Maa Oori Polimera 2 Review & Rating in Telugu: ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మా ఊరి పొలిమేర చిత్రం అందరినీ ఆకట్టుకుంది. మరి.. భారీ అంచనాల మధ్య వచ్చిన మా ఊరి పొలిమేర 2 చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
Maa Oori Polimera 2 Review & Rating in Telugu: ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన మా ఊరి పొలిమేర చిత్రం అందరినీ ఆకట్టుకుంది. మరి.. భారీ అంచనాల మధ్య వచ్చిన మా ఊరి పొలిమేర 2 చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా?
Raj Mohan Reddy
2021 డిసెంబర్ చివరన ఓటీటీలో విడుదలైన “మా ఊరి పొలిమేర” అనే ఓ చిన్న సినిమా అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఆ మూవీ ప్రేక్షకులకు మంచి థ్రిల్ కలిగించింది. తాంత్రిక విద్యల నేపథ్యం, అంతకు మించిన ట్విస్ట్ లతో సాగిన ఆ మూవీ సూపర్ సక్సెస్ కావడం విశేషం. దీంతో.. మేకర్స్ వెంటనే ఆ మూవీకి సీక్వెల్ అనౌన్స్ చేశారు. ‘సత్యం’ రాజేశ్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను వంటి నటులు ప్రధాన పాత్రల్లో నటించిన “మా ఊరి పొలిమేర 2” నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. ఈ మూవీ ఎలా ఉందో రివ్యూ ద్వారా తెలుసుకుందాం.
చనిపోయాడనుకున్న కొమురయ్య.. తన ప్రియురాలు కవితతో కలిసి వేరే ఊరికి వెళ్లిపోవడంతో “పొలిమేర 1” కథ ముగుస్తుంది. ఇక “పొలిమేర 2” కథ కూడా సరిగ్గా అక్కడ నుండే మొదలవుతుంది. జాస్తిపల్లి గ్రామం నుండి వెళ్ళిపోయిన కొమురయ్యను వెతుక్కుంటూ.. అతని తమ్ముడు జంగయ్య కూడా కనిపించకుండా పోతాడు. జాస్తిపల్లికి కొత్తగా వచ్చిన ఎస్ఐ ఈ కేసుని మళ్ళీ బయటకి తీస్తాడు. జంగయ్యని పట్టుకునే క్రమంలో అతనికి ఏకంగా కొమురయ్య జాడే తెలుస్తుంది. ఇక అక్కడ నుండి.. కొమురయ్య ఏ ఉద్దేశ్యంతో ఈ తాంత్రిక విద్యలు చేస్తున్నాడు? ఈ కథకి.. అనంత పద్మనాభ స్వామి గుడికి ఉన్న లింక్ ఏమిటి? అసలు.. జాస్తిపల్లి అనే ఊరి పొలిమేరలో ఉన్న మిస్టరీ ఏమిటి? ఈ మొత్తం కథలో కొమురయ్య హీరోనా? విలనా? అన్నదే మిగతా కథ.
ఓ క్రైమ్ సప్సెన్స్ థ్రిల్లర్ మూవీ అంటే.. ప్రేక్షకుడి అంచనాలకి అందకుండా సాగాలి. పొలిమేర పార్ట్ 1 విజయానికి కూడా ఇదే ప్రధాన కారణం. “పొలిమేర 2″లో కూడా ఇలాంటి ట్విస్ట్ లకి ఎలాంటి కొదవ లేదు. ఎలాగో సీక్స్వెల్ కాబట్టి.. కథలోకి వెళ్ళడానికి దర్శకుడు ఎలాంటి సమయం తీసుకోలేదు. మొదటి షాట్ నుండే ఈ చిత్ర కథ మొదలైపోతుంది. నిజంగా ఇది అభినందించతగ్గ విషయం. ఇక కొమిరి క్యారెక్టర్ ఎంటర్ అయ్యాక కథ పరుగులు తీస్తుంది. ప్రేక్షకుడు ఎక్కడా కూడా తల తిప్పుకోవడానికి వీలు లేకుండా ఆసాంతం కథ నడుస్తూనే ఉంటుంది. నిజానికి ఏ చిత్రానికైనా అది బలం అవుతుంది. కానీ.., “పొలిమేర-2” కథ పెద్దది కావడం బలంతో పాటు, కాస్తంత బలహీనత కూడా అయ్యింది. ఎలాంటి జానర్ అయినా, ఎంత పెద్ద కథ అయినా.. సినిమా అనేది ఓ ఎంటర్టైన్మెంట్ మీడియం మాత్రమే.
ఇక్కడ కథ చెప్పడానికి ఓ పర్టికులర్ ఫార్మేట్ టెంప్లేట్ అంటూ ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేకపోవచ్చు. కానీ.., ఆడియన్ మూడ్ ని, మైండ్ ని కంట్రోల్ చేసేలా కథ చూపించగలగాలి. ఈ చిత్ర దర్శకుడు ఇక్కడే చిన్న తప్పు చేశాడు. తాను చెప్పాలి అనుకున్న కథని ఏకబిగిన.. ఓ బుక్ నేరేషన్ లా చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. దీంతో.. ఆడియన్ కి ఆ ఫీల్ క్యారీ చేసుకునే సమయం కూడా లేకుండా పోయింది. అలా అని.. ఈ చిత్ర కథనం ఇంట్రెస్టింగ్ గా లేదా అంటే అదీ కాదు. ఓ మంచి పాయింట్ కి.. దర్శకుడు ఓ మంచి నేరేషన్ యాడ్ చేశాడు. అయితే.., మధ్యలో నేరేషన్ బ్రేక్ పాయింట్స్ లేకపావడమే ఈ చిత్రానికి పెద్ద మైనస్. ఇది ఒక్కటి తప్పితే “పొలిమేర-2” వంకలు పెట్టడానికి, విమర్శించాడనికి ఇంకేమి లేదు.
ఓ మంచి హై ఓల్టేజ్ ఎక్స్ పీరియన్స్ తో ఫస్ట్ ఆఫ్ పూర్తి అయ్యాక “పొలిమేర-2″పై అంచనాలు ఇంకా పెరిగిపోతాయి. ఇక్కడ కూడా దర్శకుడు అదే టెంపోని మెయింటైన్ చేయడం విశేషం. ఇక కథలోని మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ రివీల్ అయ్యే సమయానికి కొమిరయ్య క్యారెక్టర్ చాలా ప్రయాణం చేసేసి ఉంటుంది. ఓ సాధారణ ఆటో డ్రైవర్ నుండి.. కేరళలోని అనంత పద్మనాభ స్వామి మూలాల వరకు వెళ్తాడు కొమురయ్య. నిజానికి ఇలాంటి కథలో ఆ ప్రధాన క్యారెక్టర్ మాత్రమే బాగా ఎలివేట్ అవుతుంది. కానీ.., దర్శకుడు ఈ సినిమాలోని ప్రతి పాత్రని కథలో ఇన్వాల్వ్ చేసిన విధానం అద్భుతమనే చెప్పాలి. ఏ చిన్న క్యారెక్టర్ లీడ్ మనకి గుర్తు లేకపోయినా.. ఈ కథతో ట్రావెల్ అవ్వడం కష్టం. కాబట్టి.. “పొలిమేర-2” చూడాలి అనుకునే ప్రేక్షకులు ముందుగా మరొక్కసారి “పొలిమేర-1” చూస్తే మంచిది. ఇక ఇలాంటి క్రైమ్ సప్సెన్స్ థ్రిల్లర్ జానర్ మూవీలో ఎమోషన్స్ కి ఎక్కువ ప్రధాన్యం ఇచ్చి కొంతమేర రిస్క్ చేశాడు దర్శకుడు. దీన్ని కూడా ఫీల్ అవ్వగలిగితే “పొలిమేర-2” మీకు తప్పక నచ్చుతుంది.
“సత్యం” రాజేశ్. ఇప్పుడున్న మన సో కాల్డ్ స్టార్ హీరోలు అందరికన్నా చాలా మంచి నటుడు. ప్రతి ఎమోషన్ ని చక్కగా పలికించగల సామర్థ్యం అతని సొంతం. ఇలాంటి ఓ మంచి కథకి “సత్యం” రాజేశ్ ప్రధాన బలమైపోయాడు. ఇతను బలమైన సీక్వెన్స్ లలో నటించిన విధానం అద్భుతం. ఇలాంటి మంచి కథలతో రాజేశ్ హీరోగా కంటిన్యూ అయిపోవచ్చు. ఇక.. “పొలిమేర-2” లో రాజేశ్ తరువాత తప్పక చెప్పుకోవాల్సింది హీరోయిన్ కామాక్షి భాస్కర్ల గురించే. సీక్వెల్ లో లక్ష్మీ పాత్రకి మంచి వైటేజ్ దక్కడంతో ఈమె నటనతో చెలరేగిపోయింది. ఇక బలిజ పాత్రలో గెటప్ శ్రీను కూడా బాగా నటించాడు. కేవలం వీరు మాత్రమే కాదు, ఈ సినిమాలో నటించిన ప్రతి క్యారెక్టర్ తో కథకి లింక్ ఉండటంతో.. అంతా గొప్పగా నటించాల్సి వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో దర్శకుడి విజన్ ని మెచ్చుకుని తీరాల్సిందే. అయితే.., కథ రీత్యా బాలాదిత్య పాత్రకి స్క్రీన్ స్పేస్ మరీ తక్కువ అయిపోయింది.
“పొలిమేర-2” కి సాంకేతిక విభాగంలో హీరో ఎవరంటే.. సినిమాటోగ్రాఫర్ కుశేందర్ రమేష్ రెడ్డి. కథలోని మూడ్ కి తగ్గ విజువల్స్ ని ఆయన క్యాప్చర్ చేసిన విధానం అద్భుతం. ముఖ్యంగా కేరళలోని ఫారెస్ట్ విజువల్స్ అదిరిపోయాయి. ఇంత న్యాచురల్ విజువల్స్ ఈ మధ్యకాలంలో ఏ సినిమాలో చూడలేదంటే అతిశయోక్తి కాదు. ఇక ఆర్ట్ డైరెక్టర్ గా ఉపేందర్ రెడ్డి కూడా సూపర్ సక్సెస్ అయ్యారు. గ్యాని బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంది. అనుభవం పెద్దగా లేని శ్రీవర ఎడిటింగ్.. వర్క్ పరంగా ఓకే అనిపించుకున్నా.. దర్శకుడిని కంట్రోల్ చేయడంలో మాత్రం కాస్త వెనక్కి తగ్గినట్టు అనిపిస్తుంది. ఇక.. దర్శకుడు అనిల్ విశ్వనాథ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కథకుడిగా మాత్రమే కాకుండా, దర్శకుడిగా కూడా అనిల్ లో మంచి స్పార్క్ ఉంది. ఇతను గనుక ఇదే టెంపో మైంటైన్ చేస్తే.. త్వరలోనే అగ్ర దర్శకుల సరసన చేరడం ఖాయం. చివరిగా నిర్మాణ విలువలు మెప్పిస్తాయి.
చివరిమాట: అంచనాలను అందుకుంది
రేటింగ్: 2.75/5