యనమలకు అంతా తప్పుగానే కనిపిస్తోందట..!

రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చులో రూ.48,000 కోట్లకు లెక్కలు లేవని కాగ్‌ సంస్థ ఎత్తిచూపడం చాలా తీవ్రమైన అంశం. దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి అని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పదే పదే డిమాండ్‌ చేస్తున్నారు. మరి ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం రూ.రెండు లక్షల కోట్లు బడ్జెట్ కేటాయింపులు లేకుండా ఖర్చు చేసిందని కాగ్ తప్పు పట్టింది. టీడీపీ సర్కార్ ఆ విషయం ఎందుకు పట్టించుకోలేదు అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

అప్పుడు గమ్మునుండి ఇప్పుడు గగ్గోలు..

టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా బడ్జెట్ కేటాయింపులు లేకుండా చేసిన దాదాపు రూ.రెండు లక్షల కోట్లకు శాసనసభ అనుమతి తీసుకోవాలని కాగ్ పదే పదే సూచించింది. అయినా తెలుగుదేశం ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఈ విషయాన్ని కూడా కాగ్ అప్పట్లో విమర్శించింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆర్థికమంత్రిగా ఉన్న యనమల ఆ విషయంపై మాట వరుసకు కూడా ఎక్కడా స్పందించలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం రూ.48,000 కోట్లకు ఖర్చుకు లెక్కలు లేవని చెప్పడంపై ఏకంగా సీబీఐ దర్యాప్తు చేయించాలని యనమల గగ్గోలు పెట్టడం విచిత్రం.

గత ఆర్థిక సంవత్సరంలో 48 వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బిల్లులను ట్రెజరీ కోడ్ ప్రకారం కాకుండా సీఎఫ్ఎమ్ఎస్ ద్వారా చెల్లించారని, ఇటువంటి సాంకేతిక లోపాలను సరిదిద్దుకోవాలని ప్రభుత్వానికి కాగ్ సలహా ఇచ్చింది. దీని పట్టుకుని ఈ డబ్బును తినేశారా? లేక ఏ మాయ చేశారా? తేలాలి. ఒకసారి కాదు.. నాలుగుసార్లు కాగ్‌ ఈ లెక్కలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కాని రాష్ట్ర ప్రభుత్వం చూపలేకపోయింది అంటు టీడీపీ నానా యాగీ చేస్తోంది.

కాగ్ విమర్శలు సర్వ సాధారణం..

ప్రభుత్వాల వ్యయంపై కాగ్ సాంకేతిక విమర్శలు చేయడం అనేది సర్వసాధారణం. ప్రభుత్వాల జమా ఖర్చులను ఆడిట్ చేసే కాగ్ కొన్ని నిర్థిష్ట ప్రమాణాల అధారంగా నివేదికను రూపొందిస్తుంది. ఖర్చుల విషయంలో ప్రజాప్రయోజనాల రీత్యా ప్రభుత్వాలు తీసుకొనే వెసులుబాటును అది పరిగణనలోకి తీసుకోదు. అందుకే తన ప్రమాణాల మేరకు నివేదిక ఇచ్చేస్తుంది. ఇదంతా సాధారణం అన్న సంగతి తెలిసినా కావాలనే అటు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్, యనమల, ఇతర టీడీపీ నేతలు ప్రభుత్వంపై బురద జల్లాలని చూస్తున్నారు. ప్రభుత్వంలో ఏదో జరిగిపోతోందని ప్రజలు అనుకోవాలనే వ్యూహంతో టీడీపీ రచ్చ చేస్తోంది. పచ్చ మీడియా దానికి విచ్చలవిడిగా దరువేస్తోంది.

అప్పటి ఖర్చుపై సీబీఐ విచారణ కోరుతారా?

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి ఆర్థిక సంవత్సరంలో కూడా వివిధ పద్దుల కింద కేటాయించిన రూ.47 వేల కోట్లను ఖర్చు చేయలేదని కాగ్ అప్పట్లో ఎత్తిచూపింది. మరి ఆ సొమ్మును ఎవరు మింగేశారు? చంద్రబాబు కుటుంబమా? మొత్తం టీడీపీ నాయకులు అందరూ పంచేసుకున్నారా? దానిపై కూడా సీబీఐ విచారణ జరపాలని యనమల కోరగలరా? అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

Show comments