Fight Club Movie (OTT) Review & Rating In Telugu: లోకేశ్ కనగరాజ్ డైరెక్టర్ గా అందరికీ తెలుసు. కానీ, నిర్మాతగా మారడని చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన నిర్మించిన చిత్రం తాజాగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. మరి.. ఆ సినిమా ఎలా ఉందంటే..?
Fight Club Movie (OTT) Review & Rating In Telugu: లోకేశ్ కనగరాజ్ డైరెక్టర్ గా అందరికీ తెలుసు. కానీ, నిర్మాతగా మారడని చాలా తక్కువ మందికి తెలుసు. ఆయన నిర్మించిన చిత్రం తాజాగా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. మరి.. ఆ సినిమా ఎలా ఉందంటే..?
Tirupathi Rao
లోకేశ్ కనగరాజ్ పేరు వినగానే అభిమానులకు గూస్ బంబ్స్ వచ్చేస్తాయి. అతను తీసుకునే కథ, చూపించే విజువల్స్ మరొకరికి సాధ్యం కాదేమో అనే విధంగా ఉంటాయి. ముఖ్యంగా ఆడియన్ పల్స్ ని పట్టుకోవడం బాగా తెలుసు. అయితే డైరెక్టర్ గా ప్రేక్షకులను అలరించిన లోకేశ్ కనగరాజ్.. నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. అతను ప్రొడ్యూసర్ గా మారి తెరకెక్కించిన తొలి చిత్రం ఫైట్ క్లబ్. ఈ మూవీ డిసెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది. మరి.. ఫైట్ క్లబ్ మూవీ ఓటీటీ రివ్యూ చూసేయండి.
ఈ కథ మొత్తం నార్త్ చెన్నై నేపథ్యంలో సాగుతూ ఉంటుంది. అక్కడి చిన్నారులు బడికి పోకుండా.. నేరాలు చేసే గూండాలుగా, డ్రగ్ పెడలర్స్ గా ఎదుగుతూ ఉంటారు. ఆ పరిస్థితులను మార్చేందుకు బెంజిమన్(కార్తికేయన్ సంతానం) ప్రయత్నిస్తుంటాడు. అక్కడి పిల్లలని క్రీడాకారులుగా మార్చాలని ఆశ పడతాడు. బెంజి ఆధ్వర్యంలో ఒక మంచి ఫుట్ బాల్ ప్లేయర్ కావాలని సెల్వ(విజయ్ కుమార్) కలలు కంటాడు. అయితే బెంజిని అతని సోదరుడు జోసెఫ్(అవినాష్ రఘుదేవన్) తో కిర్బా(శంకర్ థాస్) చంపిస్తాడు. బెంజి మరణంతో సెల్వ ఫుట్ బాల్ కలకు బ్రేకులు పడతాయి. బెంజిని చంపిన నేరం మీద జోసెఫ్ జైలుకెళ్తాడు.
కిర్బా మాత్రం అందిన అవకాశాన్ని వాడుకుంటూ రాజకీయ నాయకుడిగా ఎదిగిపోతాడు. దందాలు, రియల్ ఎస్టేట్ అంటూ అందినకాడికి దోచుకుంటూ కౌన్సిలర్ గా గెలుస్తాడు. అయితే కిర్బా తనను మోసం చేశాడని జోసెఫ్ గ్రహిస్తాడు. అతనిపై కోపంతో రగిలిపోతూ ఉంటాడు. సెల్వని వాడుకుని తన పగ తీర్చుకోవాలి అనుకుంటాడు. మరి.. జోసెఫ్ అనుకున్నది సాధించాడా? ఫుట్ బాల్ ప్లేయర్ కావాలనుకున్న సెల్వ లైఫ్ ఎన్ని మలుపులు తిరిగింది? కిర్బాకి ఎదురెళ్లి సెల్వ ఎన్ని కష్టాలు పడ్డాడు? జోసెఫ్ తనని వాడుకున్నాడని తెలిసి సెల్వ ఏం చేశాడు? ఇలాంటి ఆసక్తికర ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఫైట్ క్లబ్ మూవీ చూడాల్సిందే.
