iDreamPost

భారం నాగ్ మీద కాదు సభ్యుల మీదే

భారం నాగ్ మీద కాదు సభ్యుల మీదే

ఇవాళ బిగ్ బాస్ సీజన్ 5 మొదలుకాబోతోంది. ఈసారి స్టార్ మా గట్టిగానే ప్లాన్ చేసినట్టు కనిపిస్తోంది కానీ అసలు గేమ్ స్టార్ట్ అయితే తప్ప ఇది ఏ స్థాయిలో ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయో చెప్పలేని పరిస్థితి. హిందీతో పోలిస్తే మన దగ్గర ఈ ఆటకు వస్తున్న స్పందన తక్కువే. అక్కడ సల్మాన్ ఖాన్ ఒంటిచేత్తో 13 సీజన్లు నెట్టుకొచ్చి ఇప్పటికీ రేటింగ్ తగ్గకుండా చూసుకుంటున్నాడు. కానీ మనదగ్గర మాత్రం ఆల్రెడీ ముగ్గురు హోస్టులు మారారు. జూనియర్ ఎన్టీఆర్ ఒక్క సీజన్ కే గుడ్ బై చెప్పగా నాని మధ్యలోనే నాకొద్దు బాబోయ్ అనేలా విరక్తి తెచ్చుకున్నాడు. కానీ నాగ్ మాత్రం పట్టువదలకుండా తన సీనియారిటీని ఉపయోగించి నిలబెడుతున్నాడు.

రేటింగ్స్ పరంగా స్టార్ మాకు దీని మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఒకపక్క జెమిని ఎవరు మీలో కోటీశ్వరులు, మాస్టర్ చెఫ్ లాంటి కొత్త ప్రోగ్రాంస్ తో ఆడియన్స్ కి గాలం వేస్తోంది. వాటికి మరీ భీభత్సమైన రెస్పాన్స్ రాలేదు కానీ కంటెంట్ తో పోల్చుకుంటే మాస్ ని ఎక్కువగా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉన్నది బిగ్ బాస్ కే. అయితే పార్టిసిపెంట్స్ విషయంలో జరుగుతున్న తడబాటు ఈసారి కూడా కనిపిస్తోంది. లిస్టు చూస్తుంటే మరీ టెంప్ట్ అయ్యేలా ఏమి లేదు. వీళ్ళ సంగతి ఎలా ఉన్నా బోలెడు డ్రామాతో ఎప్పటికప్పుడు అలరించేందుకు ప్లాన్లు మారుస్తున్న స్టార్ మాకు ఈసారి ఎలాంటి ఫలితం దక్కుతుందో వేచి చూడాలి.

కాకపోతే వంద రోజుల నిడివి నిర్వాహకులకు పెద్ద సవాల్ గా మారుతోంది. ముఖ్యంగా గేమ్ మధ్యలోకి చేరుకున్నాక బోర్ కొట్టకుండా చూసుకోవడం ఛాలెంజ్ అనిపిస్తోంది. రేటింగ్స్ కూడా ఆ టైంలోనే తగ్గుతున్నాయి. ఈసారి ఎక్కువ మసాలా జోడించి సభ్యుల మధ్య గొడవలు, అలకలు, ఎత్తులు, కుట్రలు బాగా ప్లాన్ చేశారని ఇన్ సైడ్ టాక్ ఉంది. నాగార్జున వచ్చేది వారంలో చివరి రెండు రోజులే కాబట్టి షోని ఇంటరెస్టింగ్ గా నడిపించాలంటే ఆ భారం పార్టిసిపెంట్స్ మోయాల్సిందే. నాలుగు సీజన్లను మించి రేటింగ్స్ తెచ్చుకుంటుందేమో చూడాలి. ఇవాళ కర్టెన్ రైజర్ 6 గంటలకే ప్రారంభం కాబోతోంది. లీకైన లిస్ట్ నిజమో కాదో తేలిపోతుంది

Also Read : టాలీవుడ్లో మొదటిసారి ఇలాంటి పోటీ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి