iDreamPost

ముగ్గురిని మింగేసిన కేజీఎఫ్ బంగారు గని

ముగ్గురిని మింగేసిన కేజీఎఫ్ బంగారు గని

యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ సినిమా గుర్తుంది కదా.. బంగారపు గనుల గురించి తీసిన కేజీఎఫ్ సంచలన విజయాన్ని నమోదు చేయడమే కాకుండా కనకవర్షం కురిపించింది. నిజానికి ఆ గనులు ఒక శతాబ్దం పాటు బంగారం తవ్వకాలతో ఒక వెలుగు వెలిగాయి. కానీ అక్కడ దొరికే బంగారం తవ్వడానికి అయ్యే ఖర్చు బయట బంగారం ధరలకంటే ఎక్కువ అవుతుండడంతో 28 Feb 2001 న కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్) గనులు మూతపడ్డాయి. మూతపడిన తర్వాత కూడా అక్కడ గనుల్లో ముడి బంగారం దొరుకుతుందని చాలామంది దొంగలు దొంగతనాలకు ప్రయత్నాలు చేసేవారు.

తాజాగా అలా దొంగతనానికి ప్రయత్నించిన ముగ్గురు దొంగలు కేజీఎఫ్ (కోలార్ గోల్డ్ ఫీల్డ్స్)లో మృత్యువాత పడ్డారు. వివరాల్లోకి వెళితే కేజీఎఫ్‌కు చెందిన స్కంద (55), జోసెఫ్ (45) పాటు మరో ముగ్గురు కలిసి BGML (భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్) కంపెనీ గనికి వెళ్లారు. ఈ బంగారపు గనిని చాలా సంవత్సరాల క్రితమే 2001 మార్చి 1న మూతపడింది. గనుల లోపల ముడి బంగారం దొరుకుతుందన్న పుకార్లు ఉండడంతో ఆ గనిలో గతంలో కూడా ఎన్నోసార్లు చాలామంది దొంగలు దొంగతనానికి ప్రయత్నించేవారు.

కాగా ఈ బుధవారం ఐదుగురు దొంగలు బంగారం చోరీకి గని లోపలికి వెళ్లారు. స్కంద మరియు జోసెఫ్ అనే ఇద్దరు బంగారం వెతకడానికి లోతైన గుంతలోకి తాడు సహాయంతో దిగారు.. వారితో పాటుగా మూడో వ్యక్తి కూడా వెళ్లి ఊపిరి ఆడటం లేదని గుర్తించి పైకి లాగమని చెప్పడంతో పైన ఉన్న ఇద్దరు వ్యక్తులు అతన్ని పైకి లాగారు. కిందకు వెళ్లిన వారు తిరిగి రాకపోవడంతో గని లోపలికి వెళ్లిన స్కంద అనే వ్యక్తి కుమారుడు పడయప్పకు విషయం చెప్పారు. దాంతో తండ్రిని కాపాడుకోవడానికి గని లోపలికి వెళ్లిన పడయప్ప కూడా తిరిగి రాలేదు.

దీంతో మిగిలిన ముగ్గురు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని రంగంలోకి దించి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు.ఈ ఆపరేషన్ లో స్కంద, జోసెఫ్ మృతదేహాలు లభించాయి. పడయప్ప మృతదేహం మాత్రం దొరకలేదు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొసాగుతోంది. కాగా గనిలో ఊపిరి ఆడక మృతి చెందారని పోలీసులు చెబుతున్నారు. అత్యాశతో ఇలా ప్రమాదకరమైన పనులు చేయొద్దని ప్రాణానికి ప్రమాదం ఉంటుందని అధికారులు వెల్లడించారు.. ఈ గనుల్లో బంగారం లభ్యత తగ్గినందుకే కేజీఎఫ్ ను మూసేసారని చాలా లోతుగా ఉండటం వల్ల ఊపిరి లభించే అవకాశం లేదని కానీ అత్యాశతో ఇలాంటి పనులకు తెగించవద్దని అక్కడి ప్రజలకు పోలీసులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి