iDreamPost

గుర్తు చేస్తే తప్పా ఏ పార్టీయో ఆ ఎంపీకి గుర్తుండడంలేదు

గుర్తు చేస్తే తప్పా ఏ పార్టీయో ఆ ఎంపీకి గుర్తుండడంలేదు

రాజకీయాల్లో పార్టీలు మారడం సర్వసాధారణంగా జరిగేదే. అయితే ఏ పార్టీలో తాము ఉన్నామో నేతలకు ఒక్కొక్కసారి గుర్తు ఉండదు. మాటల్లో పాత పార్టీలో ఉన్నట్లుగానే మాట్లాడుతుంటారు. ఆనక నాలుక కరుచుకుంటారు. ఇదే తీరులోనే బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్‌ వ్యవహరించారు. ఈ రోజు ఢిల్లీలో మూడు రాజధానులపై మీడియాతో మాట్లాడేందుకు టీజీ వెంకటేష్‌ సిద్ధమయ్యారు. ప్రారంభంలోనే ‘‘ మా తెలుగుదేశం ఎంపీలు’’ అన్నారు. వెంటనే మీడియా ప్రతినిధులు కలుగజేసుకుని ‘‘ సార్‌ మీరు ఇప్పుడు బీజేపీలో ఉన్నారు’’ అని గుర్తు చేయాల్సి వచ్చింది. తేరుకున్న టీజీ.. తెలుగుదేశం ఎంపీలు స్థానంలో.. తెలుగు వాళ్లు అని సవరించుకోవాలంటూ ఉచిత సలహా ఇచ్చారు.

Read Also: తండ్రి మోడీ.. కొడుకు బాబు

ఈ కథ ముగిసన తర్వాత.. టీజీ అసలు విషయంలోకి వచ్చారు. మరోమారు మూడు రాజధానులకు జై కొట్టారు. రాష్ట్ర అభివృద్ధికి మూడు రాజధానుల ఏర్పాటు మంచి నిర్ణయమన్నారు. మూడు రాజధానులను తమ కుటుంబానికి అన్వయించి వివరించారు. తాను రాయలసీమ వాడినని, తన మామది కృష్ణా జిల్లా అని, తన కూతురుని ఇచ్చింది విశాఖపట్నం.. అని చెప్పిన టీజీ వెంకటేష్‌ మూడు రాజధానులను ఏర్పాటు వల్ల అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందన్నారు.

Read Also: మొన్న టీజీ.. నేడు జేసి

కాగా, టీజీ వెంకటేష్‌ పార్టీ విషయంలో నాలుక్కరుచుకోవడం ఇదే మొదటి సారి కాదు. గతంలో కూడా ఇలానే తడబడ్డారు. టీజీ వెకంటేష్‌ తన రాజకీయ జీవితం తెలుగుదేశం పార్టీ నుంచి ప్రారంభించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి రాష్ట్ర మంత్రి అయ్యారు. విభజన తర్వాత మళ్లీ టీడీపీలో చేరి 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2016లో టీడీపీ రాజ్యసభ సీటును దక్కించుకున్నారు. ఈ సీటు విషయంలో కూడా టీజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ సీటు తనకేమీ ఊరికే రాలేదంటూ.. కొనుగోలు రాజకీయాలను కుండబద్ధలు కొట్టారు. 2019లో టీడీపీ ఓటమి తర్వాత బీజేపీలో చేరారు. ప్రస్తుతం బీజేపీలో కొననసాగుతున్న టీజీ వెకంటేష్‌కు అప్పుడప్పుడు పాత పార్టీ గుర్తుకువస్తున్నట్లుగా ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి