iDreamPost

టీఆర్ఎస్​లో మరో అసమ్మతి గళం

టీఆర్ఎస్​లో మరో అసమ్మతి గళం

తెలంగాణలో వరుసగా రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి పెరుగుతోంది. రోజుకోనేత తమ ధిక్కారం తెలుపుతున్నారు. అయితే ఏ ఒక్కరూ పార్టీని ఉద్దేశించి నేరుగా విమర్శించకుండా.. నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తున్నారు. 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి గెలిచిన తర్వాతి నుంచి ఇది ఎక్కువైంది. తాజాగా సీనియర్ పొలిటీషియన్, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పక్కనే మంత్రి ఉండగానే తన నిరసన తెలిపారు.

వైఎస్ నాకు మంత్రి పదవి ఇచ్చారు..

మొన్న ఓ సమావేశంలో మాట్లాడిన రెడ్యానాయక్.. తన నియోజకవర్గమైన డోర్నకల్ పై వివక్ష చూపుతున్నారని, నిధులు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎవరి నుంచీ మంత్రి పదవి గుంజుకోలేదని, గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు మంత్రి పదవి ఇచ్చారని చెప్పుకొచ్చారు. పక్కనే ఉన్న మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.. ‘‘మీకు కూడా మంత్రి పదవి వస్తుందిలే” అని అన్నారు. వెంటనే స్పందించిన రెడ్యా.. ‘‘మీరు ఉండగా నాకు మంత్రి పదవి రాదు” అని అన్నారు. దీంతో కంగుతినగడం ఎర్రబెల్లి వంతు అయింది.

Also Read : వెంకన్నకు లేని మతభేదం వీళ్లకెందుకో?

ఎవరీ రెడ్యా నాయక్?

దరంసోత్ రెడ్యానాయక్.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన లీడర్. డోర్నకల్ నియోజకవర్గం నుంచి దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2014లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి.. తర్వాత టీఆర్ఎస్​లో చేరారు. ఆయన కుమార్తె కవిత ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రిగా రెడ్యా పని చేశారు. టీఆర్ఎస్​లోనూ మంత్రి పదవి వస్తుందని భావించారు. కానీ గతంలో తన రాజకీయ ప్రత్యర్థి అయిన సత్యవతి రాథోడ్​కు కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. దీంతో రెడ్యా నాయక్ మంత్రి పదవి ఆశలు అడియాశలయ్యాయి.

ఒకరి తర్వాత ఒకరు

టీఆర్ఎస్​లో తరచూ అసమ్మతి గళాలు వినినిపిస్తున్నాయి. కానీ తర్వాత కొన్నాళ్లకే చల్లారుతున్నాయి. దివంగత నాయిని నర్సింహారెడ్డి, ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్ తదితరులు గతంలో తమ అసంతృప్తి వెళ్లగక్కిన వారే. కానీ ఎప్పుడూ నేరుగా కేసీఆర్​ను కానీ, టీఆర్ఎస్​ను కానీ విమర్శించలేదు. ఏడాదిన్నర కిందట జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు తన అనుచరులను రెబల్స్​ గా నిలిపి గెలిపించుకున్నారు. ఇక ఈటల రాజేందర్ వీలు చిక్కినప్పుడల్లా విరుచుకుపడుతున్నారు. అయితే ఎవరిని ఉద్దేశించి, ఎందుకోసం విమర్శలు చేస్తున్నారనేది మాత్రం తెలియడం లేదు. ఇలా నిరసన గళాలు పెరుగుతూనే ఉన్నాయి. చివరికి ఏమవుతుందో మరి!!

Also Read : నాగార్జునసాగర్‌లో కామ్రేడ్స్‌ కొత్త పంథా!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి