హైడ్రా బాటలో GHMC.. అలాంటి నిర్మాణాలపై ఫోకస్, ఇక కూల్చివేతలే..!

GHMC-Illegal Floor Construction: నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. ఈక్రమంలో తాజాగా జీహెచ్ఎంసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

GHMC-Illegal Floor Construction: నగరంలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తోంది. ఈక్రమంలో తాజాగా జీహెచ్ఎంసీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

నగరంలో చెరువులు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన అక్రమార్కులు హైడ్రా పేరు వింటనే హడలిపోతున్నారు. ఒక్కసారి ఆక్రమణ అని తెలిసిందా.. ఇక ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి. అక్రమార్కుల విషయంలో ఎలాంటి తారతమ్యం లేకుండా.. దూకుడుగా ముందుకు సాగుతుంది హైడ్రా. చిన్నాపెద్దా, పేద, ధనిక, సెలబ్రిటీ, సామాన్య అనే తేడా చూపడం లేదు. అక్రమార్కులు హైడ్రా పేరు చెబితనే భయపడుతుంటే.. సామాన్యులు మాత్రం దానికి జేజేలు పలుకుతున్నారు. హైడ్రా చర్యలతో స్ఫూర్తి పొందారో ఏమో తెలియదు కానీ.. జీహెచ్ఎంసీ అధికారులు కూడా వారి బాటలోనే పయనించాలని భావిస్తున్నారు. అక్రమ కట్టడాలపై హైడ్రా మాదిరే చర్యలు తీసుకోవడానికి జీహెచ్ఎంసీ అధికారులు రెడీ అవుతున్నారు. ఆ వివరాలు..

అక్రమ నిర్మాణాల పట్ల తాము కూడా కఠినంగా వ్యవహరిస్తామని అంటున్నారు జీహఎచ్ఎంసీ అధికారులు. దీనిలో భాగంగా తాజాగా.. హైదరాబాద్ మెహిదీపట్నం అయోధ్య నగర్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు కూల్చేశారు. పక్కా ఆధారాలతో రంగంలోకి దిగిన టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేశారు. సదరు బిల్డింగ్ యాజమాన్యం మూడు అంతస్తుల వరకే అనుమతి తీసుకుని.. ఆ తర్వాత 6 అంతస్తుల వరకు నిర్మించారని సర్కిల్-12 టౌన్ ప్లానింగ్ అధికారి తెలిపారు. దాంతో అనుమతులు లేకుండా నిర్మించిన 4, 5, 6 అంతస్తులను కూల్చివేసినట్లు చెప్పారు.

అక్రమ హోర్డింగ్‌లపై హైడ్రా ఫోకస్..

ప్రస్తుతం అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేస్తున్న హైడ్రా తాజాగా.. నగరంలోని అక్రమ హోర్డింగుల మీద కూడా ఫోకస్ పెట్టింది. నగరంలో ఎటువంటి అనుమతి లేకుండా వేలాదిగా ఏర్పాటు చేసిన హోర్డింగులను తొలగించేందుకు రెడీ అయింది. ఈ మేరకు హిమయత్‌నగర్‌ ప్రధాన రహదారి రోడ్డు డివైడర్‌పై ఏర్పాటు చేసిన ప్రకటన బోర్డులను హైడ్రా సిబ్బంది తొలగించారు. జీహెచ్‌ఎంసీ ఆదాయానికి గండి కొడుతూ నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రకటన సంస్థలు ఏర్పాటు చేసిన బోర్డులన్నింటినీ తొలగించనున్నట్లు హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ స్పష్టం చేశారు.
Show comments