Idream media
Idream media
పార్టీ పెట్టి స్వతంత్రంగా ఉండకుండా తొలినాళ్లలో తెలుగుదేశానికి జై కొట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఆ తర్వాత సొంతంగా పోటీచేసి తీవ్రంగా ఓటమిని చవిచూసి.. ఇప్పుడు బీజేపీకి వంత పాడుతున్నారు. అయినప్పటికీ సొంత ఇమేజ్ కోసం కొంతకాలంగా రైతు పాట పాడుతున్నారు. బాధిత రైతు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడమే కాదు.. అండగా ఉంటానని హామీ ఇస్తున్నారు. నిజంగా ఇది కొన్ని కుటుంబాలకు ఎంతో కొంత భరోసాను ఇచ్చే విషయమే. అయితే రైతు సమస్యలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్న పవన్ ఏపీ ప్రభుత్వ తీరుని ఎండగట్టాలని కూడా ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీనైనా, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డినైనా ఆవేశంతో కాకుండా ఆలోచనతో విమర్శిస్తే ఆకట్టుకునేదేమో. కానీ తోక పార్టీ అని, చంద్రబాబు దత్తపుత్రుడు అని పవన్ ఉద్దేశించి చక్కర్లు కొడుతున్న వార్తల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పొరపాట్లు చేస్తున్నారు.
ఇటీవలి కాలంలో సోషల్ మీడియా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ప్రధానంగా రాజకీయ నాయకుల కదలికలు, వ్యాఖ్యలను నిశితంగా పరిశీలిస్తోంది. పొరపాటు చేష్టలు, మాటలను బూతద్దంలో మరీ చూపుతోంది. తాజాగా పవన్ పై కూడా అలాంటి ట్రోలింగ్సే నడుస్తున్నాయి. తాజాగా పవన్ కౌలు రైతుల సమస్యలపై ఎక్కువగా స్పందిస్తున్నారు. రైతుల సమస్యలు పరిష్కరించలేని వ్యవస్థలు ఉండి ఏం లాభం అంటూ సర్కారును ప్రశ్నిస్తున్నారు. రైతుల సమస్యలను పరిష్కరించలేని వ్యవస్థలు.. గ్రూప్ వన్, ఐ.ఏ.ఎస్. అధికారులు ఉండి ఏం లాభం అని గుంటూరు జిల్లా కేంద్రంగా మండిపడ్డారు పవన్. గుంటూరు కలెక్టర్ దగ్గరకు పురుగుల మందు డబ్బాపట్టుకొని వెళ్ళి మరీ తన గోడు చెప్పుకున్నా.. ఫలితం లేకుండా పోయింది. ఆంజనేయులు మరణానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఇలా ప్రశ్నించడం, సర్కారు పొరపాట్లను ఎత్తిచూపడం బాగానే ఉండొచ్చు కానీ.. ఆ సందర్భంలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు ఆత్మరక్షణలో పడేస్తున్నాయి. జగన్ సీబీఐ దత్త పుత్రుడని, వైసీపీ నేతలు కోర్టుకు దత్త పుత్రులు, చర్లపల్లి జైలులో షటిల్ ఆడే బ్యాచ్ అని ఇలా పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను పరిశీలిస్తే ఇది పక్కా స్క్రిప్ట్ లాగే ఉందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే.. చంద్రబాబు దత్తపుత్రుడిగా పవన్ పై ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. వాటి నుంచి బయటపడేందుకో, ఏమో కానీ.. జగన్ సీబీఐ దత్తపుత్రుడు అని కామెంట్లు చేశారు.
ఎవరి ద్వారా అయినా లాభం పొందినా, ఎవరికి నచ్చినట్లు అయినా వ్యవహరించినా వారి మధ్య సంబంధాన్ని నొక్కి చెప్పేందుకు దత్తపుత్రుడు అని అనొచ్చు. కానీ.. వారి వల్ల ఇబ్బందులు పడితే దానిని దత్తపుత్రుడు అని ఎలా అంటారో అర్థం కాదు. జగన్‌పై సీబీఐ కేసులు ఎలా వచ్చాయో, వాటి వెనుక ఉన్న అసలు కథ ఏంటనేది పక్కన బెడితే.. ఆ కేసుల వల్ల జగన్ ఇబ్బందులు పడ్డారనేది వాస్తవం. దత్తపుత్రుడైతే పదహారు నెలలపాటు జగన్ ను సీబీఐ నిర్భందించేదా? జగన్ బెయిల్ పిటిషన్ వచ్చినప్పుడల్లా వ్యతిరేకించి ఇక్కట్లకు గురి చేసేదా? ఇలాంటి ప్రశ్నలెన్నో సోషల్ మీడియా వేదికగా పవన్ కు ఎదురవుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో పొరపాట్లకు ఆస్కారం లేకుండా పవన్ ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరమనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.