సచిన్ శివుడిగా మారిన రాత్రి! అక్తర్ పొగరుకు గుణపాఠం! 21 ఏళ్ల నాటి కథ!

Sachin Tendulkar, Shoaib Akhtar, 2003 World Cup, IND vs PAK: దేశం మొత్తం ఒక్క సచిన్‌పై నమ్మకం పెట్టుకుంది.. అదే సచిన్‌కు బలమైందో ఏమో కానీ.. 14 రోజులు నిద్రలేకుండా.. పాక్‌ను ఊచకోత కోశాడు. శివరాత్రి నాడు.. శివతాండవం ఆడాడు. ఆ విధ్వంసం గురించి, ఉద్విగ్న క్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Sachin Tendulkar, Shoaib Akhtar, 2003 World Cup, IND vs PAK: దేశం మొత్తం ఒక్క సచిన్‌పై నమ్మకం పెట్టుకుంది.. అదే సచిన్‌కు బలమైందో ఏమో కానీ.. 14 రోజులు నిద్రలేకుండా.. పాక్‌ను ఊచకోత కోశాడు. శివరాత్రి నాడు.. శివతాండవం ఆడాడు. ఆ విధ్వంసం గురించి, ఉద్విగ్న క్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

రామావతారం ఎందుకంటే ధర్మాన్ని నిలబెట్టడానికి అంటారు. కృష్ణావతారం ఎందుకంటే అధర్మాన్ని సంహరించడానికి అని చెప్తారు. కానీ.., సచిన్ అనే క్రికెట్ దేవుడి అవతారం ఎందుకంటే? ఒక్క మాటలోనో, ఒక్క మ్యాచ్‌తోనో తేల్చేసే ప్రస్థానం కాదది. ఇండియా జెండా సగర్వంగా ఎగరాల్సిన ప్రతిసారి.. బ్యాటుతో యుద్ధమే చేసిన అవతారపురుషుడాయన. అలాంటి సచిన్.. సరిగ్గా 21 ఏళ్ల క్రితం ఓ నాడు.. ఏకంగా శివుడిగా మారిపోయాడు! చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై శివతాండవమే ఆడేశాడు. దేశమంతా జాగారం చేసిన ఆ రాత్రి.. సచిన్ తన విశ్వరూపం చూపించాడు. 100 కోట్ల గొంతుకలు ఒక్కసారిగా సచిన్ సచిన్.. సచిన్ సచిన్ అంటూ అరవడంతో.. శివనామ స్మరణ జరగాల్సిన ఆ రాత్రి.. సచిన్ నామ స్మరణతో పులకించిపోయింది. ఇన్ని అద్భుతాలకి వేదికైన ఆ మ్యాచ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

2003 వన్డే వరల్డ్‌ కప్‌ అనగానే.. సౌరవ్‌ గంగూలీ కెప్టెన్సీలోని టీమిండియా ఫైనల్‌ ఆడిందనే విషయం క్రికెట్‌ అభిమానులకు గుర్తుకొస్తుంది. ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన ఆ ఫైనల్‌ ఓటమి బాధిస్తుంది. కానీ, అదే వరల్డ్‌ కప్‌లో పాకిస్థాన్‌ తో జరిగిన డూ ఆర్‌ డై మ్యాచ్‌, ఆ మ్యాచ్‌ కంటే ముందు టీమిండియా అనుభవించిన నరకయాతన, క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ గడిపిన నిద్రలేని రాత్రులు, టీమిండియా స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌, పాకిస్థాన్‌ బ్యాటర్‌ మొహమ్మద్‌ యూసుఫ్‌ మధ్య జరిగిన గొడవ చాలా మందికి తెలిసి ఉండవు.. అయినా వీటన్నింటిని దాటి.. సచిన్‌ టెండూల్కర్‌ పాకిస్థాన్‌పై ఆడిన శివతాండవం, తననే సవాల్‌ చేసిన షోయబ్‌ అక్తర్‌కు బుద్ధి చెప్పిన విధానం ఒక చరిత్ర.

సచిన్‌, సెహ్వాగ్‌, గంగూలీ, ద్రవిడ్‌, యువరాజ్‌ సింగ్‌, కైఫ్‌, జహీర్‌ ఖాన్‌, ఆశిష్‌ నెహ్రా లాంటి స్టార్లతో కూడిన జట్టు సౌతాఫ్రికా, జింబాబ్వే వేదికగా జరిగిన ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌ కప్‌ 2003 టోర్నీ కోసం సిద్ధమైంది. జట్టుపై భారీ అంచనాలు, భరించలేని ప్రెజర్‌ ఉంది. కానీ, వరల్డ్‌ కప్‌ టోర్నీ ఆరంభానికి ముందు.. సౌతాఫ్రికా క్లబ్‌ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఓడిపోయింది. మెయిన్‌ టోర్నీలో నెదర్లాండ్స్‌తో జరిగిన ఫస్ట్‌మ్యాచ్‌లో గెలిచినా.. 10 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఘోర ఓటమి. అంతే.. భారత క్రికెట్‌ అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వారిని శాంతింపజేసేందుకు ఏకంగా సచిన్‌ టెండూల్కర్‌ ఒక ప్రెస్‌మీట్‌ పెట్టి మరీ.. కంగారు పడకండి బాగా ఆడతాం అని చెప్పాల్సి వచ్చింది. టోర్నీ సాగుతుండగానే.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌ ముంచుకొచ్చింది. ఇండియా-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఇప్పటిలాగా కాదు.. అదో రెండు దేశాల మధ్య యుద్ధం. దేశ పరువును తమ భుజాలపై మోస్తున్నామనే బాధ్యతతో ఆడేవాళ్లు రెండు దేశాల క్రికెటర్లు.

టోర్నీ మొత్తం టీమిండియా ప్రదర్శన ఎలా ఉన్నా.. పాకిస్థాన్‌పై మాత్రం గెలిచి తీరాల్సిందే అని క్రికెట్‌ అభిమానుల నుంచి ఒత్తిడి. సచిన్‌ టెండూల్కర్‌ ఎక్కడికి వెళ్లినా ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ గురించే ప్రశ్నలు. దాదాపు వంద రోజులుగా సచిన్‌ మైండ్‌లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌ నడుస్తూనే ఉంది. సచిన్‌పై ఎంత ప్రెజర్‌ పెరిగిపోయిందంటే.. మ్యాచ్‌కి 14 రోజుల ముందు సచిన్‌ ప్రశాంతంగా నిద్రపోలేదు. మ్యాచ్‌ గురించే ఆలోచిస్తూ.. నిద్రలేని రాత్రులు గడిపారు. ఒక వైపు సచిన్‌ ఇలా నరకయాతన అనుభవిస్తుంటే.. పాకిస్థాన్‌ పేస్‌ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ మైండ్‌ గేమ్‌తో సచిన్‌పై మరింత ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు. ఇండియాతో జరిగే మ్యాచ్‌లో సచిన్‌ను తన వేగంతో, షార్ట్‌ పిచ్‌ బాల్స్‌తో అవుట్‌ చేస్తానని సవాల్‌ చేశాడు. అలాగే ఇంజుమామ్‌ ఉల్‌ హక్‌ సైతం.. ఇండియాతో మ్యాచ్‌లో అదరగొట్టేందుకు బరువు తగ్గుతున్నానని, కచ్చితంగా రనౌట్‌ కానని పేర్కొన్నాడు. కానీ, మ్యాచ్‌లో రనౌటే అయ్యాడు. అయితే.. అక్తర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ మాత్రం క్రికెట్‌ ప్రపంచంలో అగ్గిరాజేసింది. ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అంటే ఉండే ఫైర్‌ మరింత ఎక్కువైంది.

అప్పటికే క్రికెట్‌లో లెజెండ్‌లా మారిపోయిన సచిన్‌ అంతటోడ్ని.. వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లో డకౌట్‌ చేస్తానంటూ ఓ పాకిస్థాన్‌ బౌలర్‌ సవాల్‌ చేయడం అంటే చిన్న విషయం కాదు. అక్తర్‌ చేసిన సవాల్‌ కంటే కూడా.. దేశం పరువు కోసం, తనపై కోట్ల మంది భారత క్రికెట్‌ అభిమానులు పెట్టుకున్న నమ్మకం నిలబెట్టుకోవాలనే తపన సచిన్‌ను నిద్రపోనివ్వలేదు. తన బ్యాట్‌ను కూడా తనతోపాటే బెడ్‌పై పక్కనే పెట్టుకునే వాడు సచిన్‌. అతనిపై ఎంత ప్రెజర్‌ ఉందో చెప్పేందుకు ఈ ఒక్క విషయం చాలు. మ్యాచ్‌ కోసం.. హోటల్‌ రూమ్‌ నుంచి టీమిండియా ఆటగాళ్లు స్టేడియానికి చేరుకున్నారు.. కానీ, వాళ్ల కంటే ముందే పాకిస్థాన్‌ ఆటగాళ్లు గ్రౌండ్‌కి వచ్చేసి ముమ్మరంగా ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అది చూసి.. టీమిండియా ఆటగాళ్లకు గుండెజారినంత పనైంది. వీళ్లేంటి మనకంటే కసిగా ఉన్నారు అనే ఫీలింగ్‌ వచ్చింది.

ఇలా ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ ప్రెజర్‌ ఒకవైపు ఉంటే.. మరోవైపు టీమిండియా స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌, పాకిస్థాన్‌ బ్యాటర్‌ మొహమ్మద్‌ యూసుఫ్‌ మధ్య గొడవ. మ్యాచ్‌ ముందు రోజు రాత్రి.. రెండు టీమ్స్‌ డిన్నర్‌లో పాల్గొన్నాయి. ఆ సమయంలో భజ్జీ-యూసుఫ్‌ మధ్య ఏదో మాటామాట పెరిగి.. ఇద్దరు కొట్టుకునే వరకు వచ్చింది పరిస్థితి. రెండు టీమ్స్‌లోని సీనియర్‌ ప్లేయర్లు ఇద్దర్ని కంట్రోల్‌ చేయడంతో ఆ గొడవ అక్కడితో ఆగింది. కానీ, అసలు సిసలు సమరం.. మ్యాచ్‌లో ఉంది. వరల్డ్‌ కప్‌ టోర్నీలో కొనసాగాలంటే ఇండియాకు డూ ఆర్‌ డై మ్యాచ్‌. గెలిస్తే టోర్నీలో ఉంటాము.. ఓడితే ఇంటికెళ్తాం. ఇదే ప్రెజర్‌ పెంచుతుంది అంటే.. పాకిస్థాన్‌తో మ్యాచ్‌, అభిమానుల అంచనాలు, సచిన్‌కు నిద్రలేదు, అక్తర్‌ సవాల్‌ చేశాడు, భజ్జీ-యూసుఫ్ మధ్య గొడవ జరిగింది.. వింటుంటేనే బుర్ర బద్ధలైపోతుంది కదు. కానీ, ఇంత ఒత్తిడిలో కూడా క్రికెట్‌ దేవుడు సచిన్.. పాకిస్థాన్‌పై శివతాండవం ఆడాడు.

2003 మార్చి 1.. సెంచూరియన్‌ వేదికగా మ్యాచ్‌ మొదలైంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ 273 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. పాక్‌ ఓపెనర్‌ సయీద్‌ అన్వర్‌.. టీమిండియా బౌలర్లను ఊచకోత కోస్తూ.. సెంచరీతో చెలరేగాడు. 273 అంటే వామ్మో పెద్ద స్కోరే అని భారత క్రికెట్‌ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అంతలోనే.. సచిన్‌ టెండూల్కర్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌ ఛేజింగ్‌ కోసం బరిలోకి దిగారు. సచిన్‌ అలా గ్రౌండ్‌కు దండం పెట్టి.. ఆకాశంలోకి చూస్తూ.. బ్యాటింగ్‌ కోసం నడుచుకుంటూ వస్తుంటే.. ‘సచిన్‌.. సచిన్‌..’ అంటూ స్టేడియం మారుమోగిపోయింది. సచిన్‌పై దేశం ఎన్ని ఆశలు పెట్టుకుందో.. ఆ అరుపులు వింటే అర్థమైపోతుంది. అయితే.. 274 పరుగులు టార్గెట్‌ను ఛేజ్‌ చేసేందుకు టీమిండియా కోచ్‌ జాన్‌ రైట్‌ చెప్పిన స్ట్రాటజీ ఏంటంటే.. తొలి 10 ఓవర్లు వికెట్లు ఇవ్వకుండా ఆడాలి, తర్వాత ఎటాక్‌ చేయాలి అని. తొలి ఓవర్‌లో సచిన్‌, సెహ్వాగ్‌ కోచ్‌ ప్లాన్‌కు తగ్గట్లే బ్యాటింగ్‌ చేశారు.

కానీ, రెండో ఓవర్‌ వేసేందుకు షోయబ్‌ అక్తర్‌ బాల్‌ అందుకున్నాడు. మ్యాచ్‌కి రెండు రోజుల ముందే సచిన్‌కు సవాల్‌ చేశాడు. ఇప్పుడు మ్యాచ్‌లో ఫస్ట్‌ ఓవర్‌తోనే సెహ్వాగ్‌ను టార్గెట్‌గా చేసుకొని.. స్లెడ్జింగ్‌ మొదలుపెట్టాడు. షార్ట్‌ పిచ్‌ బాల్స్‌ వేస్తూ.. ‘దమ్ముంటే హుక్‌ కొట్టి చూపించూ’ అని సవాల్‌ విసిరాడు. తర్వాత బాల్‌ కూడా అంతే వేసి అదే రెచ్చగొట్టే మాటలు అన్నాడు. అగ్రెసివ్‌ బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన సెహ్వాగ్‌.. కోచ్‌ ప్లాన్‌ ప్రకారం.. తన సహజ శైలిని పక్కనపెట్టి.. స్లోగా ఆడుతుండటంతో అప్పటికే బాగా చిరాగ్గా ఉన్నాడు. ఆపై ఈ అక్తర్‌ మాటలు మరింత రెచ్చగొట్టాయి. ‘దమ్ముంటే హుక్‌ కొట్టి చూపించూ’ అని అక్తర్‌ చెప్పిన మాటకు సెహ్వాగ్‌ బదులిస్తూ.. ‘అదిగో నాన్‌స్ట్రైకింగ్‌ ఎండ్‌లో నీ అయ్య(సచిన్‌) నిలబడి ఉన్నాడు.. అతనికి వెళ్లి చెప్పు హుక్‌ ఆడమని’ అని గట్టి కౌంటర్‌ ఇచ్చాడు.

అదే ఓవర్‌ నాలుగో బంతికి సచిన్‌ టెండూల్కర్‌ స్ట్రైక్‌లోకి వచ్చాడు. సెహ్వాగ్‌కు వేసినట్లే.. ఆ నాలుగో బంతిని అవుట్‌సైడ్‌ ఆఫ్‌ స్టంప్‌ షార్ట్‌ పిచ్‌ బాల్‌గా వేశాడు అక్తర్‌. సచిన్‌ టెండూల్కర్‌ అద్భుతమైన హుక్‌ షాట్‌తో ఆ బాల్‌ను సిక్స్‌ కొట్టాడు. అంతే స్టేడియం దద్దరిల్లిపోయింది. ఆ సిక్స్‌తో ఒక్కసారిగా టీమిండియా ప్లాన్‌ మొత్తం మారిపోయినట్లుగా కనిపించింది. అప్పటి వరకు స్లోగా ఆడి.. వికెట్లు కాపాడుకోవాలి అనుకున్న ప్లాన్‌ కాస్తా ఎటాకింగ్‌ మూడ్‌లోకి వచ్చేసింది. సచిన్‌ కొట్టిన సిక్స్‌.. అక్తర్‌లో కోపం పెంచింది. అప్పటికే ప్రపంచ క్రికెట్‌లో ఫాస్టెస్ట్‌ బౌలర్‌ అయిన అక్తర్‌.. మరింత శక్తిని కూడదీసుకొని.. గంటకు 150 కిలో మీటర్లకి పైగా వేగంతో బంతులేశాడు. కానీ, సచిన్‌ ముందు ఆ వేగం సరిపోలేదు. సిక్స్‌ తర్వాత.. మరో రెండు ఫోర్లు వరసగా బాది.. అక్తర్‌ అనే ఓ బచ్చా బౌలర్‌కు తగిన బుద్ధి చెప్పాడు క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌.

సచిన్‌ను ఎక్కువ సేపు ఆడనివ్వను అని ఛాలెంజ్‌ చేసిన అక్తర్‌ను తొలి ఓవర్‌లోనే చావుదెబ్బకొట్టాడు. ఆ ఓవర్‌ తర్వాత నేను బౌలింగ్‌ వేయను అని.. షోయబ్‌ అక్తర్‌ పాకిస్థాన్‌ కెప్టెన్‌కు చెప్పాడంటే.. సచిన్‌ ఎంతలా భయపెట్టి ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. 14 రోజులు నుంచి నిద్రలేకపోయినా.. దేశం మొత్తం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలనే కసితో.. సచిన్‌ పాక్‌ బౌలర్లను చీల్చిచెండాడు. ఒక వైపు సచిన్‌ చెలరేగుతుంటే.. మరో వైపు టీమిండియా వికెట్లు కోల్పోయింది సెహ్వాగ్‌, గంగూలీ, కైఫ్‌ వెంటవెంటనే అవుట్‌ అయ్యారు. అయినా కూడా సచిన్‌ తన ఊచకోతను ఆపలేదు. కానీ, గత కొన్ని రోజులుగా సరిగ్గా నిద్రలేకపోవడం, ఒత్తిడి వల్ల మ్యాచ్‌ మధ్యలో సచిన్‌ కండరాలు పట్టేశాయి.

క్రామ్స్‌తో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు.. 75 బంతుల్లో 12 ఫోర్లు, ఒక సిక్స్‌ బాది.. 98 పరుగులు చేసి ఆల్‌మోస్ట్‌ టీమిండియాను విజయం ముంగిట నిలిపి అవుట్‌ అయ్యాడు. ​కానీ, సెంచరీకి కేవలం రెండు పరుగుల దూరంలో అవుట్‌ అయ్యాడు. మ్యాచ్‌ను ముగించలేకపోయానే అనే బాధతో గ్రౌండ్‌ నుంచి చాలా నిరాశగా డ్రెస్సింగ్‌ రూమ్‌ వైపు నడిచాడు సచిన్‌. జట్టు సభ్యులందరికీ కాస్త దూరంగా ఒక్కడే కూర్చున్నాడు. కొన్ని ఏళ్లుగా జట్టు భారాన్ని తన భుజాలపై మోస్తున్న సచిన్‌.. ఏం చేయాలో అంతకంటే ఎక్కువే చేశాడు. కానీ, సచిన్‌ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అనే ఆందోళన క్రికెట్‌ అభిమానులతో పాటు సచిన్‌లోనూ కలిగింది.

98 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడిన తర్వాత కూడా.. డ్రెస్సింగ్‌ రూమ్‌లో సైలెంట్‌గా కూర్చుండిపోయాడు. సచిన్‌ చూపించిన తెగువకు, అతని పోరాటానికి విలువిస్తూ.. రాహుల్‌ ద్రవిడ్‌, యువరాజ్‌ సింగ్‌ మరో వికెట్‌ కోల్పోకుండా.. జాగ్రత్తగా ఆడి మ్యాచ్‌ గెలిపించారు. మ్యాచ్‌ ముగిసి.. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకోవడానికి వచ్చాడు సచిన్‌. స్టేడియం మొత్తం.. ‘సచిన్‌.. సచిన్‌..’ అంటూ దద్దరిల్లింది. పోస్ట్‌ మ్యాచ్‌ సెలబ్రేషన్స్‌ అయిపోయిన తర్వాత.. సచిన్‌ టెండూల్కర్‌ తన భార్యకు ఫోన్‌ చేశాడు.. ఆమె ఫోన్‌ ఎత్తి మాట్లాడకుండా.. ఫోన్‌ను కిటికీలోంచి కాస్త బయటపెట్టింది. సచిన్‌ ఇంటి బయట బాణాసంచా కాలుస్తూ అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు.

ఒక్క సచిన్‌ ఇంటి దగ్గరే కాదు.. ఇండియా మొత్తం సంబరాలు అంబరాన్ని అంటాయి. ఆ రోజు దేశం నిద్రపోలేదు. అందుకు రెండు కారణాలు ఉన్నాయి.. ఒకటి ఆ రోజు శివరాత్రి, రెండు క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌ పాకిస్థాన్‌పై శివతాడవం ఆడిన రాత్రి. అందుకే.. ఆ విజయం తర్వాత తెలుగు న్యూస్‌ పేపర్లలో.. ‘ఇండియాకు శివరాత్రి.. పాక్‌కు కాళరాత్రి’ అనే టైటిల్‌తో ఆర్టికల్స్‌ పబ్లిష్‌ అయ్యాయి. ఆ ఒక్క మ్యాచ్‌.. సచిన్‌ టెండూల్కర్‌ అనే ఓ క్రికెటర్‌.. దేవుడ్‌ ఎందుకయ్యాడో చెప్పేందుకు ఒక ఉదాహరణగా నిలిచింది. మరి ఆ మ్యాచ్‌లో అక్తర్‌ పొగరుగా చేసిన సవాల్‌కు సచిన్‌ బుద్ధి చెప్పిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments