iDreamPost

300 కోట్ల ఆదాయం కోల్పోయిన వడ్డీ కాసుల వాడు

300 కోట్ల ఆదాయం కోల్పోయిన వడ్డీ కాసుల వాడు

ప్రతి రోజూ లక్షలాది మంది భక్తుల గోవింద నామ స్మరణతో మారుమ్రోగే తిరుమల గిరుల్లో గత నెల రోజులుగా నిశబ్ధం ఆవహించింది. కోట్లాది రూపాయల భక్తుల కానుకలతో గలగలలాడే హుండీలు వెలవెలబోతున్నాయి. మొత్తంగా కరోనా వల్ల కొనసాగుతున్న లాక్‌డౌన్‌ ప్రభావం తిరుమల కొండపై భారీగానే ఉంది. గత నెల 20 వ తేదీ నుంచి తిరుమల ఆలయం తెరుచుకోని విషయం తెలిసిందే. దీంతో మొక్కుల రూపంలో భక్తులు సమర్పించే నగదు, బంగారు, వెండితోపాటు దర్శన టికెట్లు, ఆర్జిత సేవలు, గదుల కేటాయింపు, ప్రసాదాల ద్వారా వచ్చే ఆదాయాన్ని టీటీడీ కోల్పోయింది. అలాగే భక్తుల తలనీలాలు, దుకాణాల బాడుగల ద్వారా వచ్చే మొత్తం కూడా రాకుండా పోయింది. దీంతో మొత్తంగా దేవస్థానం నెల రోజుల్లో దాదాపు 300 కోట్ల రూపాయాల ఆదాయం కోల్పోయినట్లు టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. మే 3 వరకు లాక్‌డౌన్‌ కొనసాగనుండడంతో. మరో 150 కోట్ల వరకు ఆదాయం కోల్పోయే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సాధారణంగా ప్రతి ఏటా తిరుమలకు దాదాపు హుండీ ద్వారానే దాదాపు 1200 కోట్ల ఆదాయం వస్తుంది. కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌ తర్వాత కూడా భక్తుల రాకపోకలు తగ్గిపోయే అవకాశం ఉంది. దీంతో అన్ని రకాల ఆదాయాలు నిలిచిపోనున్నాయి. ఈ పరిస్థితుల్లో 2020–2021 ఆర్థిక సంవత్సరానికి రూ. 3,309 కోట్లతో ప్రవేశపెట్టిన టీటీడీ బడ్జెట్‌లో కూడా తీవ్ర మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఆలయాలకు భారీ దెబ్బ

కరోనా ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని ఆలయాలకు భారీ దెబ్బ పడనుంది. ప్రధాన ఆలయాలైన విజయవాడ దుర్గమ్మ, శ్రీశైలం మల్లికార్జునస్వామివారి దేవస్థానం, విశాఖ సింహాచలం అప్పన్న ఆలయం, అన్నవరం సత్యనారాయణస్వామి ఆలయం, కాణిపాకం ఆలయాలు పెద్ద మొత్తంలో ఆదాయాన్ని కోల్పోనున్నాయి. చిన్న ఆలయాల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయా ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చిన్న ఆలయాల్లోని దాదాపు 2,500 మంది అర్చకులకు గ్రాంట్‌ రూపంలో రూ. 5వేల రూపాయలకు ప్రభుత్వం అందించింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి