iDreamPost

సిఎం జగన్ తో భేటీకి టాలీవుడ్ సిద్ధం

సిఎం జగన్ తో భేటీకి టాలీవుడ్ సిద్ధం

ఇప్పటికే రెండు మూడు సార్లు వాయిదా పడ్డ టాలీవుడ్ పెద్దలతో ఏపి సిఎం జగన్ భేటీకి తేదీ ఖరారైనట్టు ఫిలిం నగర్ టాక్. ఈ నెల 20న అపాయింట్మెంట్ ఫిక్స్ అయ్యిందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో థియేటర్ వ్యవస్థ ఎదురుకుంటున్న సమస్యలతో పాటు రాబోయే భవిష్యత్తులో పరిశ్రమకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఎలాంటి ప్రణాళికలు వేయాలనే దాని మీద గట్టి చర్చలే ఉంటాయని తెలిసింది. ముఖ్యంగా టికెట్ ధరల ఇష్యూ డిస్కషన్ లో రానుంది. ప్రధానంగా బిసి సెంటర్లలో టికెట్ల రేట్లను 2013 నాటి కాలానికి తగ్గించడంతో ఎగ్జిబిటర్లు ఇబ్బంది పడుతున్నారు. రెవిన్యూ మీద కూడా దీని ప్రభావం బలంగా పడింది.

దీనికి తోడు ఏపి సర్కారు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్న గవర్నమెంట్ ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. నిజానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసి ఇంకా ప్రతిపాదనలు రూపొందించే స్టేజిలో ఉండగానే ఇప్పటికే మీడియాలో రకరకాల కథనాలు వచ్చాయి. అసలు విధివిధానాలు ఏంటో తెలియదు. కానీ ప్రచారం ఊపందుకుంది. మంత్రి పేర్ని నాని అలాంటి నిర్ణయం ఏదీ తీసుకోలేదని, ఇదంతా ప్రతిపక్షాల ప్రచారమని ఇందాకే తేల్చేశారు. చిరంజీవి నాగార్జున రాజమౌళి లాంటి పెద్దలే ఆన్ లైన్ టికెట్లు అమ్మేలా చూడమని అడిగారని ఇందాక ఒక ప్రెస్ మీట్ లో చెప్పడం కొత్త ట్విస్టు. దీని గురించి కూడా టాలీవుడ్ పెద్దలు ఒక క్లారిటీ తీసుకునే అవకాశాలు లేకపోలేదు. ఇవి కాకుండా షూటింగులకు సంబంధించి కూడా కొన్ని వెసులుబాట్లు కోరేందుకు కూడా రెడీ అవుతున్నారట.

ఎవరెవరు మీటింగ్ కు వెళ్తారనేది ఇంకా తెలియాల్సి ఉంది. చిరంజీవి నాగార్జున నిర్మాతలు సురేష్ బాబు దిల్ రాజులతో పాటు డిస్ట్రిబ్యూటర్ల తరఫున ప్రతినిధిగా ఒకరు లేదా ఇద్దరు వెళ్లే ఛాన్స్ ఉంది. థియేటర్లు తెరిచి నలభై రోజులు దాటుతున్నా ఇంకా బాక్సాఫీస్ కు సరైన బ్లాక్ బస్టర్ పడలేదు. ఇవన్నీ సద్దుమణిగాకే ఒక నిర్ణయం తీసుకుందామని ఫస్ట్ కాపీలతో సిద్ధంగా ఉన్న బడా ప్రొడ్యూసర్లు ఎదురు చూస్తున్నారు. 24 నుంచి ఏపిలో ఫుల్ ఆక్యుపెన్సీ, సెకండ్ షో అనుమతులు కూడా వస్తాయనే టాక్ ఉంది. చూడాలి మరి ఇప్పుడు వార్త వచ్చినట్టుగా నిజంగా 20న జగన్ తో మీటింగ్ ఉంటుందో లేదో ఇంకో వారం ఆగితే తేలిపోతుంది

Also Read : తొందరపాటేల.. నరేష్ గారూ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి