iDreamPost

Un Known Calls – అపరిచితుల ఫోన్ కాల్స్ కు అడ్డుకట్ట : ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలా

Un Known Calls – అపరిచితుల ఫోన్ కాల్స్ కు అడ్డుకట్ట : ట్రాయ్ చైర్మన్ పీడీ వాఘేలా

గుర్తు తెలియని వ్యక్తులు ఎవరెవరికో ఫోన్లు చేసి.. పేరు, ఊరు చెప్పకుండా బెదిరింపులకు పాల్పడటం పరిపాటిగా మారింది. ఈ విధానానికి స్వస్తి చెప్పేందుకు ట్రాయ్ (TRAI) ఒకడుగు ముందుకేసింది. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ లో కూడా.. వారి పేరు పడే విధంగా చర్యలు చేపట్టింది. సిమ్ కార్డు ఇచ్చే కంపెనీకి అందించే కేవైసీ (know your customer) లో ఉండే పేరు మన ఫోన్ స్క్రీన్ పై కనిపిస్తుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన కంపెనీలతో సంప్రదింపులు జరపనున్నట్లు ట్రాయ్ (TRAI) చైర్మన్ పీడీ వాఘేలా వెల్లడించారు.

కేంద్ర టెలికాం శాఖ నుంచి వచ్చిన సూచనల మేరకు ఈ సదుపాయాన్ని కల్పించనున్నారు. అపరిచిత వ్యక్తుల కాల్స్ (Un Known Calls), మోసపూరిత, స్పామ్ కాల్స్ ను నివారించేందుకు ఈ “కాలర్ ఐడీ” (Caller ID) సౌకర్యాన్ని మొబైల్ వినియోగదారులకు కల్పించాలన్నదే ప్రభుత్వం లక్ష్యం. ఇప్పటికే బ్లాక్ చైన్ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చిన కేంద్రం.. “కాలర్ ఐడీ” (Caller ID)తో మరో అడుగు ముందుకు వేయబోతోంది. ప్రపంచంలో అధికంగా స్పామ్ కాల్స్ వస్తున్న దేశాల్లో భారత్ నాల్గవ స్థానంలో ఉన్నట్లు ఒక సర్వేలో తేలింది.

మన దేశంలో మొబైల్ వాడుతున్న ప్రతివినియోగదారుడికి స్పామ్ కాల్స్ బెడద ఉందనడంలో అతిశయోక్తి లేదు. ప్రతిరోజూ తక్కువలో తక్కువగా కనీసం ఒక స్పామ్ కాల్ అయినా వస్తోంది. ఒక ప్రైవేటు సంస్థ స్పామ్ కాల్స్ గురించి తెలుసుకునేందుకు 37 వేల మందితో సర్వే నిర్వహించగా.. వారిలో 64 శాతం మంది రోజుకు మూడు స్పామ్ కాల్స్ వస్తున్నాయని చెప్పడం గమనార్హం. 14 శాతం మంది వాటిని ముందే గుర్తించడంతో స్పామ్ కాల్స్ లిఫ్ట్ చేయడం లేదని తెలిపారు.

కాగా.. ట్రూ కాలర్ వంటి యాప్ లు క్రౌడ్ సోర్సింగ్ డేటాబేస్ నుంచి తీసుకున్న సమాచారంలో ఉన్న పేరునే స్క్రీన్ పై చూపిస్తాయని ట్రాయ్(TRAI) చెప్తోంది. ట్రూ కాలర్ లో రిజిస్టర్ అయ్యేటపుడు సదరు వ్యక్తి ఏ పేరును ఎంటర్ చేస్తాడో.. ఆ పేరునే ట్రూ కాలర్ చూపిస్తుందని, కేవైసీ వివరాల ఆధారిత పేరను ట్రూ కాలర్ చూపించక పోవచ్చని ట్రాయ్ చెప్పింది. అయితే.. ట్రాయ్ చెప్తున్న “కాలర్ ఐడీ” (Caller ID)పై భిన్న స్వరాలు వినవస్తున్నాయి. “కాలర్ ఐడీ” (Caller ID) ద్వారా వినియోగదారులు తమ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలుగుతుందని వాదిస్తే మాత్రం.. వినియోగదారుల డేటాకు రక్షణ కల్పించేలా ట్రాయ్ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి