Mr Bachchan Movie Review And Rating In Telugu: మాస్ మహారాజ రవితేజ- హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మిస్టర్ బచ్చన్ సినిమా ఎలా ఉందో తెలియాలి అంటే ఈ రివ్యూ చూసేయండి.
Mr Bachchan Movie Review And Rating In Telugu: మాస్ మహారాజ రవితేజ- హరీశ్ శంకర్ కాంబోలో వచ్చిన పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ మిస్టర్ బచ్చన్ సినిమా ఎలా ఉందో తెలియాలి అంటే ఈ రివ్యూ చూసేయండి.
Tirupathi Rao
మరోసారి తన నటనతో, ఎనర్జీతో మ్యాజిక్ చేసేందుకు మాస్ మహారాజ్ మిస్టర్ బచ్చన్ గా వచ్చేశాడు. అలాగే హరీశ్ శంకర్ లాంటి ఎనర్జిటిక్ డైరెక్టర్ కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు వచ్చేశాయి. సినిమా నుంచి ఒక్కో అప్ డేట్ కు ఆ అంచనాలు మరింత పెరిగాయి. మరి.. ఆ అంచనాలను మిస్టర్ బచ్చన్ నిలబెట్టుకున్నాడా? రీమేక్ సినిమా అనే ముద్రను పోగొట్టుకున్నాడా? అసలు రవితేజ- హరీశ్ శంకర్ మ్యాజిక్ వర్కౌట్ అయ్యిందా? వంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ రివ్యూలో చూసేయండి.
మిస్టర్ బచ్చన్(రవితేజ) నిజాయతీ పరుడైన ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఓ అవినీతి పరుడైన పొగాకు వ్యాపారిపై రైడ్ చేసి అవినీతి సొమ్ము వెలికి తీస్తాడు. కానీ.., పైఅధికారులు మాత్రం బచ్చన్ ని సస్పెండ్ చేస్తారు. దీంతో.. బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వెళ్లిపోతాడు. అక్కడ జెక్కీ(భాగ్య శ్రీ)ని తొలి చూపులోనే ఇష్టపడతాడు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసి.. బచ్చన్ కి ఉద్యోగం లేదని అడ్డు చెప్తారు. సరిగ్గా ఇదే సమయంలో బచ్చన్ ని ఉద్యోగంలో చేరమని ఫోన్ వస్తుంది. దీంతో.. పెళ్లి సెట్ అయినా.. బచ్చన్ తన తదుపరి రైడ్ ఎంపీ ముత్యం జగ్గయ్య (జగపతి బాబు) ఇంట్లో చేయాల్సి వస్తుంది. మొత్తం అధికారులని భయపెట్టే ముత్యం జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? అక్కడ అతనికి ఎదురైన పరిస్థితులు ఏమిటి? అనేది మిస్టర్ బచ్చన్ అసలు కథ.
సమాజంలో ఓ తప్పు జరుగుతూ ఉంటుంది. దానికి కారణమైన విలన్ చాలా పవర్ ఫుల్. అందరిని భయపెడుతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడు హీరో రంగంలోకి దిగుతాడు. ఇక ఇక్కడ నుండి ఆ ఇద్దరు ఎలా పోట్లాడుకున్నారు? ఇది అచ్చమైన అసలు సిసలు మాస్ కథ. చాలా ఏళ్లుగా ఈ పాయింట్ మీద కొన్ని వందల సినిమాలు వచ్చాయి. ఇక్కడ కొత్తగా చెప్పడానికి కథ కూడా ఏమి ఉండదు. కానీ.., కమర్షియల్ గా పక్కా వర్కౌట్ అయ్యే పాయింట్. కాకపోతే.. ఆ సక్సెస్ రావాలంటే హీరో ఎంత బలంగా ఉంటే.. విలన్ కూడా అంతే బలంగా నిలబడాలి. అప్పుడే ఈ పాయింట్ వర్కౌట్ అవుద్ది. కానీ.. మిస్టర్ బచ్చన్ లెక్క తప్పింది ఇక్కడే. ఓ హీరో విలన్ కి లొంగడు, ముఖ్యమంత్రిని లెక్క చేయడు, ప్రధానమంత్రిని పట్టించుకోడు. ఫ్రెండ్ సహకారంతో ఫ్యామిలీ టెన్షన్ ఉండదు. ఎదురుపడ్డ ప్రతిసారి విలన్ ని తన్నుకుంటూపోతుంటాడు. ఇక కథలో ఎమోషనల్ బ్యాలెన్సింగ్ ఎక్కడ సాధ్యం అవుతుంది? కథనం ఆసక్తిగా ఎలా సాగుతుంది? అన్నిటికి మించి క్లైమ్యాక్స్ లో ఎలా కిక్ వస్తుంది? ఏమో ఈ ప్రశ్నలు అన్నిటికీ హరీశ్ శంకరే సమాధానం చెప్పాలి!
బచ్చన్ మూవీ కి ది ఓన్లీ హోప్ అనే ట్యాగ్ లైన్ ఉంది. హరీశ్ శంకర్ మాత్రం ఈ మూవీకి రవితేజ ఒక్కడినే తన హోప్ గా భావించాడు. అందుకే సినిమా మొదలవగానే హీరోని రంగంలోకి దింపేశాడు. ఇక అక్కడ నుండి బచ్చన్ క్యారెక్టరైజేషన్ ఎస్టాబ్లిష్ చేసిన విధానం బాగుంది. అక్కడ నుండి కథ కోటి పల్లి చేరడం, హీరోయిన్ ఎంట్రీతో మూవీ గ్లామర్ టర్న్ తీసుకోవడం స్మూత్ గా జరిగిపోయింది. లవ్ ట్రాక్ లో కొన్ని మెరుపులు ఉన్నా.., హిందీ పాటల గోలలో కథ కాస్త ట్రాక్ తప్పింది. అయితే.. ఇక్కడే కమెడియన్ సత్య స్క్రీన్ స్పేస్ అక్రమించేసి నవ్వులు పూయించాడు. దీంతో.. సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది. ఇక ప్రీ ఇంటర్వెల్ టైమ్ కి రైడ్ మొదలవడం, తరువాత వచ్చే పవర్ ఫుల్ యాక్షన్ బ్యాంగ్ కి తోడు.. రవి తేజ ఎనర్జీకి, హరీశ్ పవర్ ఫుల్ డైలాగ్స్ యాడ్ కావడంతో ఫస్ట్ ఆఫ్ సంతృప్తిగానే ముగుస్తుంది.
సెంకడాఫ్ మాత్రం మిస్టర్ బచ్చన్ గ్రాఫ్ అమాంతం పడిపోయేలా చేసింది. మొత్తం కథ అంతా ఇక్కడే ఉండటం, అక్కడ అతి సాధారణ సన్నివేశాలు పడటం, పైగా.. దర్శకుడు ఎంతో నమ్మకంతో రాసుకున్న కామెడీ ట్రాక్ అస్సలు పండకపోవడంతో బచ్చన్ ట్రాక్ తప్పేసే స్థితికి వచ్చేస్తుంది. ఇలాంటి సమయంలో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చిన సిద్దు జొన్నలగడ్డ కొంతసేపు స్క్రీన్ ని షేక్ చేసేశాడు. ఇక ఇక్కడ నుండి అయినా కథ పరుగులు తీస్తుంది అనుకుంటే.. హీరో, విలన్ మైండ్ గేమ్ కాస్త వన్ సైడ్ వార్ అయిపోవడంతో కథనంలో పట్టు తప్పింది. ఇక ఏ సీన్ జరుగుతున్నా హీరోకి అడ్డేముంది అనే ఓ అభిప్రాయం పడిపోవడంతో.. మాస్ మూవీకి కావాల్సిన ఆడిటోరియం మూడ్ అసలు ఎస్టాబ్లిష్ కాకుండానే పోయింది. దీనికి తోడు ఎలాంటి ట్విస్ట్ లు లేకుండా క్లైమ్యాక్స్ కూడా సాధారణంగా ముగియడంతో మిస్టర్ బచ్చన్ అనుకున్న స్థాయిని అందుకోలేకపోయింది.
మిస్టర్ బచ్చన్ సినిమాకి బిగ్గెస్ట్ అసెట్ రవితేజ, ఆయన ఎనర్జీ అని చెప్పుకోవాలి. సినిమా మొత్తాన్ని రవితేజ ముందుండి నడిపించాడు. ఇంక హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే అందం, నటనలో ప్రేక్షకులను మెప్పించేసింది. ఆమె డ్యాన్స్ కు కూడా మంచి మార్కులే పడ్డాయి. ఇంక టెక్నికల్ విభాగంలో మిక్కీ జే మేయర్స్ మ్యూజిక్ అదిరిపోయింది. మిక్కీకి ఈ మూవీ సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఇక కేజీఎఫ్-2 ఎడిటర్ ఉజ్వల్ కులకర్ణి మూవీకి చాలా బలం అయ్యాడు. ఫస్ట్ ఆఫ్ లో అతను చేసిన షార్ప్ కట్స్ చాలా సన్నివేశాలను నిలబెట్టింది. ఇక టెక్నికల్ అన్నీ విషయాలు బాగున్నాయి. నిర్మాణ విలువలు అదిరిపోయాయి. కాకపోతే.. దర్శకుడు హరీశ్ శంకర్ సెకండ్ ఆఫ్ కథనంపై ఇంకాస్త ఎక్కువ శ్రద్ద వహించి ఉంటే బాగుండేది. దర్శకుడిగా టేకింగ్ విషయంలో మాత్రం హరీశ్ కి మంచి మార్కులే పడుతాయి.
చివరి మాట: మిష్టర్ బచ్చన్: అన్నీ మసాలాలు బాగా కుదిరినా.. ఆశించిన టేస్ట్ రాలేదు!
రేటింగ్: 2.25/5