DSC 2024: డీఎస్సీ పరీక్ష వాయిదాపై భట్టి విక్రమార్క కీలక ప్రకటన.. 6 వేల పోస్టులతో

Bhatti Vikramarka-DSC 2024, Group 2 Exam Postpone: తెలంగాణలో డీఎస్సీ, గ్రూప్‌ 2 వంటి పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తోన్న ఆందోళనపై స్పందిస్తూ.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

Bhatti Vikramarka-DSC 2024, Group 2 Exam Postpone: తెలంగాణలో డీఎస్సీ, గ్రూప్‌ 2 వంటి పరీక్షలు వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తోన్న ఆందోళనపై స్పందిస్తూ.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం నిరుద్యోగులు అని చెప్పవచ్చు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో.. పోటీ పరీక్షల నిర్వహణలో జరిగిన అవకతవకలు నిరుద్యోగాల్లో తీవ్ర అసంతృప్తిని మిగిల్చాయి. ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ.. నిరుద్యోగుల సమస్యలను తెలుసుకుని.. వారికి మద్దతుగా నిలిచింది. తాము అధికారంలోకి వస్తే… 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని.. డీఎస్సీ, గ్రూప్స్‌ పోస్టులు పెంచుతామని హామీ ఇచ్చింది. దాంతో నిరుద్యోగులు కాంగ్రెస్‌కు పూర్తి స్థాయిలో మద్దతిచ్చి.. ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కారణమయ్యారు.

కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ.. ఈ హామీల అమలును పక్కకు పెట్టింది. పోస్టులను పెంచకుండానే ఉద్యోగాల భర్తీకి రెడీ అవుతోంది. పలు పోటీ పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది. దాంతో నిరుద్యోగులు గ్రూప్‌ 2, డీఎస్సీ పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క డీఎస్సీ వాయిదాపై మాట్లాడుతూ.. కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..

నిరుద్యోగుల ఆందోళనపై తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. నిరుద్యోగయువతపైనే దృష్టి కేంద్రీకరించామన్న ఆయన మొదటి మూడు నెలల్లోనే 30వేల మందికి నియామక పత్రాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు. మిగిలిన ఉద్యోగాలు ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. అలానే పరీక్షల వాయిదాపై ఆయన స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నియమాకాల కోసం. అధికారంలోకి రాగానే 16 వేల ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నట్టు గుర్తించాం. 11 వేల టీచరు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం. 19,717 మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు, 34 వేల మందిని బదిలీ చేశాం. ఈనెల 11 నుంచి డీఎస్సీ హాల్‌ టికెట్లు అందుబాటులో ఉంచాం. కొన్ని నెలలుగా అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు.

‘‘అయితే కొందరు మాత్రం.. ఉద్యోగ పరీక్షలు వాయిదా వేయాలని విజ్ఞప్తి, ధర్నాలు చేస్తున్నారు. పదేళ్లలో ఎన్నడూ గ్రూప్‌-1 నిర్వహించలేదు. గ్రూప్‌-2ను ఇప్పటికే 3 సార్లు వాయిదా వేశారు. పరీక్షలు అన్ని సార్లు వాయిదా వేయడం మంచి పద్దతి కాదు. త్వరితగతిన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడమే మా లక్ష్యం. హాస్టల్‌ వెల్ఫేర్‌కి సంబంధించి 581 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించాం. ఇదే చివరి డీఎస్సీ కాదు.. మరిన్ని తీస్తాం. త్వరలోనే మరో 5-6వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం’’ అని భట్టి విక్రమార్క తెలిపారు. కానీ నిరుద్యోగులు మాత్రం పరీక్షలు వాయిదా వేయాల్సిందే అని పట్టుబడుతున్నారు. మరి సీఎం రేవంత్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Show comments