SNP
పది మంది కోహ్లీలతో సమానం అని చెప్పడంతో చాలా మంది షాకై ఉంటారు. కానీ, కెవిన్ పీటర్సన్ ఆట చూసిన వాళ్లు మాత్రం పెద్దగా షాక్ అవ్వరు. అసలు పీటర్సన్ ఎలాంటి ఆటగాడు, అతని కెరీర్ ఎలా సాగింది, ఎలా ముగిసిందో తెలుసుకోండి.. తర్వాత మరే ఒప్పుకుంటారు.
పది మంది కోహ్లీలతో సమానం అని చెప్పడంతో చాలా మంది షాకై ఉంటారు. కానీ, కెవిన్ పీటర్సన్ ఆట చూసిన వాళ్లు మాత్రం పెద్దగా షాక్ అవ్వరు. అసలు పీటర్సన్ ఎలాంటి ఆటగాడు, అతని కెరీర్ ఎలా సాగింది, ఎలా ముగిసిందో తెలుసుకోండి.. తర్వాత మరే ఒప్పుకుంటారు.
SNP
క్రికెట్.. ఈ మూడు అక్షరాల ఆటలో లెజండ్స్ చాలా మంది ఉన్నారు. వారంతా తమ పేరుపై చరిత్ర లిఖించుకున్న వారే. కానీ.., లెజండ్ కావాల్సిన ఓ ఆటగాడిని మాత్రం చరిత్ర మౌనంగా తనలో కలిపేసుకుంది. ఎలాంటి ప్రత్యేక గుర్తింపు ఇవ్వకుండా నిర్దాక్షణ్యంగా ఓ విలన్‌గా మార్చేసింది. వందల మంది ఆటగాళ్లలో ముందు వరుసలో ఉండాల్సిన అతన్ని.. వందల మందిలో ఒక్కడిగా మార్చేసింది. అతని కెరీర్ సరిగ్గా సాగుంటే.. కొన్నేళ్ల క్రితమే సచిన్ రికార్డ్స్ తెరమరుగయ్యేవి. విరాట్ కోహ్లీ వెలుగులోకి రాకముందే.. క్రికెట్ ప్రపంచానికి మరో కోహ్లీ పరిచయం అయ్యుండేవాడు. టన్నుల కొద్దీ టాలెంట్ ఉన్నా.., ఆ ఆటగాడు మాత్రం చీకటి సూర్యుడిలా మౌనంగా వాలిపోయాయడు. ఆ చీకటి సూర్యుడి పేరే కెవిన్ పీటర్సన్.
పీటర్సన్.. ఆరడుగుల ఆజానుబాహుడు. అతను నిలబడి కొడితే బంతి స్టేడియం బయటపడాల్సిందే. పేస్, స్పిన్ ఎలాంటి బౌలింగ్ వేసినా అతని పవర్ హిట్టింగ్ ముందు తేలిపోవాల్సిందే. ఎంత గొప్ప బౌలర్ ఎదరుగా ఉన్నా.. ఎంత కట్టుదిట్టమైన ఫీల్డ్ సెట్ చుట్టూ ఉన్నా.. అతన్ని ఆపలేవు. ఎందుకంటే.. సాంప్రదాయ క్రికెట్‌కు కొత్త దారి చూపిస్తూ, అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలోనే కనీవిని ఎరుగని విధంగా తొలిసారి స్విచ్ హిట్ ఆడి, ప్రపంచ క్రికెట్ మతిపొగొట్టిన ఆటగాడు అతను. వరల్డ్ క్రికెట్‌లోకి ఉప్పెనలా దూసుకొచ్చిన కెవిన్ పీటర్సన్.. అంతే వేగంగా ఎందుకు చరిత్రలో కలిసిపోయాడు? అతని ప్రవర్తనతో పాతాళానికి ఎలా పడిపోయాడు? కేపీని చుట్టుముట్టిన వివాదాలు ఏమిటి? అతను నిజంగా విలనా? లేక.. బలి పశువు అయ్యాడా? ఇలాంటి అన్నీ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కెవిన్ పీటర్సన్ ఎంత స్టైలిష్ బ్యాటరో.. అంతే విధ్వంసం సృష్టించగలడు. అయితే.. అద్భుతమైన టాలెంట్ ఉన్నా.. ఆటతో పాటు వివాదాలతో కూడా సహవాసం చేశాడు కేపీ. అందుకే.. పది మంది కోహ్లీలతో సమానం కావాల్సిన ఆటగాడు.. కొన్ని రికార్డులకే పరిమితం అయిపోయాడు. 2004 నుంచి 2014 వరకు పీటర్సన్ ఇంగ్లండ్ తరఫున ఆడాడు. కానీ, నిజానికి పీటర్సన్‌ది సౌత్ ఆఫ్రికా. 1980 జూన్ 27న జన్మించాడు. పీటర్‌మారిట్జ్‌బర్గ్ అతని స్వస్థలం. అక్కడే పుట్టి పెరిగాడు. చిన్నతనం నుంచే క్రీడల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనే పీటర్సన్ తొలుత రబ్బీ ప్లేయర్‌గా తన కెరీర్‌ను మొదలుపెట్టి.. తర్వాత క్రికెట్ వైపు మల్లాడు. క్రికెట్‌నే తన కెరీర్‌గా ఎంచుకున్నాడు. సౌతాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో కూడా సత్తా చాటాడు. కానీ, సౌతాఫ్రికా క్రికెట్‌లో ఉన్న జాతి కోటా వ్యవస్థ.. పీటర్సన్ జాతీయి జట్టులోకి రాకుండా అడ్డుపడింది. దీంతో ఆ వ్యవస్థను తీవ్రంగా వ్యతిరేకించిన పీటర్సన్.. అంతర్జాతీయ క్రికెట్‌లోకి రాకముందే.. సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుపై తిరగబడ్డాడు. ఇలాంటి వ్యవస్థ ఉన్న జట్టుకు తాను ఆడేది లేదని.. ఇంగ్లండ్‌కు మారిపోయాడు. మరి ఇంగ్లండ్ జట్టులో పీటర్సన్‌కు ఎలా అవకాశం దొరికిందంటే.. పీటర్సన్ తండ్రి ఆఫ్రికన్ అయినా.. తల్లి ఇంగ్లండ్‌కు చెందిన ఆవిడే. అందుకే పీటర్సన్.. తొలుత నాటింగ్‌హమ్‌షైర్.. తర్వాత ఇతర క్లబ్స్ తరపున నాలుగేళ్ల పాటు కౌంటీ క్రికెట్ ఆడటంతో.. పీటర్సన్‌కు ఇంగ్లండ్ జాతీయ జట్టులో చోటు దక్కింది.
2004 నవంబర్‌లో జింబాబ్వేతో జరిగిన వన్డే మ్యాచ్‌తో పీటర్సన్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్‌లో 27 పరుగులతో నాటౌట్‌గా నిలిచి.. ఆకట్టుకున్నాడు. ఇక 2005 జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన పీటర్సన్ తానో సాదాసీదా ప్లేయర్‌ని కాదనే విషయాన్ని తొలి టెస్టుతోనే నిరూపించాడు. బలమైన ఆస్ట్రేలియా బౌలింగ్ ఎటాన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. రెండు ఇన్నింగ్స్‌ల్లో కూడా హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు. ఇక అక్కడి నుంచి పీటర్సన్ వెనుదిరిగి చూడలేదు. ప్రపంచ క్రికెట్‌లో తిరుగులేని ఆటగాడిగా మారిపోయాడు. వరల్డ్ నంబర్ వన్ ప్లేయర్ కూడా అయ్యాడు. 2010లో ఇంగ్లండ్ సాధించిన మొట్టమొదటి ఐసీసీ ట్రోఫీ.. టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. నిజానికి ఇంగ్లండ్ ఆ ట్రోఫీ గెలవడంలో పీటర్సన్‌దే ముఖ్యపాత్ర. అదే ఏడాది ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు. విజయాలు, పరుగుల విషయం పక్కన పెడితే.. పీటర్సన్ అంటే అందరికి గుర్తుకొచ్చేది.. స్విచ్ హిట్ షాట్.
క్రికెట్ ప్రపంచంలో ఆ షాట్ ఓ సంచలనం సృష్టించింది. అప్పటి వరకు ఏ బ్యాటర్ కూడా తన స్టాండ్‌ను మార్చుకుని షాట్ ఆడిన దాఖలాలు లేవు. తొలిసారి 2006 మేలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో పీటర్సన్ ఈ షాట్ ఆడాడు. అది కూడా ఏ సాదా సీదా బౌలర్ బౌలింగ్‌లో కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గొప్ప గొప్ప బ్యాటర్లకు చెమటలు పట్టించిన.. ది గ్రేట్ ముత్తయ్య మురళీధరణ్ బౌలింగ్‌లో పీటర్సన్ స్విచ్ హిట్ కొట్టాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన పీటర్సన్.. మురళీధరణ్ బాల్ రిలీజ్ చేసే సమయానికి లెఫ్ట్ హ్యాండర్‌గా మారిపోయి.. ఆడిన ఆ షాట్ బౌండరీకి వెళ్లింది. ఆ షాట్‌ను చూసి క్రికెట్ ప్రపంచం నివ్వెరపోయింది. ఏకంగా ఆ షాట్‌పై ఐసీసీ చర్చించే స్థాయికి వెళ్లింది. చాలా మంది క్రికెటర్లు, బౌలర్లు ఆ షాట్ ఎలా ఆడతాడని వివాదానికి తెరతీశారు. కానీ, పీటర్సన్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా.. స్విచ్ హిట్ షాట్లు ఆడుతూ పోయాడు. ఆ తర్వాత చాలా మంది స్విచ్ హిట్ ఆడినా.. పీటర్సన్ ఆడినంత అందంగా మరెవరూ ఆడలేకపోయారు. అయితే.. ఒక్క స్విచ్ హిట్ షాట్ అనే కాదు.. పీటర్సన్ మరికొన్ని షాట్లు కూడా ఎంతో అద్భుతంగా ఆడగలడు.
వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది.. పుల్ షాట్, స్ట్రేయిట్ సిక్స్. ఇప్పుడంటే.. పుల్‌షాట్ అంటే చాలా మంది రోహిత్ శర్మ పేరు చెబుతుంటారు కానీ, పీటర్సన్ కూడా పుల్ షాట్ ఎంతో అందంగా, అద్భుతంగా, ఈజీగా ఆడగలడు. అప్పట్లో ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్‌ను కూడా పుల్‌షాట్స్‌లో పీటర్సన్ డామినేట్ చేసేవాడు. ఇక స్ట్రేయిట్‌గా పీటర్సన్ కొడుతుంటే.. చూసేందుకు రెండు కళ్లు చాలవు. ఇలా ఇవే కాదు.. పీటర్సన్ నిజానికి మిస్టర్ 360 ప్లేయర్. గ్రౌండ్‌కు అన్ని వైపులా షాట్లు ఆడగల క్రికెటర్. క్రీజ్‌లో సెట్ అయ్యాడంటే.. అతనికి బాల్ ఎక్కడ వేయాలో.. హేమాహేమీ బౌలర్లకే అర్థం కాకపోయేది. పీటర్సన్ తన కెరీర్‌లో టెస్ట్ క్రికెట్‌లో మొత్తం మూడు డబుల్ సెంచరీలు బాదాడు. అందులో ఒకటి మన ఇండియాపై కూడా కొట్టాడు. 2011 జూలై 21న లండన్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పీటర్సన్ వీరవిహారం చేశాడు. పిచ్‌పై బాల్ నాగుపాములా స్వింగ్ అవుతున్నా.. ఇషాంత్ శర్మ, ప్రవీణ్ కుమార్ బాల్‌ను అద్భుతంగా స్వింగ్ చేస్తూ ఎంత వేగంతో వేసినా.. పీటర్సన్ వాటిని చాలా తేలిగ్గా బౌండరీకి తరలిస్తూ.. భారత్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. అలాంటి ఇన్నింగ్స్‌లే.. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ లాంటి భీకర బౌలింగ్ ఎటాక్ ఉన్న టీమ్స్‌పై కూడా ఆడాడు.
ఇక ఆటలో కెరీర్ పీక్స్‌లో దూసుకెళ్తున్న సమయంలోనే.. వివాదాలు కూడా పీటర్సన్‌ను చుట్టుముట్టాయి. అతని సొంత దేశం సౌతాఫ్రికా.. ఆ జట్టు కెప్టెన్ గ్రేమ్ స్మిత్‌తో పీటర్సన్‌కు గొడవలు నడిచాయి. స్మిత్ బహిరంగంగానే తనకు పీటర్సన్ అంటే అస్సలు నచ్చడని, నాకున్న దేశభక్తి అందుకు కారణమని ప్రకటించాడు. పీటర్సన్ సౌతాఫ్రికాను కాదని ఇంగ్లండ్ తరఫున ఆడుతుండటం స్మిత్‌కు కోపం తెప్పించే అంశం. స్మిత్‌తో గొడవలు పక్కనపెడితే.. ఒక ఆటగాడిగా పీటర్సన్ ఇంగ్లండ్ క్రికెట్‌లో సూపర్ స్టార్. అందుకే పీటర్సన్‌కు కెప్టెన్సీ కూడా దక్కింది. కానీ, కెప్టెన్ అయిన తర్వాత.. అప్పటి ఇంగ్లండ్ కోచ్ పీటర్ మోరిస్‌తో విభేదాలతో పీటర్స్ కెప్టెన్సీ ఎక్కువ కాలం నిలువలేదు. కోచ్-కెప్టెన్ మధ్య విభేదాలు రావడంతో, బోర్డుతో కూడా పీటర్సన్‌కు పొసగకపోవడంతో.. ఇద్దరిని ఇకే సారి బాధ్యతల నుంచి బోర్డు తప్పించింది. కెప్టెన్సీ పోయినా కూడా పీటర్సన్ ఆటగాడిగా దుమ్మలేపాడు. కెరీర్ ఆరంభంలో పీటర్సన్ చేసిన విధ్వంసం చూసి.. ప్రపంచ క్రికెట్ ఉలికిపడింది. అప్పటి వరకు ఎవరూ టచ్ కూడా చేయలని సర్ డాన్ బ్రాడ్‌మన్ రికార్డులకు పీటర్సన్ చాలా దగ్గరగా వెళ్లాడు.
ఇక కెరీర్ చివర్లో కూడా పీటర్సన్ ఒక తీవ్ర వివాదానికి కారణం అయ్యాడు. ఇంగ్లండ్ జట్టులో ఉంటూ.. ప్రత్యర్థి జట్టుకు టిప్స్ ఇస్తూ.. మెసేజులు చేశాడనే ఆరోపణలను పీటర్సన్ ఎదుర్కొన్నాడు. 2012లో తన మాతృదేశం సౌతాఫ్రికా.. ఇంగ్లండ్ పర్యటనకు వచ్చింది. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్-సౌతాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ సందర్భంగా.. అప్పటి ఇంగ్లండ్ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్‌ను అవుట్ చేయాలంటే.. ముందుగా మోర్ని మోర్కెల్‌కు బౌలింగ్ ఇవ్వాల్సిందిగా సౌతాఫ్రికా టీమ్‌కు.. మెసేజ్‌లు పంపాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇంగ్లండ్ డ్రెస్సింగ్ రూమ్‌నుంచి.. ఆ జట్టు కెప్టెన్‌ను ఎలా అవుట్ చేయాలో.. సౌతాఫ్రికాకు టిప్స్ ఇవ్వడంపై తీవ్ర వివాదం రాజుకుంది. అప్పటి వరకు ఇంగ్లండ్ క్రికెట్ ఫ్యాన్స్ దృష్టిలో హీరోగా ఉన్న పీటర్సన్.. ఒక్కసారిగా విలన్‌గా మారిపోయాడు. ఈ మ్యాచ్ తర్వాత.. పీటర్సన్‌ను మూడో టెస్టు మ్యాచ్‌కు పక్కనపెట్టారు. కానీ, మళ్లీ ఇండియాతో సిరీస్ కోసం పీటర్సన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఆ వివాదం నుంచి బయటపడిన తర్వాత పీటర్సన్ మరిన్ని మంచి ఇన్నింగ్స్‌లు ఆడి 2014లో క్రికెట్‌కు దూరం అయ్యాడు.
కెరీర్‌లో ఎన్నో అద్భుతమైన రికార్డులు, గొప్ప గొప్ప ఇన్నింగ్స్‌లతో సర్ డాన్ బ్రాడ్‌మన్ తర్వాతి స్థానంలో నిలిచినా కూడా పీటర్సన్ కెరీర్ చాలా త్వరగానే ముగిసిందని చెప్పాలి. కేవలం 10 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ మాత్రం పీటర్సన్ కొనసాగించాడు. నిజానికి పీటర్సన్ ఆడిన ఆట చూస్తే.. అతను ఓ రెండు దశాబ్దాల పాటు క్రికెట్‌ను ఏలాల్సిన వాడు. కానీ, వివాదాలు అతని కెరీర్‌ని తగ్గించాయి. ఆటతో హీరోగా నిలిచిన పీటర్సన్ వివాదాలతో ఎప్పటికప్పుడు విలన్‌లా మారుతూ పోయాడు. అతని చుట్టు ఎన్ని వివాదలు ఉన్నా.. చాలా మంది క్రికెట్ అభిమానులకు పీటర్సన్ ఓ సూపర్ స్టార్. అంతర్జాతీయ క్రికెట్‌లోనే కాదు.. ఐపీఎల్‌లోనూ పీటర్సన్ తన మార్క్ చూపించాడు. ఆర్సీబీ, ఢిల్లీ డేర్‌డెవిల్స్, రైజింగ్ పూణె వారియర్స్ జట్లకు ఆడాడు. పీటర్సన్ తన కెరీర్‌లో మొత్తం.. 104 టెస్టులు, 136 వన్డేలు, 37 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 47.28 యావరేజ్‌తో 8181 పరుగులు, వన్డేల్లో 40.73 యావరేజ్‌తో 4440 రన్స్, టీ20ల్లో 1176 పరుగులు చేశాడు. టెస్టుల్లో 23 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు, వన్డేల్లో 9 సెంచరీలు, 25 హాఫ్ సెంచరీలు సాధించాడు. టీ20ల్లో 78 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో అత్యధిక స్కోర్ 227, వన్డేల్లో 130గా ఉంది.
ఓ ప్లేయర్ గొప్పోడు అని చెప్పడానికి అతని రికార్డ్స్ చాలు. మరి.. ఒక మనిషి మంచోడని చెప్పడానికి? అతని ప్రవర్తన మాత్రమే కొలమానం. ఇక్కడే కేపీ బ్యాలెన్స్ తప్పాడు. చరిత్రలో చెడ్డోడిగా మిగిలిపోయాడు. అతని ఆట అంటే ఇంగ్లండ్ ప్రేక్షకులకి ప్రాణం. సౌతాఫ్రికా ప్రజలకి ఇష్టం. టీమిండియా ఫ్యాన్స్‌కు అభిమానం. మొత్తంగా క్రికెట్ ప్రపంచానికి గర్వకారణం! కానీ.., చివరి రోజుల్లో ఈ ఛాంపియన్ కన్నీటి చెమ్మని తుడవడానికి ఒక్క చేయి కూడా లేకుండా పోయింది. కెరీర్ చరమాంకంలో.. చేసిన తప్పులు, చుట్టుముట్టిన వివాదాలు, కొన్ని తెచ్చుకున్న కష్టాలు అన్నీ ఏకమై తనని ముంచేస్తుంటే.. ఈ అసాధారణ ఆటగాడు.. నిర్లిప్తంగా, నిస్సత్తువుగా, ఓ చేతకానివాడిలా ఓటమికి తలవంచి ఆటకి దూరం అవ్వాల్సి వచ్చింది. ఇదే కేపీ చరిత్ర. దేవుడు మరోలా రాసుండాల్సిన ఓ లెజండ్ చరిత్ర. మరి.. ఇలాంటి పీటర్సన్ జీవితంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.