iDreamPost

ప్రధాని మోడీకి అరుదైన బహుమతిని అందజేసిన సచిన్!

  • Author singhj Published - 02:55 PM, Sat - 23 September 23
  • Author singhj Published - 02:55 PM, Sat - 23 September 23
ప్రధాని మోడీకి అరుదైన బహుమతిని అందజేసిన సచిన్!

భారత్​లో క్రికెట్​కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి ఇంట్లోనూ ఈ గేమ్​కు అభిమానులు ఉంటారు. జీవితంలో ఒక్కసారైనా బ్యాట్ పట్టి బంతిని కొట్టని వాళ్లు మన దేశంలో ఉండరని చెప్పడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా పిల్లల నుంచి పెద్దల వరకు కాస్త ఫ్రీ టైమ్ దొరికితే క్రికెట్ ఆడుతూ కనిపిస్తారు. అంతగా ప్రజల జీవితాల్లో క్రికెట్ అనేది మమేకం అయిపోయింది. అందుకే భారత క్రికెట్ బోర్డుతో పాటు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కూడా క్రికెట్​ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. అవసరమైన చోట స్టేడియాలు నిర్మిస్తూ యువతకు ఆడే అవకాశాలు కల్పిస్తోంది. వారిలో ఉన్న టాలెంట్​ను ప్రపంచానికి తెలియజేసేందుకు అవసరమైన సాయం అందిస్తోంది.

మరికొన్ని నెలల్లో భారత్​లో మరో కొత్త అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం అందుబాటులోకి రానుంది. ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాశీ విశ్వనాథుడు కొలువై ఉన్న వారణాసిలో నూతన క్రికెట్ స్టేడియం నిర్మించనున్నారు. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీ ఈ స్టేడియానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఉత్తర్​ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీసీసీఐ ప్రెసిడెంట్ రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, కార్యదర్శి జై షాతో పాటు లెజెండరీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి తదితరులు హాజరయ్యారు. ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. స్టేడియం ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోడీకి సచిన్ అరుదైన బహుమతిని అందజేశారు.

భారత క్రికెటర్ల సంతకాలతో కూడిన జెర్సీని మోడీకి మాస్టర్ గిఫ్ట్​గా ఇచ్చారు. ఈ టీషర్ట్ వెనుక ‘నమో’ అని రాసి ఉండటం విశేషం. సచిన్​తో పాటు జై షా, రోజర్ బిన్నీ కూడా ప్రధానికి బహుమతి అందజేశారు. సంతకాలతో కూడిన ఒక స్పెషల్ బ్యాట్​ను మోడీకి ఇచ్చారు. ఇక, వారణాసి నూతన స్టేడియం విషయానికొస్తే.. దీన్ని శివతత్వం ఉట్టిపడేలా డిజైన్ చేశారు. శివుడి ఆయుధమైన త్రిశూలాన్ని పోలిన ఫ్లడ్​లైట్లు, పరమేశ్వరుడి చేతిలో ఉండే ఢమరుకం రూపంలో పెవిలియన్ స్టాండ్​ను నిర్మించనున్నారు. ప్రేక్షకుల గ్యాలరీని గంగా ఘాట్ మాదిరిగా నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ స్టేడియం నిర్మాణం కోసం 121 ఎకరాల భూమిని యూపీ సర్కారు సేకరించింది. ఇందుకోసం రూ.121 కోట్లు వెచ్చించింది. ఈ స్టేడియం నిర్మాణానికి రూ.330 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా.

ఇదీ చదవండి: వరల్డ్ కప్​కు ముందు చిక్కుల్లో రోహిత్!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి