షార్జాలో 26 ఏళ్ళ క్రితం సచిన్ సృష్టించిన విధ్వంసం తెలుసా? అది ఆస్ట్రేలియాకి పీడకల!

Sachin Tendulkar, Sharjah, 1998, IND vs AUS: షార్జాలో ఆసీస్‌ను సచిన్‌ టెండూల్కర్‌ ఉగ్రనరసింహుడిలా చీల్చిచెండాడిన ఇన్నింగ్స్‌ చాలా మంది క్రికెట్‌ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. 26 ఏళ్ల క్రితం జరిగిన ఆ విధ్వంస గురించి ఇప్పుడు మరోసారి తెలుసుకుందాం..

Sachin Tendulkar, Sharjah, 1998, IND vs AUS: షార్జాలో ఆసీస్‌ను సచిన్‌ టెండూల్కర్‌ ఉగ్రనరసింహుడిలా చీల్చిచెండాడిన ఇన్నింగ్స్‌ చాలా మంది క్రికెట్‌ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. 26 ఏళ్ల క్రితం జరిగిన ఆ విధ్వంస గురించి ఇప్పుడు మరోసారి తెలుసుకుందాం..

చాలా కథలు అనగనగా అని మొదలవుతాయి. కానీ.., సచిన్ రమేశ్ టెండూల్కర్ అనే క్రికెట్ దేవుడి కథ చెప్పాలంటే.. షార్జా మైదానంలో ఆయన ఆడిన శివతాండవం నుండి స్టార్ట్ చేయాలి. షేన్ వార్న్‌ కలలో కూడా భయపడేలా కొట్టిన సిక్సుల నుంచి మొదలు పెట్టాలి. ప్రపంచ క్రికెట్‌ని శాసించే.. ఆస్ట్రేలియాని పసికూన మాదిరి.. ఉరుకులు పెట్టించి కొట్టిన ఆ ఆట దగ్గర నుండే వివరించాలి. ఓ తరం జీవితంలో మర్చిపోలేని 2 మ్యాచులు అవి. MRF బ్యాటు పట్టుకొని దేశం కోసం బరిలోకి దిగుతుంది మామూలు సచిన్ కాదురా.. సచిన్ అనే దేవుడు అని యావత్ ప్రపంచం నమ్మేలా చేసిన మ్యాచులు అవి. తరువాత తరానికి ఖచ్చితంగా చెప్పాలిన కథ అది. సచిన్ ఒంటి చేత్తో చేసిన ఊచకోత అది. ‘ఇప్పటిదాకా మీరు ఒక మగాడు.. ఆడదాన్ని చెర్చేది వినుంటారు.. కానీ, ఇప్పుడు ఒక మగాడు, ఇంకో మగాన్ని చెరిస్తే ఎట్టా ఉంటాదో చూపిస్తా’ అని ఓ సినిమాలో డైలాగ్‌ ఉంటుంది. ఈ మాటలో ఎంత విధ్వంసం ఉందో.. అంతకు పది రెట్లు.. విధ్వంసాన్ని ఆస్ట్రేలియాపై సృష్టించాడు సచిన్‌ టెండూల్కర్‌. ఆ రోజు అతని ఆటకు ఆస్ట్రేలియానే కాదు.. మొత్తం క్రికెట్‌ ప్రపంచమే ఉలిక్కిపడింది. ఇసుక తుఫాన్‌ వచ్చి.. మ్యాచ్‌ ఓ అర గంట ఆగిపోయింది.. ఆ తర్వాత అసలు సిసలైన సునామీ స్టేడియాన్ని ముంచేసింది. క్రికెట్‌ లోకం.. దాన్ని ‘డిజర్ట్‌ స్ట్రోమ్‌’ అని పిలుచుకుంటూ ఉంటుంది. ఆ అద్భుతమైన ఆట గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1998 ఏప్రిల్‌ 17 నుంచి 24 మధ్య కోకకోలా కప్‌ పేరుతో.. ఇండియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల మధ్య ట్రైయాంగిల్‌ సిరీస్‌ జరిగింది. 1998 ఏప్రిల్‌ 22.. ఎడారి దేశమైన దుబాయ్‌లోని షార్జాలో ఇండియా – ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్‌. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసీస్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 284 పరుగులు చేసింది. ఇసుక తుఫాన్‌ రావడంతో మ్యాచ్‌కు అంతరాయం ఏర్పడింది. దాంతో.. టీమిండియాకు 46 ఓవర్లలో 276 పరుగులకు కుదించారు. ఫైనల్‌ చేరాలంటే.. కనీసం 238 పరుగులు చేయాలి టీమిండియా. ఆ రోజుల్లో అది చాలా పెద్ద టార్గెట్. ఆస్ట్రేలియాపై ఇంకా కష్టం. అప్పటికే ఈ సిరీస్‌లో ఓటమి అనేది లేని జట్టు. ఆ సిరీస్‌ అనే కాదు.. అప్పటికే వరల్డ్‌ క్రికెట్‌ను శాసిస్తున్న అరివీర భయంకరమైన టీమ్‌, ఆస్ట్రేలియా.

అలాంటి టీమ్‌ను ఎదుర్కొంటూ.. 46 ఓవర్లలో 238 పరుగులు చేయడం అంటే.. సాధారణ విషయం కాదు. అప్పటికే టీమిండియా, న్యూజిలాండ్‌పై ఒక మ్యాచ్‌ గెలిచి మరో మ్యాచ్‌లో ఓడింది. ఆస్ట్రేలియాపై కూడా ఓడిపోయింది.. దాంతో టీమ్‌లో ఆత్మవిశ్వాసం ఇసుమంతైనా లేదు. కానీ.. అలాంటి సమయంలో ఇండియన్‌ క్రికెట్‌కు దేవుడిగా ఎదుగుతున్న సచిన్‌ టెండూల్కర్‌ తన ఉగ్రరూపం దాల్చాడు. ఓ వైపు వికెట్లు పడిపోతున్నా.. మరో ఎండ్‌లో సచిన్‌ పాతుకుపోయాడు. డామియన్ ఫ్లెమింగ్, మైఖేల్ కాస్ప్రోవిచ్, షేన్‌ వార్న్‌, టామ్‌ మూడీ బౌలర్లతో కూడిన పటిష్టమైన బౌలింగ్‌ యూనిట్‌పై సచిన్‌ ఎదురుదాడికి దిగాడు. అది మామూలు ఎదురుదాడి కాదు.. పైన చెప్పకుంటున్నట్లు.. ఒక మగాడు ఇంకో మగాడ్ని చెర్చడం లాంటి భయంకరమైన విధ్వంసం.

తన బ్యాట్‌ నుంచి.. అద్భుతమైన స్ట్రేట్‌ డ్రైవ్‌లు, కవర్‌ డ్రైవ్‌లు చూస్తున్న వారికి ఒక్కసారిగా తనలోని హిట్టర్‌ను పరిచయడం చేశాడు సచిన్‌. మైఖేల్ కాస్ప్రోవిచ్ బౌలింగ్‌లో డీప్‌ మిడ్‌ మీదుగా కొట్టిన సిక్సులు ఇప్పటికీ క్రికెట్‌ అభిమానుల గుండెల్లో అలా నిలిచిపోయి ఉన్నాయి. ఆ మ్యాచ్‌లో సౌరవ్‌ గంగూలీ, నయాన్‌ మోంగియా, కెప్టెన్‌ అజహరుద్దీన్‌ లాంటి ఆటగాళ్లు.. ఆసీస్‌ బౌలర్ల ముందు చేతులెత్తేస్తే.. సచిన్‌ మాత్రం.. వారితో ఓ ఆట ఆడుకున్నాడు. సచిన్‌ బ్యాటింగ్‌కు సునీల్‌ గవాస్కర్‌, రవిశాస్త్రి చెబుతున్న కామెంట్రీ వీడియో ఇప్పటికీ క్రికెట్‌ అభిమానులకు గూస్‌బమ్స్‌ తెప్పిస్తూ ఉంటుంది.

వీడియోనే ఆ రేంజ్‌లో ఉంటే.. ఆ మ్యాచ్‌ను లైవ్‌లో చూసిన వాళ్లు అప్పట్లో ఎలా ఫీలైఉంటారో మీ ఊహకే వదిలేస్తున్నాం. విధ్వంసకర బ్యాటింగ్‌తో సచిన్‌ శివాలెత్తుతుంటే.. స్టేడియం హోరెత్తిపోయింది. ఫోర్లు, సిక్సులతో చెలరేగిన సచిన్‌.. సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ, ఇంకా పని పూర్తి కాలేదు. ఇండియా ఫైనల్‌కు వెళ్లాలంటే.. ఇంకా రన్స్‌ కావాలి. అప్పటికే ఆస్ట్రేలియా బౌలర్లు చెమటలు కక్కుతున్నారు. సచిన్‌ అలా ఆడుతుంటే.. ఏం చేయాలో  కూడా వాళ్లకు అర్థం కావడం లేదు. అతన్ని అవుట్‌ చేయడం సంగతి పక్కనపెడితే.. కనీసం రన్స్‌ కొట్టించుకోకుంటే ఉంటే చాలు దేవుడా అనే ఎక్స్‌ప్రెషన్లు ఆసీస్‌ బౌలర్ల ముఖాల్లో క్లియర్‌గా కనిపించాయి. ఆ రేంజ్‌లో సచిన్‌ టెండూల్కర్‌ ఆస్ట్రేలియా బౌలర్లను చీల్చిచెండాడాడు. హాఫ్‌ సెంచరీ, సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత. కెమెరా వైపు సచిన్‌ బ్యాట్‌ చూపించే స్టైల్‌.. ఆ అగ్రెషన్‌.. కొన్నేళ్ల పాటు క్రికెట్‌ అభిమానులను వెంటాడింది.

సచిన్‌ సృష్టించిన విధ్వంసంతో.. 42.2 ఓవర్లలోనే టీమిండియా 238 పరుగులు చేసి.. రన్‌ రేట్‌ ఆధారంగా ఫైనల్‌ బెర్త్‌ ఖారారు చేసుకుంది. కానీ.., నక్కి నక్కి కాదే, ఫైనల్స్‌కి తొక్కుకుంటూ పోవాలే! ఆసీస్‌ను చిత్తు చేసే ఫైనల్స్ ఆడాలి అన్నట్టు సచిన్ ఆట సాగింది. కానీ, అదే ఓవర్‌ 43 ఓవర్‌ చివరి బంతికి సచిన్‌ కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. నిజానికి అంపైర్‌ సచిన్‌ను అవుట్‌గా ప్రకటించలేదు. కానీ, నిజాయితీకి మారు పేరు, జెంటిల్‌ మెన్‌ గేమ్‌కు నిలుటద్దంలాంటి సచిన్‌.. పెవిలియన్‌ వైపు అడుగులేశాడు. అప్పటి వరకు ఉగ్రనరసింహుడిలా ఆసీస్‌పై చెలరేగిన సచిన్‌.. ఆ తర్వాత ఎంతో హుందాగా అవుట్‌ ఒప్పుకొని.. ఆటతో పాటు తన వ్యక్తిత్వంలో కూడా ఎక్కడికో ఎదిగిపోయాడు. మొత్తంగా 131 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్సులతో 143 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు.. సచిన్‌ అవుట్‌ తర్వాత టీమిండియా ఎక్కువ రన్స్‌ చేయలేకపోయింది. 50 ఓవర్లలో 250 రన్స్‌కే పరిమితం అయి మ్యాచ్‌ ఓడిపోయింది. మ్యాచ్‌ పోయినా.. సచిన్‌ సంచలన బ్యాటింగ్‌తో రన్‌రేట్‌ ఆధారంగా మళ్లీ ఆసీస్‌తో ఫైనల్‌కు సిద్ధమైంది టీమిండియా. కానీ.., సచిన్ తుఫాను అక్కడితో ఆగలేదు, అతను మళ్ళీ బ్యాటు పట్టుకొని తమపై పడిపోవడానికి ఎన్నో గంటల సమయం లేదనే విషయాన్ని కంగారు జట్టు గుర్తించలేకపోయింది.

1998 ఏప్రిల్ 22న ఆ మ్యాచ్ ముగియగానే ఇండియా అంతా సంబరాలు. క్రికెట్‌లో మా దేశానికి ఓ మగాడు దొరికాడు అంటూ హొరింతలు. సచిన్.. సచిన్.. అంటూ ప్రతి ఇండియన్ గుండె ఉద్వేగంతో ఊగిపోయింది. ఇప్పటి సోషల్ మీడియా  లేని ఆ యుగంలో కూడా ప్రతి గడపలోకి సచిన్ వెళ్ళిపోయాడు. కొన్ని ఇళ్లల్లో అయితే పూజ గదుల్లోకి కూడా చేరిపోయాడు. ఒక్క రాత్రిలో దేవుడైపోయాడు సచిన్. తన భుజాలపై మోయలేనంత భారం. కొన్ని కోట్ల మంది పెట్టుకున్న నమ్మకం. సచిన్ మాత్రం ప్రశాంతంగా ఫైనల్స్‌కి సిద్దమయ్యాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 272 పరుగులు చేసింది. మాములుగా అయితే ఆ రోజుల్లో అది భారీ స్కోర్. తాము పెద్ద టార్గెటే ఇచ్చామని ఆస్ట్రేలియాకి తెలుసు. కానీ.., వారి మనస్సులో ఏదో అలజడి. ఏదో భయం. ఆ భయం పేరు సచిన్ రమేశ్ టెండూల్కర్.

క్రికెట్ దేవుడు మళ్ళీ ఊచకోత మొదలు పెట్టాడు. ఈసారి ఇంకాస్త కసిగా, ఇంకాస్త వేడిగా, ఇంకాస్త భయానకంగా. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడుతూ.. ఆస్ట్రేలియా బౌలింగ్‌ ని చెడుగుడు ఆడుకున్నాడు. 131 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సులతో 134 పరుగులు చేసి.. టార్గెట్‌లో సగం రన్స్‌ ఒక్కడే కొట్టేశాడు. ఆసీస్ కెప్టెన్ స్టీవా చేతులు ఎత్తేశాడు. షేన్ వార్న్‌కి ఆ రెండు మ్యాచుల్లో ఒక్క వికెట్ కూడా దక్కలేదు. సచిన్ సిక్సులు కొడుతుంటే.. కోట్ల మంది భారతీయులకి సచిన్‌ చేతుల్లోని MRF బ్యాట్.. అర్జునుడి అర్జునుడి గాండీవంలా కనిపించింది.  ఆ మ్యాచ్‌లో కెప్టెన్‌ అజహరుద్దీన్‌ హాఫ్‌ సెంచరీతో సచిన్‌కు సహకారం అందించాడు. ఇలా షార్జాలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియాను సచిన్‌ టెండూల్కర్‌ ఊచకోత కోశాడు. 24 ఏళ్ల సచిన్‌ కెరీర్‌లో షార్జాలో ఆడిన ఇన్నింగ్స్‌లు ఎంతో ప్రత్యేకం. క్రికెట్‌ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఈ  రెండు ఇన్నింగ్స్‌లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments