iDreamPost

మాటల మాంత్రికుడికి మరో చిక్కు

మాటల మాంత్రికుడికి మరో చిక్కు

అల వైకుంఠపురములోతో మరో ఇండస్ట్రీ హిట్ ఖాతాలో వేసుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కు ఇంకోసారి కాపీ చిక్కు చికాకు పెడుతుందని ఫిలిం నగర్ సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియాలో దీని గురించి విస్తృత చర్చ జరుగుతోంది. దాని ప్రకారం అల వైకుంఠపురములో కథ తనదని 2005లోనే త్రివిక్రమ్ కు చెప్పానని దాన్ని దశ దిశ పేరుతో ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ కూడా చేయించానని చెబుతున్నాడు కృష్ణ అనే రచయిత. అయితే ఆ కథ అప్పటి నుంచి రెన్యూవల్ లో ఉందా లేదా అనేది మాత్రం చెప్పలేదు.

ఈ విషయంగా లీగల్ చర్యలకు సిద్ధ పడుతున్నానని చెప్పడం మరో ట్విస్ట్. ఇంతకీ ఈ కృష్ణ ఎవరో నిజంగా ఆ కథ అతనిదేనా అనే క్లారిటీ కొద్దిరోజులు ఆగితే రావొచ్చు. త్రివిక్రమ్ కు ఈ తలనొప్పి ప్రతి సినిమాకు సర్వసాధారణం అయిపోయింది. అరవింద సమేత వీర రాఘవలో తన మొండికత్తి కథను యధాతధంగా వాడుకున్నారని ఓ సీమ రచయిత బహిర్గతం చేయడం సంచలనం రేపింది. అంతకు ముందు అజ్ఞాతవాసి ఓ ఫ్రెంచ్ సినిమా కాపీ కొట్టారని వివాదం రేగితే ఏకంగా ఆ ఒరిజినల్ దర్శకుడు వచ్చి అది నిజమేనని ట్వీట్ చేసే దాకా వచ్చింది వ్యవహారం.

అఆ టైంలోనూ అసలు కథ రాసిన యద్దనపూడి గారికి క్రెడిట్ ఇవ్వలేదని రిలీజైన మొదట్లో విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత టైటిల్ కార్డ్స్ లో పేరు వేశారు. ఇలా ప్రతి సినిమాకు ఆధారాలతో సహా త్రివిక్రమ్ సినిమాలు కాపీ వార్తల్లో చిక్కుకోవడం, ఎలాగోలా బయటపడి అవి సూపర్ హిట్ కావడం సర్వ సాధారణం అయిపోయింది. ఇప్పుడా కృష్ణ ఎవరో మీడియా ముందుకు వచ్చి బహిర్గతం చేస్తే తప్ప దీని గురించి స్పష్టత రాదు. సినిమా 50 రోజులకు దగ్గరగా ఉన్న టైంలో విడుదలైనప్పుడు కాకుండా ఇప్పుడు కాపీ ఇష్యూ రావడం విచిత్రమే

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి