iDreamPost

కరెంట్ కొరత నిదర్శనం.. వందల రైళ్లు రద్దు..

కరెంట్ కొరత నిదర్శనం.. వందల రైళ్లు రద్దు..

దేశంలో కరెంట్ కష్టాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఎంతలా అంటే ఆఖరుకు రైల్వేలపై కూడా ఈ ఎఫెక్ట్ పడింది. కరెంట్ కోతల వల్ల 657 రైళ్లను రద్దు చేసింది రైల్వేశాఖ. ఇది షాకింగ్ గా మారింది. విద్యుత్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు అడుగంటడంతో విద్యుత్ ఉత్పత్తికి బ్రేక్ పడింది. మరోవైపు ఎండలు మండిపోతుండడంతో కరెంట్ వాడకం బాగా పెరిగిపోయింది. సరిపడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో పలు రాష్ట్రాల్లో కరెంట్ కోతలు విధిస్తున్నారు.

దేశ రాజధాని ఢిల్లీతోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యుత్ కష్టాలు తీవ్రమవుతున్నాయి. ఏపీలోనూ కరెంట్ కొరత తీవ్రంగా ఉంది. పలు జిల్లాల్లో పవర్ హాలిడే కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే దేశంలో కరెంట్ కష్టాలు పెరగడంతో సంక్షోభ నివారణకు కేంద్ర సర్కార్ నడుం బిగించింది. పవర్ ప్లాంట్లకు కోల్ సరఫరా చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టింది. బొగ్గు రవాణాకు ఆటంకం కలుగకుండా కీలక నిర్ణయం తీసుకుంది.

బొగ్గు రవాణా చేసే రైళ్లకు లైన్ క్లియర్ చేసేందుకు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసింది కేంద్ర రైల్వేశాఖ.. మొత్తం 42 రైళ్లను నిరవధికంగా రద్దు చేసినట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు. దేశంలో కరెంట్ కష్టాలు తీవ్రంగా ఉండడంతో త్వరలో మరిన్ని రైళ్లను రద్దు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

వచ్చేనెల చివరి వరకూ 657 ప్యాసింజర్ రైళ్లను రద్దు చేసే యోచనలో మోడీ సర్కార్ ఉంది. ప్యాసింజర్ రైళ్లతోపాటు ఎక్స్ ప్రెస్ మెయిల్ రైళ్లను కూడా ఆపేయబోతున్నారని సమాచారం. రైళ్ల రాకపోకలను నిలిపివేయడం తాత్కాలికమైనదే.. కరెంట్ కష్టాలు తీరాక మళ్లీ ఎప్పటిలాగానే పునరుద్దరిస్తామని రైల్వే అధికారులు చెబుతున్నారు.

దేశంలోని విద్యుత్ ప్లాంట్ల దగ్గర కనీసం 21 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాలి. కానీ ప్రస్తుతం దేశంలోని కొన్ని ప్లాంట్ల దగ్గర ఒక రోజుకు సరిపడా కోల్ కూడా లేదు. అలాంటి ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేశారు.

ఢిల్లీలో కరెంట్ సంక్షోభం తీవ్రంగా కనిపిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే హాస్పిటల్స్ మెట్రో రైళ్లకు కరెంట్ కట్ చేసే పరిస్థితి ఉందని కేజ్రీవాల్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది. వీలైనంత త్వరగా బొగ్గును అందించాలని ఢిల్లీ మంత్రి కేంద్రాన్ని కోరారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి