iDreamPost

అలా ముందుకెళితే కాంగ్రెస్ విజయం తథ్యమట! – ఆశ్చర్యపరుస్తున్న తులసిరెడ్డి వ్యాఖ్యలు

అలా ముందుకెళితే కాంగ్రెస్ విజయం తథ్యమట! – ఆశ్చర్యపరుస్తున్న తులసిరెడ్డి వ్యాఖ్యలు

ఓటమి సహజం.. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే కాంగ్రెస్ విజయం రాష్ట్రంలో, దేశంలో తథ్యమని ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యపరుస్తున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని సీట్లకు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. అధికారంలోకి వస్తే ప్రత్యేకహోదా ఇచ్చే అవకాశం కాంగ్రెస్‌కు ఉందని చెప్పారు.

తులసిరెడ్డి ప్రసంగం పరిశీలిస్తే ఆశ పడొచ్చుకాని మరీ ఇంతగానా అనిపిస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం కూడా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడమే విడ్డూరం. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్‌ను ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆ రెండు ఎన్నికల్లో నిర్ధ్వంద్వంగా తిరస్కరించారు. అనివార్య పరిస్థితుల్లో రాష్ట్ర విభజన చేయాల్సి వచ్చిందని నచ్చజెప్పి తిరిగి ప్రజల విశ్వాసం పొందే ప్రయత్నం ఆ పార్టీ ఇప్పటి వరకూ గట్టిగా చేయలేదు. ఒకప్పడు తమ పార్టీకి కంచుకోట అయిన ఆంధ్రప్రదేశ్‌లో ఈ దుస్థితికి స్వయంకృతమే కారణమన్న తెలివిడి లేకుండా ఇంకా గెలిచేస్తాం.. ప్రత్యేకహోదా ఇచ్చేస్తాం అంటే ఎవరు పట్టించుకుంటారు?

ప్రభుత్వాన్ని విమర్శిస్తే గెలిచేస్తారా?

రెండు వరుస ఓటముల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ నాయకులు పార్టీని వీడారు. కొందరు రాజకీయాలనే వదిలేశారు. మరికొందరు వైఎస్సార్‌ సీపీ, టీడీపీ, బీజేపీల్లో చేరిపోయారు. ఉన్న కొద్దిమంది నాయకులు టీడీపీకి బీ టీంగా పనిచేయడం తప్ప కాంగ్రెస్‌కు తిరిగి పూర్వవైభవం తెచ్చే దిశగా ప్రయత్నం చేయడంలేదన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. క్రమం తప్పకుండా ప్రెస్‌మీట్లు పెట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, ఇక్కడ వైఎస్సార్‌ సీపీని విమర్శించడం తప్ప కాంగ్రెస్‌ వైపు ఓటర్లను ఆకర్షించే నాయకులు లేరు. మెగాస్టార్‌ చిరంజీవి వంటి సినీ గ్లామర్‌ ఉన్న నాయకుడు పార్టీకి దూరం జరిగినా పట్టించుకొనే దిక్కు లేదు.

ఒక్కప్పుడు 14 రాష్ట్రాల్లో అధికారం చెలాయించిన కాంగ్రెస్‌ నేడు రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకే పరిమితం అయింది. మరోపక్క దేశవ్యాప్తంగా అప్రతిహత విజయాలతో బీజేపీ దూసుకుపోతోంది. ఇప్పటికీ గాంధీ – నెహ్రూ కుటుంబం నాయకత్వంలో ఆ పార్టీ నడుస్తోందని, కుటుంబ, వారసత్వ రాజకీయాలను ప్రజలు తిరస్కరించాలని స్వయంగా ప్రధాని మోడీ పిలుపునిస్తున్నా దానికి దీటుగా బదులివ్వలేని స్థితిలో కాంగ్రెస్‌ ఉంది.  కేంద్ర, రాష్ట్ర స్థాయిలో నాయకత్వ లేమితో సతమతమవుతున్న పార్టీ ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. అలాంటి సమయంలో వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని సీట్లకు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే మాత్రం ఓట్లు వచ్చే అవకాశం ఉంటుందా? ఆత్మవిశ్వాసంతో ముందుకెళితే విజయం తథ్యం అన్నమాట వినడానికి బాగానే ఉంటుంది. అంతంత మాత్రంగా ఉన్న నాయకులు, కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపేదెవరు? పార్టీని నడిపేదెవరు? అన్న ప్రశ్నలకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయిన తులసిరెడ్డి సమాధానం ఇవ్వగలరా? అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి