iDreamPost

తెలంగాణకు చేరిన తొలి ‘వందే భారత్‌’ విమానం

తెలంగాణకు చేరిన తొలి ‘వందే భారత్‌’ విమానం

కువైట్ నుండి హైదరాబాద్ చేరిన 163 మంది

కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ కారణంగా కువైట్‌లో చిక్కుకున్న 163 మంది భారతీయులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎయిర్‌ ఇండియా-988 ఎయిర్‌లైన్స్‌ విమానం శనివారం రాత్రి 10.07 గంటలకు శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అయింది. విమానంలో వలస కూలీలతోపాటు, పర్యటన నిమిత్తం వెళ్లిన వారున్నారు.

కరోనా(కొవిడ్‌-19)కారణంగా ప్రపంచ దేశాలన్నీ ప్రయాణాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రపంచ దేశాల లాక్ డౌన్ కారణంగా అనేకమంది భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయారు. వారిని తిరిగి స్వదేశానికి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం వందే భారత్ మిషన్ చేపట్టింది. విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి చేర్చే తొలి విమానం తెలంగాణకు చేరుకుంది. ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 80 మంది ఉండగా మిగిలిన 83 మంది ఒడిశా, మహారాష్ట్ర, తమిళనాడులకు చెందినవారని అధికారులు తెలిపారు.

విదేశాల నుండి స్వదేశంలో అడుగుపెట్టినవారికి విమానాశ్రయంలో ఎయిర్‌పోర్టు హెల్త్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు చేశారు.అనంతరం12 ప్రత్యేక ఆర్టీసీ బస్సుల్లో వారిని నగరానికి తరలించి 14 రోజుల పాటు ఇక్కడే హోం క్వారంటైన్‌లో ఉండేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. వీరి కోసం నగరంలోని పలు ప్రాంతాల్లో హోటళ్లు, లాడ్జ్‌లలో ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం రూ.15 వేల నుంచి రూ.30 వేల మధ్య ప్యాకేజీలు ప్రకటించింది. పేద కార్మికులను మాత్రం ప్రభుత్వ క్వారంటైన్‌ కేంద్రాలకు తరలించారు. 14 రోజుల తర్వాత వీరి ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన అనంతరం స్వగ్రామాలకు తరలించనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి