Idream media
Idream media
ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి 2009లో తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. 2014లో ఏ పార్టీలోనూ టిక్కెట్ రాకపోవడంతో మరోసారి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి సుమారు 2,600 ఓట్లు తెచ్చుకున్నారు. 2019లో టీడీపీ తరపున పోటీచేసి వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్‌యాదవ్ చేతిలో 40 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ప్రస్తుతం టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జిగా పనిచేస్తున్నారు. దశాబ్ధం పాటు అధికారానికి దూరంగా ఉన్న ఉగ్ర నరసింహారెడ్డి.. 2024లో ఎలాగైనా సరే గెలవాలనే లక్ష్యంతో ఉన్నారు. ఈ క్రమంలో ఓ వైపు గుంటూరులోని తన ఆస్పత్రి వ్యవహారాలు చూసుకుంటూనే తరచూ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.
దాదాపు రెండున్నరేళ్లుగా అధికార పార్టీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్‌పై ఎలాంటి విమర్శలు చేయని ఉగ్ర నరసింహారెడ్డి..ఇటీవల ఆ పని మొదలుపెట్టారు. ఎన్నికలకు ఇక రెండేళ్ల సమయం మాత్రమే ఉండడంతో దూకుడు పెంచారు. అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. తాజాగా తాను లోకల్ అని, బుర్రా మధుసూదన్ యాదవ్ నాన్‌లోకల్ అని విమర్శలు చేశారు. ఈ విమర్శలకు ఎమ్మెల్యే బుర్రా కూడా ధీటుగా సమాధానం ఇచ్చారు. తన సొంత ఊరు పక్కనే ఉన్న కొండపి నియోజకవర్గంలోనే ఉందని గుర్తు చేసిన ఆయన.. కనిగిరినే తన సొంత ఊరుగా మార్చుకున్నానని, కనిగిరిలో సొంత ఇళ్లు కట్టుకున్నానని, ఓటు కూడా ఇక్కడే ఉందని ఉగ్ర విమర్శలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
అదే సమయంలో ఉగ్రపై కూడా నాన్‌లోకల్ విమర్శలు చేశారు. ఉగ్రనరసింహారెడ్డి సొంత ఊరు హనుమంతుని పాడు మండలం 2009కి ముందు కంభం నియోజకవర్గంలో ఉందని, నియోజకవర్గాల పునర్విభజన తర్వాత కనిగిరిలో కలిసిందని, భవిష్యత్‌లో పునర్విభజన జరిగితే మళ్లీ ఏ నియోజకవర్గంలోకి వెళుతుందో చెప్పలేమంటూ ఉగ్ర నరసింహారెడ్డికి చురకలు అంటించారు. గుంటూరులో ఆస్పత్రి నిర్వహించుకుంటూ అక్కడే ఉంటున్న ఉగ్ర నరసింహారెడ్డి.. తనపై నాన్ లోకల్ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందని, తాను పక్కా లోకల్ అంటూ వైసీపీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ కౌంటర్లు వేస్తున్నారు.
2014 ఎన్నికలకు కొద్దిరోజుల ముందు బుర్రా మధుసూదన్ యాదవ్‌కు కనిగిరి టిక్కెట్ ఇచ్చారు. తాను కందుకూరు టిక్కెట్ ఆశించగా.. కనిగిరి టిక్కెట్ ఇచ్చారని పలు సందర్భాల్లో బుర్రా మధుసూదన్ యాదవ్ చెప్పుకొచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కదిరి బాబూరావు సుమారు 7000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. నియోజకవర్గానికి కొత్తవాడు కావడం, ప్రజలతో పెద్దగా పరిచయం లేకపోవడంతోపాటు, 2009 ఎన్నికల్లో కదిరి బాబూరావు నామినేషన్ చెల్లకపోవడం వల్ల ఉన్న సానుభూతి, నాన్ లోకల్ అంటూ సాగిన ప్రచారం.. బుర్రా ఓటమికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ముఖ్యంగా నాన్‌లోకల్ అనే ముద్రను తొలగించుకునేందుకు 2014 ఎన్నికలు అయిపోయిన వెంటనే.. కనిగిరి పట్టణంలో ఇళ్లు నిర్మించుకున్నారు. పార్టీ కార్యాలయం కూడా ఇంట్లోనే పెట్టుకున్నారు.ఓటుహక్కును కనిగిరికి మార్చుకున్నారు. ఐదేళ్ల పాటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. వీటితో పాటు జగన్ వేవ్ కూడా తోడవడంతో కనిగిరి చరిత్రలో ఎన్నడూలేని విధంగా 40 వేల ఓట్ల మెజారిటీతో ఉగ్ర నరసింహారెడ్డిపై విజయం సాధించారు.
వచ్చే ఎన్నికల్లో గెలవకపోతే ఇక రాజకీయంగా కనుమరుగు కావడం తధ్యమనే ఆందోళనతో ఉన్న ఉగ్రనరసింహారెడ్డి.. దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే బుర్రాపై నాన్‌లోకల్ ముద్ర వేసేందుకు యత్నిస్తున్నారు. అయితే ఆ విమర్శలను బుర్రా గట్టిగా తిప్పికొట్టారు. మరి ఈ లోకల్, నాన్‌లోకల్ వార్ ఇంతటితో ముగుస్తుందా..? లేదా ఎన్నికల వరకు కొనసాగుతుందా..? చూడాలి.