తెలంగాణ వ్యాప్తంగా పత్తి రైతులకు భారీ షాక్..!

Ginning Mills: సీసీఐ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు బంద్ చేస్తున్నామని తెలంగాణ కాటన్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు కొనుగోలు కేంద్రాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.

Ginning Mills: సీసీఐ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లు బంద్ చేస్తున్నామని తెలంగాణ కాటన్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు కొనుగోలు కేంద్రాల వద్ద ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది.

తెలంగాణలో పత్తి రైతులకు చేదువార్త. ఇటీవల సీసీఐ ఎల్ – 1, ఎల్ – 2, ఎల్ – 3 పేరుతో బిల్లుల్లో కఠిన నిబంధనలు అమలు చేయడాన్ని నిరసిస్తూ జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ అసోసియేషన్ నిరవధికంగా పత్తి కొనుగోళ్లను నిలిపి వేస్తున్నట్లు ప్రకటించింది. సోమవారం (నవంబర్ 11) నుంచి కొనుగోలు కేంద్రాలకు తాళం వేస్తున్నట్లు తెలంగాణ కాటన్ అసోసియేషన్ ప్రకటించింది. సీసీఐ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా తాము బంద్ చేస్తున్నామని అసోసియేషన్ తెలిపింది. ఈ మేరకు కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీసీఐ సీఎండీ కి లేఖ రాశాయి. పత్తి కొనుగోలులో కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (CCI) అమలు చేస్తున్న అడ్డదిడ్డ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు లేఖలో పేర్కొన్నాయి.  పూర్తి వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సీజన్‌లో తెలంగాణ రైతుల నుంచి పత్తి కొనుగోలుపై సీసీఐ అనేక విధాలుగా ఇబ్బందులు పెడుతుందని అసోయేషన్ పేర్కొంది. ఈ క్రమంలోనే కొనుగోలు కేంద్రాల వద్ద ‘కొనుగోళ్లు నిలిపివేశాం.. రైతులు సహకరించాలి. దయచేసి పత్తిని తీసుకురావొద్దు’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దీంతో ఆరుగాలం నానా కష్టాలు పడి పత్తిని పండించిన రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిరీక్షణ తప్పడం లేదు. మిల్లర్లు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న విషయానికి వస్తే.. కాటన్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. పత్తి జిన్నింగ్, ప్రెస్సింగ్ జాబ్ వర్క్ ను సీసీఐ మూడు కేటగిరీలుగా విభజించింది. ఎల్1, ఎల్ 2, ఎల్ 3 ఇలా మూడు క్రమ సంఖ్యలను కేటాయించింది. తక్కువ ధరకు జిన్నింగ్ చేసే మిల్లర్లను ఎల్ – 1, కాస్త ఎక్కువగా కోట్ చేసిన వారిని ఎల్2, అధిక ధరకు జిన్నింగ్ చేస్తామనే వారిని ఎల్ 3 కేటగిరీలుగా విభజించింది. మిల్లర్లు పత్తిలో గింజలను తొలగించి, జిన్నింగ్, ప్రెస్సింగ్ చేసి బేళ్లుగా మార్చిన తర్వాత వాటిని సీసీఐ స్వాధీనం చేసుకుంటుంది.

రాష్ట్రంలో ఒక్కో పత్తి బేల్ జిన్నింగ్, ప్రెస్సింగ్ కు మిల్లర్లు రూ.1,495 నుంచి రూ.1,550 వరకు కోట్ చేశారు. ధర ఎక్కువగా కోట్ చేసిన వారి వద్ద మిల్లింగ్ తో తమకు గిట్టు బాటు కాదంటూ సీసీఐ మెలికి పట్టింది. ఈ నేపథ్యంలో 318 కేంద్రాలకు గాను, ఎల్ 1 కింద కోట్ చేసిన 165 కేంద్రాలకు మాత్రమే జాబ్ వర్క్ ఇచ్చే అకాశం ఉంది. జిన్నింగ్ అండ్ ప్రెస్సింగ్ అసోసియేషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంపై అధికార పార్టీ జోక్యం చేసుకుంది. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రంగంలోకి దిగారు. ఆయన సమక్షంలో సీసీఐ అధికారులు, తెలంగాణ కాటన్ అసోసియేన్ ప్రతినిధులు సమావేశం అయ్యారు. సీసీఐ నిర్ణయం వల్ల మిల్లర్లకు జాబ్ వర్క్ ఉండదని, రైతులకు దూరాభారం తప్పదని కాటన్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ విషయాన్ని సీసీఐ పునఃపరిశీలించాలని కోరింది.కానీ, సీసీఐ అధికారులు ససేమిరా అనడంతో అసోసియేషన్ నిరవధిక సమ్మే దిశగా ముందుకు సాగుతుంది.

ఈ క్రమంలోనే సోమవారం నుంచి పత్తి కొనుగోళ్లను బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. జిన్నింగ్ మిల్లుల గేట్లకు తాళాలు వేసింది. తమ సమస్యలు పరిష్కరించే వరకు ప్రైవేట్ కొనుగోళ్లను కూడా నిలిపివేయాలంటూ జిన్నింగ్, ప్రెస్సింగ్ పరిశ్రమల యజమానులకు విజ్ఞప్తి చేసింది. ఇదిలా ఉంటే కాటన్ అసోసియేషన్ నిర్ణయంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. సీజన్ ప్రారంభంలో వర్షాభావం, తర్వాత భారీ వర్షాలతో పత్తి చేలు జాలు పట్టిపోయింది. తెగుళ్ళు, చీడ పీడల బెడత కూడా ఎక్కువగానే ఉంది. ఫలితంగా దిగుబడి ఎకరానికి 10 – 12 క్వింటాళ్ళకు బదులు కేవలం ఐదారు క్వింటాళ్లకు మాత్రమే వచ్చింది. దిగుబడి తగ్గి ఆందోళన లో ఉన్న రైతులకు ఇప్పుడు మిల్లర్ల బంద్ మూలిగే నక్కమీద తాటికాయ పడ్డటయ్యింది. ఇప్పటికే చాలా మంది పత్తి రైతులు పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

Show comments