సాధారణంగా ఇలాంటి రివేంజ్ యాక్షన్ డ్రామాలంటే ఆడియన్స్ కి ఎంతో ఇష్టం. ఇలాంటి కథలకి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. అయితే దానిని సరిగ్గా వాడుకోవడంలో డైరెక్టర్ కాస్త తడబడినట్లు అనిపిస్తుంది. నిజానికి కథ చెప్పిన విధానం మెప్పిస్తుంది. ఈ మూవీ మొత్తం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలో సాగుతుంది. కాలేజ్ లో ఉన్న హీరో, అతని ఫ్రెండ్స్ పై అటాక్ జరుగుతుంది. ఆ సీన్ తోనే సినిమా స్టార్ట్ అవుతుంది. దానిని కట్ చేసి ఆ సీన్ కి ముందు, తర్వాత ఏం జరిగింది అనేదే సినిమాగా చూపిస్తారు. ఈ స్టైల్ నరేషన్ ని ఈ మూవీలో చాలాచోట్ల వాడుకున్నాడు. ఈ మూవీ ఫస్టాఫ్ లో డైరెక్టర్ చాలానే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వదిలేశాడు. వాటన్నింటికి సెకండాఫ్ లో ఆన్సర్స్ ఇస్తాడు.
ఈ సినిమా సాదాసీదా రివేంజ్ స్టోరీ, గ్యాంగ్ వార్స్ ని పక్కన పడేయలేం. ఇందులో మంచి లవ్ స్టోరీ, ఫ్యామిలీ డ్రామా కూడా ఉంది. అయితే సినిమా ట్రాక్ లోకి రావడానికి డైరెక్టర్ ఏ రహమత్ కాస్త ఎక్కువ సమయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. సెల్వ పరిచయం అయ్యాకే కథ పరుగులు పెడుతుంది. ఈ మూవీలో లవ్ స్టోరీని వేరుగా చూస్తే నచ్చుతుంది. కానీ, ఈ రివేంజ్ స్టోరీలో లవ్ స్టోరీని చూస్తే మాత్రం అంతగా అతికినట్లు అనిపించదు. ఏదో కావాలని ప్రేమను ఇరికించారు అనే భావన కలుగుతుంది. కానీ, టేకింగ్ తోనే అబ్బాస్ ఏ రహమత్ మ్యాజిక్ చేశాడు. మణిరత్నం మూవీస్, రజినీకాంత్ కాలా వంటి సినిమాల రిఫరెన్స్ కనిపిస్తుంది. కానీ, ఎక్కడో డైరెక్టర్ డైవర్ట్ అయ్యాడేమో అనే భావన కలుగుతుంది. కొన్ని యాక్షన్ సన్నివేశాలు అసలు కథకు భారంగా కనిపిస్తాయి.
ఈ సినిమాకి విజయ్ కుమార్ బిగ్ అసెట్ అనే చెప్పాలి. విజయ్ కుమార్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అతని బాడీ లాంగ్వేజ్, యాటిట్యూడ్ బాగా నచ్చుతాయి. పాత్ర మేరకు హీరోయిన్ మెప్పిస్తుంది. ఒక పాట, ఒకటి రెండు సీన్స్ లో మాత్రమే కనిపిస్తుంది. అంతవరకు తన పాత్రకు న్యాయం చేసింది. జోసెఫ్, కిర్బా పాత్రల్లో అవినాష్ రఘుదేవన్, శంకర్ థాస్ ఒదిగిపోయారు. ఒకరిపై ఒకరు పైచేయి సాధించాలనే తపనను బాగా పలికించారు. ఈ మూవీలో ఉన్న అన్ని పాత్రలు ప్రేక్షకులను మెప్పిస్తాయి. ఎవరూ కూడా కథకు భారంగా అనిపించరు.
ఈ సినిమాకి హీరో, విలన్ డైరెక్టర్ అనే చెప్పాలి. చాలా సింపుల్ స్టోరీని ఎంతో చక్కగా తెరకెక్కించాలని చాలానే ప్రయత్నించాడు. కానీ, కొన్ని కొన్ని చోట్లమాత్రం తడబడినట్లు తెలిసిపోతుంది. అలాగని ఏ రహమత్ ని తక్కువ చేయాల్సిన అవసరం లేదు. అతని విజన్, టేకింగ్ ప్రేక్షకులను మెప్పిస్తాయి. కథ పరంగా శశి తీసుకున్న జాగ్రత్తలకు మంచి మార్కులే పడతాయి. కానీ, మరింత ఫోకస్డ్ గా ఉంటే బాగుండు అనిపిస్తుంది. గోవింద్ వసంత మ్యూజిక్ మెప్పిస్తుంది. లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తుంది. ముఖ్యంగా పోరాట సన్నివేశాల్లో కెమెరా వర్క్ అదరగొట్టారు. నిర్మాణ విలువలు కూడా గొప్పగా ఉన్నాయి.
చివరిగా: ఫైట్ క్లబ్ కి ఒక్కసారి వెళ్లి రావచ్చు..
రేటింగ్: 2.5/5