iDreamPost

వారసుడు బృందానికి కోరుకోని వివాదాలు

వారసుడు బృందానికి కోరుకోని వివాదాలు

కావాలని కాకపోయినా అనుకోకుండా అన్నది ఏదైనా సరే సోషల్ మీడియా పుణ్యమాని వైరల్ టాపిక్ గా మారిపోతోంది. విడుదలకు ముందు వారసుడు నిర్మాత దిల్ రాజు విజయ్ ని తమిళనాడు నెంబర్ వన్ స్టార్ అనడం ఎంత రచ్చ చేసిందో గుర్తుందిగా. అజిత్ ఫ్యాన్స్ ఆయన్ను ట్విట్టర్ లో గట్టిగానే తగులుకున్నారు. ఇటీవలే వంశీ పైడిపల్లి ఒక ఆరవ ఛానల్ ఇంటర్వ్యూలో సినిమా టీవీ సీరియల్ లా ఉందన్న కామెంట్స్ కు ఘాటుగా స్పందించడం మరోసారి టార్గెట్ అయ్యేందుకు అవకాశం ఇచ్చింది. ఒక మూవీ తీయడానికి టీమ్ చాలా కష్టపడుతుందని, అదంత సులభం కాదని విజయ్ ఈరోజుకి ప్రాక్టీస్ చేసి డైలాగులు చెబుతారని ఇలా ఫ్లోలో ఏదేదో చెప్పేశారు

పైడిపల్లి ఏ ఉద్దేశంతో అన్నా ఆ మాటల్లో మాత్రం లాజిక్ లేదు. ఎందుకంటే ఏ స్టార్ అయినా డాన్సు ఫైట్ ఏది రిహార్సల్ చేసినా అది తీసుకున్న కోట్ల రూపాయల పారితోషికానికి న్యాయం చేయడానికి తప్ప వేరే కారణం ఏముంటుంది. ఇదే వంశీ రెమ్యునరేషన్ తక్కువ తీసుకుని చేయలేదుగా. సో ఇది బిజినెస్. ఇచ్చిపుచ్చుకోవడాలు ప్రొడ్యూసర్ తో మొదలుపెట్టి థియేటర్ ఓనర్ దాకా అందరికీ ఉంటాయి. ఇదేమి సంఘసేవ కాదు. సమాజాన్ని ఉద్దరించేది అంతకన్నా కాదు. కొందరు చెన్నై క్రిటిక్స్ వారసుడుని టీవీ సీరియల్ తో పోల్చడం వంశీకి ఆగ్రహం కలిగించింది. వాటిని ఎందుకు కించపరుస్తారని అది కూడా గొప్ప క్రియేటివ్ వర్క్ అని సమర్ధించారు.

అంతా బాగానే ఉంది కానీ అర్థం లేని విలనిజంతో ఇంట్లో ఆడవాళ్ళను టార్గెట్ చేసుకునే సీరియల్స్ లో ఎంత మాత్రం సృజనాత్మకత ఉంటుందో అందరికీ తెలిసిందే. పైగా వారసుడుని అలా పోల్చినప్పుడు నిజానికి డీ గ్రేడ్ చేసింది వాటిని కాదు సినిమాని. అలాంటప్పుడు ఏదో దాటవేత సమాధానం చెబితే పోయేది కానీ ఇలా కవరింగ్ చేయడం వల్ల ట్రోలింగ్ కు అవకాశం ఇచ్చినట్టు అయ్యింది. మొత్తానికి వారసుడకి టీమ్ ఇచ్చిన ఎలివేషన్లకు తమిళనాడులో మంచి ఫలితమే దక్కింది కానీ తెలుగులో మాత్రం ఆశించిన స్థాయిలో ఆడియెన్స్ రిసీవ్ చేసుకోలేకపోయారు. అజిత్ వలిమైని ఓవర్ టేక్ చేసి మరీ వరిసు ఒరిజినల్ వెర్షన్ 150 కోట్ల గ్రాస్ ని దాటేసింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి