iDreamPost

‘వరంగల్‌’ స్థానంపై పోటాపోటీ…!

‘వరంగల్‌’ స్థానంపై పోటాపోటీ…!

ఒక నియోజకవర్గంలో వాడివేడిగా ప్రచారం.. మరో నియోజకవర్గంలో అసలు హడావుడే లేదు.! త్వరలో ఎన్నికలు జరగనున్న శాసన మండలి పట్టభద్రుల నియోజకవర్గాల్లో పరిస్థితి. రెండు నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనుండగా.. వరంగల్‌- ఖమ్మం- నల్లగొండపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. మహబూబ్‌నగర్‌- రంగారెడ్డి- హైదరాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కూడా ఎన్నికలు జరగనున్నప్పటికీ నాయకులు పెద్దగా పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. వరంగల్‌- ఖమ్మం- నల్లగొండ స్థానంలో పోటీకి సిద్ధపడ్డ అభ్యర్థుల్లో ముఖ్యులు ఉండడం, వారి ప్రచారం జోరుగా సాగుతుండడం, నియోజకవర్గంలోని ప్రత్యేక పరిస్థితులతో ఇక్కడ పోరు రసవత్తరంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఈ రెండు పట్టభద్రుల నియోజకవర్గాల సిటింగ్‌ ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి (టీఆర్‌ఎస్‌), ఎన్‌.రాంచందర్‌రావు (బీజేపీ) పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 29తో ముగుస్తోంది. వీటి భర్తీ ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు జరుగుతాయనే అంచనాలు ఉన్నాయి.

ఓటర్ల నమోదు ప్రారంభం నుంచే..

ఓటర్ల నమోదు కార్యక్రమం మొదలైన అక్టోబరు నుంచే వరంగల్‌ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడి నుంచి పోటీకి సిద్ధపడ్డ పార్టీల నేతల్లో టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం, సీపీఐ అభ్యర్థి జయసారథిరెడ్డి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువ తెలంగాణ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రాణిరుద్రమరెడ్డి ఉన్నారు. టీఆర్‌ఎస్‌ తరఫున సిటింగ్‌ ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి తిరిగి పోటీ చేయడం దాదాపు ఖాయమైంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అభ్యర్థిగా ఉండడం లాంఛనమేనని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్‌ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు. సీపీఐ అభ్యర్థి జయసారథిరెడ్డికి సీపీఎం మద్దతు ప్రకటించింది. ఇదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తామని తీన్మార్‌ మల్లన్న (చింతకాయల నవీన్‌), సూధగాని హరిశంకర్‌గౌడ్‌ తదితరులు వెల్లడించారు. వీరంతా ఎవరికి వారుగా గడిచిన రెండు, మూడు నెలల నుంచి నియోజకవర్గం పరిధిలో హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నారు. పట్టభద్రుల్లో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందనే ప్రచారం, ఖమ్మం మినహా వరంగల్‌, నల్లగొండ ఉమ్మడి జిల్లాలు తెలంగాణ ఉద్యమానికి పూర్తి స్థాయిలో వెన్నుదన్నుగా నిలవడం వల్ల గట్టిగా పనిచేస్తే, గెలుపు తమదేనన్న ధీమాతో అభ్యర్థులందరూ బాగానే కష్టపడుతున్నారు.

తెర వెనుక మంత్రాంగాలు

ఇతర పార్టీల వారు, స్వతంత్ర అభ్యర్థులు ప్రధానంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై ఆశలు పెట్టుకున్నారు. దీంతో ఓట్లు చీలిపోయే అవకాశం ఉందని భావించిన పలువురు అభ్యర్థులు ఇతరులను బరి నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. కోదండరాం పోటీలో ఉండకుండా చూడాలని కొందరు, మిగిలిన వారు పోటీ నుంచి తప్పుకొని తమకు మద్దతు ఇవ్వాలని ఇంకొందరు ఎవరికి వారుగా తెర వెనుక మంత్రాంగాలు నడిపిస్తున్నారు. ఒకవైపు ప్రచారం సాగిస్తూనే, ఈ ప్రయత్నాలను సీరియస్‌గా చేస్తుండడం చర్చనీయాంశమైంది. అంతేకాక ప్రచారంలో అభ్యర్థులు తమ ప్రత్యర్థుల ఎత్తులకు పైఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో వరంగల్‌ ఎమ్మెల్సీ స్థానంలో ప్రచారం ఎన్నికల షెడ్యూల్‌ వెలువడక ముందే ఊపందుకుంది. ఇదే స్థాయిలో రంగారెడ్డి పట్టభద్రుల స్థానం ఎన్నికల ప్రచారం జరగడం లేదు. ఇక్కడ సిటింగ్‌ ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు తిరిగి బీజేపీ నుంచి పోటీ చేయనున్నారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించిన మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్‌కు సీపీఎం, సీపీఐ మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్‌ తరఫున పలువురు సీనియర్లు పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. ఇక్కడి నుంచి టీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసే అభ్యర్థి ఎవరో తేలలేదు. తొలుత ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టిన అధికార పార్టీ నేతలు కొందరు దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పరాభవం తర్వాత వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి