హాఫ్ డ్రాగ్
జీరో ఎమోషన్స్

కంక్లూజన్

వరుణ్ డాక్టర్ సినిమా ట్రైలర్ చూసో లేక పోస్టర్లను బట్టో ఇదో అదిరిపోయే క్రైమ్ థ్రిల్లర్ అనుకుంటే మీ అంచనాలు రివర్స్ అవుతాయి. ఓ మోస్తరు డార్క్ కామెడీని భారీ సెటప్ తో గ్రాండ్ మ్యూజిక్ తో ఎంజాయ్ చేయాలనుకుంటే దీన్ని ట్రై చేయొచ్చు. ముఖ్యంగా సెకండ్ హాఫ్ అక్కడక్కడా శృతి తప్పి స్లోగా సాగుతున్నా భరించగలిగితే ఈ డాక్టర్ చేసే ఆపరేషన్ ని ఎంజాయ్ చేయొచ్చు. అంతకు మించి ఇంచు ఎక్కువ ఆశించినా మెప్పించడం కష్టమే. ఎమోషన్స్, యాక్షన్, ఎంటర్ టైన్మెంట్, కామెడీ అన్నీ బ్యాలన్స్ చేసి ఫుల్ మీల్స్ ఇవ్వాలనుకున్న డాక్టర్ ఫైనల్ గా ఓ మోస్తరుగా నవ్వించడంలో మాత్రమే సక్సెస్ అయ్యాడు.

ఒక్క మాటలో – నవ్వులు + నీరసం = యావరేజ్ డాక్టర్

Also Read : కొండపొలం రివ్యూ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి