iDreamPost

జగన్ ని కలవబోతున్న టాలీవుడ్

జగన్ ని కలవబోతున్న టాలీవుడ్

సినిమా టికెట్ల ధరలు, సెకండ్ షోల వ్యవహారం, అదనపు షోల అనుమతులు వగైరా ఇష్యూల మీద ఏపి సిఎం జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు టాలీవుడ్ పెద్దలు సిద్ధమవుతున్నారు. చిరంజీవి నేతృత్వంలో ఒక బృందం సెప్టెంబర్ 4న ముఖ్యమంత్రి కార్యాలయంలో కలుసుకోబోతున్నట్టు సమాచారం. ఆ మేరకు మంత్రి పేర్ని నాని నుంచి అప్ డేట్ వెళ్లిందని ఫిలిం నగర్ న్యూస్. అయితే ఎవరు వెళ్తారు అనే వివరాలు మాత్రం ఇంకా బయటికి రాలేదు. నటులు, దర్శకులు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఇలా ఒక్కో బ్యాచ్ నుంచి ఒక్కొక్కరిని తీసుకున్నా సులభంగా ఆరేడుగురు అవుతారు. కానీ అంతమందికి పర్మిషన్ వచ్చిందా అనేదే చూడాలి.

ఈ చర్చల కోసమే టాలీవుడ్ పెద్ద రిలీజులన్నీ వెయిటింగ్ లిస్టులో ఉన్నాయి, లవ్ స్టోరీ ఇప్పటికే పదే పదే వాయిదా పడింది. విరాట పర్వం, వరుడు కావలెను, లక్ష్య, రిపబ్లిక్ లాంటివన్నీ సెప్టెంబర్ ని అసలు పట్టించుకోవడం లేదు. వినాయక చవితికి కూడా కేవలం సీటిమార్ ఒకటే పందెంలో ఉంది. అఖండ కూడా వేచి చూసే ధోరణిని అవలంబిస్తూ డేట్ ని ప్రకటించడం లేదు. కరోనా థర్డ్ వేవ్ ముప్పు నేపథ్యంలో ఏపిలో ఇంకా సెకండ్ షోలు మొదలుకాలేదు. ఇది రెవిన్యూ మీద ప్రభావం చూపిస్తోందని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్, అర్ధ రాత్రి ప్రయాణాలు చేసేవాళ్లు ఈ అటలు లేక వినోదం మిస్సవుతున్నారు.

సో ఇప్పుడీ బృందం కలిసి రాగానే నిర్ణయం వస్తుందా లేక మరికొంత సమయం పడుతుందా అనేది వేచి చూడాలి. థియేటర్లు తెరిచిన నెల రోజులకు కూడా ఇంకా గట్టిగా చెప్పుకునే బ్లాక్ బస్టర్ దక్కలేదు. ఎస్ఆర్ కల్యాణమండపం, రాజరాజ చోర లాంటివి బడ్జెట్ లెక్కల పరంగా లాభాలు ఇచ్చాయే తప్ప బాక్సాఫీస్ రియల్ స్టామినా ఏంటో బయట పడాలంటే పెద్ద హీరో సినిమాలు రావాలి. ఈ చిక్కు ముడులన్నీ ఉన్నందుకే టక్ జగదీష్ ఫైనల్ గా ఓటిటికి ఓటు వేయక తప్పలేదు. ఇండస్ట్రీ వర్గాల నుంచి ఎంత వ్యతిరేకత వచ్చినా కూడా ప్రైమ్ విడుదల తేదీని 10వ తేదీ నుంచి మార్చలేదు. సో చూడాలి మరి ఈ కలయిక ఎలాంటి ఫలితాలను ఇస్తుందో

Also Read : మాసే లక్ష్యంగా ఎనర్జిటిక్ స్టార్

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి