iDreamPost

ఏపీలో తాజా రాజకీయ తంత్రం – హిందూత్వం

ఏపీలో తాజా రాజకీయ తంత్రం – హిందూత్వం

కులం చూడం, మతం చూడం అని సంక్షేమ పథకాల అమలు విషయంలో సీఎం జగన్ తన పాలసీ గురించి ఎన్నోసార్లు చెప్పాడు. కులం గురించి పక్కన పెడితే మతం విషయంలో జగన్‌ చుట్టూ నేటికీ ఎన్నో ఆరోపణలు చుట్టుముడుతూనే ఉన్నాయి. అతడు అధికారం చేపట్టిన తొమ్మిది మాసాల కాలంలో మత సంబంధ విషయాల్లో జగన్ పేరు మీద ఎన్నో విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా జగన్‌ని హిందూ వ్యతిరేకిగా ప్రజల ముందు నిలబెట్టేందుకు కొన్ని శక్తులు తీవ్రంగా పనిచేస్తున్నాయని అర్థం అవుతోంది.

స్వామీజీల ఆశీస్సులు అందుకున్న జగన్

విమర్శలు మాట ఎలా ఉన్నా జగన్ మాత్రం హిందూ ఆలయ దర్శిస్తూ, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్తలు, స్వరూపానందేంద్ర వంటి స్వాములతో దగ్గరగా ఉంటూ వస్తున్నారు. జగన్ నా ఆత్మ అంటూ స్వరూపానందేంద్ర స్వామీజీ జగన్‌ ను ఆత్మీయాలింగనం చేసుకోవడం ఏపీలో సంచలనానికి కారణం అయ్యింది. ఎందుకంటే గత ఎన్నికల నుంచే జగన్‌ పై క్రైస్తవాన్ని తప్ప మరో మత సంప్రదాయాన్ని ఒప్పుకోడని ప్రజల మనసుల్లో గాఢమైన ముద్ర ఒకటి పడింది. అలాంటిది స్వరూపానందేంద్ర వంటి ఆధ్యాత్మిక గురువు జగన్‌ మోహనరెడ్డిని సపోర్టు చేయడాన్ని రాష్ట్రం ఆశ్చర్యంగా చూసింది. అయితే జగన్‌ గతాన్ని కూడా తెలిసిన వ్యక్తిగా స్వరూపానందేంద్ర అతడిని ఇష్టపడ్డాడన్న సంగతి కొందరికే తెలుసు.

వైయస్ రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి ఇద్దరూ ఎంపీ, ఎమ్మెల్యేలుగా ఎప్పుడు పోటీ చేసినా, వారి ఎన్నికల ప్రచారాన్ని జగనే ఆలయంలో టెంకాయి కొట్టి ప్రారంభించేవాడు. బైక్ ర్యాలీలు, సభల నిర్వాహణకు ముందు కూడా ఆలయంలో పూజలు చేయించే ఆనవాయితీ వైయస్ కుటుంబానిది. ఆ కార్యక్రమాల్లో జగన్ సైతం చురుగ్గా పాల్గొనేవాడన్న సంగతి ఆ పార్టీ సన్నిహితులందరికీ తెలుసు. అయితే 2014 ఎన్నికల సమయంలో విజయమ్మ బైబిల్‌ను వెంటపెట్టుకుని వెళ్లడాన్ని, జగన్ క్రిస్టమస్ సంబరాలకు సంబంధించిన వీడియోలను ప్రతిపక్షాలు తమకు అనుకూలంగా వాడుకుని జగన్ హిందూ వ్యతిరేకి అనే ముద్ర వేయడంలో సక్సెస్ అయ్యాయి. అధికారం చేపట్టిన తర్వాత స్వరూపానందేంద్ర స్వామిని కలిసి ఆశీస్సులు తీసుకున్నాడు. ఇప్పుడు విశాఖలోని శారదాపీఠం వార్షికోత్సవాల్లో స్వామీజీ చేతులమీదుగా సత్కారం అందుకున్నాడు.

జగన్ పై మతముద్ర ఎవరికి ప్రయోజనం??

హిందూ మతం విషయంలో తన వైఖరిని ఎంతో స్పష్టంగా చెబుతున్నప్పటికీ జగన్ పై హిందూ వ్యతిరేక ముద్ర వేయడానికి ఎందుకు తీవ్రమైన ప్రయత్నం జరుగుతోంది? రాజీకీయ అవసరాల కోసం ప్రతిపక్ష టీడీపీ, దాని భాగస్వామ్య పార్టీ జనసేన జగన్ పై హిందూ వ్యతిరేక ముద్ర వేసి లాభపడాలని ఆశించడంలో అర్థం ఉంది…కానీ రాష్ట్రంలో కనీస బలం లేని బీజేపీ కూడా జగన్‌పై ఉద్దేశ్యపూర్వకమైన ఆరోపణలు ఎందుకు చేస్తున్నట్టు? పరమత సహనం పాటించే నాయకుడిగా ప్రజల్లో నిరూపించుకున్న జగన్‌ పట్ల బీజేపీ వైఖరి కూడా వ్యతిరేకంగా ఎందుకు ఉంటోంది? తిరుపతిపై శిలువ, బస్సు టికెట్లపై జెరుసలేం, హజయాత్రల ప్రకటనల వంటి అవాస్తవాల ప్రచారంలోనే కాదు, ఇటీవలే మొదలైన దేవాలయ భూములు, తిరుపతి హాథీరాంజీ భూములపై జరుగుతున్న తప్పుడు ప్రచారంలోనూ టీడీపీతో కలిసి బీజేపీ వంత పాడటం వెనుక ఉద్దేశ్యం ఏమిటి?

టీడీపీకి అవసరం..

జగన్‌ క్రైస్తవాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నం చేస్తున్నాడన్న ముద్ర వేయాలని ఎంతగానో ప్రయత్నించినా ప్రజలు నమ్మడం లేదు. ఇటు నుంచి కాకుంటే అటు నుంచి నరకాలన్న చందంగా హిందూ సంస్థలకు, హిందూత్వానికి ద్రోహమేదో జరిగిపోతోందన్న భావన కలిగిస్తే అయినా, అది జగన్ పై సందేహాలు రేకెత్తిస్తుందని స్కెచ్ వేస్తున్నాయి ఈ పార్టీలు. టీడీపీకి దీనివల్ల రెండు లాభాలు. ఒకటి జగన్‌ ను హిందూ వ్యతిరేకిగా ముద్ర వేసి స్థానిక ఎన్నికల్లో ఇదో కారణంగా ప్రచారం చేసుకుని లాభపడటం. దీన్ని సాకుగా చూపుతూ బీజేపీకి దగ్గరవడం.

మరి బీజేపీకి…

విభజన హామీల విషయంలో బీజేపీపై ఏపీ ప్రజలు గుర్రుగా ఉన్నారన్నమాట వాస్తవం. ఇప్పటికే ఆ ఆగ్రహాన్ని రెండు జాతీయ పార్టీలూ తీవ్రంగా చవి చూసాయి. ఇలాంటి సమయంలో ఏపీలో బీజేపీ పెరిగే సూచలనలు లేవు. కనుక జగన్‌ పై హిందూ వ్యతిరేకిగా ముద్ర వేయడం ద్వారా ప్రభుత్వానికి ప్రతిపక్షంగా నిలబడి తన ఉనికిని చాటాలనుకుంటోంది బీజేపీ. తమతో చేతులు కలపాలని ఉవ్విళ్లూరుతూ, జగన్ పై చంద్రబాబు చేస్తున్న ఈ బేస్‌ లెస్ విమర్శలకు సహకారం అందిస్తోంది. టీడీపీ తమ పెయిడ్ సోషల్ మీడియా ద్వారా చేస్తున్న జగన్ క్రిస్టియానిటీ ప్రచారానికి హిందూత్వ సంస్థల ద్వారా మద్దతు పలుకుతోంది. ఏపీలో దళిత క్రైస్తవుల సంఖ్య ఎక్కువ. వీరంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులే. ఈ బలమైన ఓట్ బ్యాంకును బీజేపీ కదిలించలేదు. ఏదో విధంగా జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలంటే వారి చేతిలో ఉన్న ఏకైక ఆయుధం మతమే.

హిందూత్వానికి ముప్పా??

గతంలో చంద్రబాబు హయాంలో హిందూ ఆలయాల ధ్వంసం, తిరుపతి ఆలయంలో శ్రీవారి నగలపై వివాదం, ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు గారిని విధుల నుంచి అవమానకర రీతిలో తప్పించడం, వెంకటేశ్వర స్వామికి కులాన్ని అంటగట్టడం, ఆలయ నిధులను రాజకీయ ప్రయోజనాలకు మళ్లించడం వంటి దారుణాలు ఎన్ని జరిగినా నోరు మెదపలేదు ఏపీ బీజేపీ నేతలు. నాడు హిందూత్వానికి ముప్పు అంటూ ఈ స్థాయిలో విరుచుకుపడలేదు. నేడు జగన్‌ రమణ దీక్షితులను తిరిగి విధుల్లోకి తీసుకున్నాడు. ఇమామ్‌లు, ఫాదర్లతో పాటు పూజారులకు సైతం భృతి ఇస్తున్నాడు. ఆలయ ధూప, దీప, నైవేద్యాలకు నిధులు విడుదల చేసాడు. అన్యాక్రాంతం అవుతున్న దేవాలయ భూములకు ప్రభుత్వం నుంచి రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తున్నాడు. టీడీపీ హయాంలో కూల్చిన ఆలయాలను పునర్మిస్తామని హామీ ఇచ్చాడు.

ప్రజలేమంటున్నారు??

కమ్యూనిస్టునని చెప్పుకుంటూ ఉన్నపళంగా బీజేపీ వాదిగా మారి, ఎక్కువ టైమ్ తీసుకోకుండానే కాషాయం కప్పుకున్న పవన్‌ కళ్యాణ్ వెనుక చంద్రబాబు ఉన్నాడని ప్రజలకు తెలుసు. బీజేపీకోసం పాకులాడుతున్న టీడీపీల తీరును కూడా ప్రజలు నిశితంగా గమనిస్తున్నారు.ఇప్పటికే ఎంపీలను పంపి రాయబారం జరుపుతున్నా టీడీపీని వెంటనే దగ్గరకు చేర్చుకోడానికి బీజేపీ సిద్ధంగా లేని సంగతీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు.

బీజేపీ ప్రాపకం కోసం టీడీపీ, జనసేనలు జగన్ పై హిందూ వ్యతిరేక ముద్ర వేయాలనుకుంటున్నారనే నిజాన్ని తెలుసుకోలేని స్థితిలో ప్రజలు లేరు..అలాగే రాష్ట్రంలో తమ ఉనికి కోసం బీజేపీ క్రిస్టియన్ కార్డును వాడుతోందన్న విషయాన్నీ ప్రజలు గుర్తించారు. జగన్ పై క్రిస్టియానిటీ ముద్ర వేయాలని ఆ పార్టీలు ఎంత ప్రయత్నిస్తున్నాయో అదేస్థాయిలో ఈ రాజకీయ కోణాలను వైసీపీ సోషల్ మీడియా కూడా బైటపెడుతూ వస్తోంది. వాస్తవాలు, అసత్యాల మధ్య తెరను తొలగించే ప్రయత్నం చేస్తోంది.

మతవాద రాజకీయాలే అస్త్రంగా ఏపీలో ఉనికిని కాపాడుకోవాలనుకుంటున్న వివిధ పార్టీల పరమపద సోపానంలో వైయస్ జగన్ తను మతసహనం కలవాడిగా అనుక్షణం నిరూపించుకోవాల్సిన పరిస్థితైతే కనిపిస్తోంది.

Guest writer – దీప్తిశ్రీ కవులూరు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి