Idream media
Idream media
తెలంగాణ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల వేదికగా తమ వాయిస్ పెంచాలనుకున్న బీజేపీకి ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సమావేశాలు ముగిసేదాక సస్పెన్షన్ వేటు పడింది. అయితే, చివరి సమావేశంలో అయినా సరే పాల్గొనే అవకాశం కోసం న్యాయస్థానం వేదికగా బీజేపీ ఎమ్మెల్యేలు పోరాడుతున్నారు. కాగా, ప్రస్తుతం కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ గానే అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇదిలాఉండగా అసెంబ్లీ సమావేశాలు అంటే సీఎం కేసీఆర్ తరచూగా పాల్గొనేవారు. కానీ ఈ సారి మాత్రం రెండురోజులే ఆయన అసెంబ్లీకి వచ్చారు.
ఇప్పుడు మంగళవారం అసెంబ్లీకి హాజరయ్యే అవకాశమున్నట్లు టీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఈ దఫా సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు (ఈనెల 7)న కేసీఆర్ హాజరయ్యారు.ఆర్థికమంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఆసాంతం విన్నారు.మరుసటిరోజు వనపర్తిలో నిర్వహించిన బహిరంగసభలో పాల్గొన్నారు. నిరుద్యోగుల కోసం అసెంబ్లీలో ప్రకటన చేయబోతున్నానని, 9వ తేదీ ఉదయం 10 గంటలకు టీవీలు చూడాలంటూ ప్రకటించారు. అన్నట్లుగానే ఈ నెల 9న సభకు హాజరై ఏకంగా 80 వేలపైగా ఉద్యోగ ఖాళీల భర్తీని ప్రకటించారు. ఆ వెంటనే నోటిఫికేషన్లు విడుదలవుతాయని చెప్పారు.
ఉద్యోగాల ప్రకటన అనంతరం 10వ తేదీ నుంచి సీఎం శాసనసభకు రాలేదు. 11న స్వల్ప అస్వస్థతకు గురికావడం తో యాదాద్రి పర్యటనను రద్దు చేసుకున్నారు. మరోవైపు శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) నిర్ణయించిన ప్రకారం సమావేశాలకు మంగళవారం చివరిరోజు. ఇదే రోజు ద్రవ్య వినిమయ బిల్లు (అప్రాప్రియేషన్ బిల్ 2022-23)ను ఆమోదించనున్నారు. అయితే, దీనికిముందు సభలో బడ్జెట్ గురించి సీఎం మాట్లాడతారని భావిస్తున్నారు. ‘కంప్ట్రోలర్
అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్)’ నివేదికను మంగళవారం సభలో ప్రవేశపెట్టనున్నారు. అదనపు అప్పు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సడలింపులకు అనుగుణంగా ‘తెలంగాణ ద్రవ్య బాధ్యత-బడ్జెట్ నిర్వహణ(ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టం-2005’ను సవరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన ‘తెలంగాణ ఎఫ్‌ఆర్‌బీఎం(సవరణ) బిల్లు-2022’ను శాసనసభలో ప్రవేశపెట్టింది. కాగా, 2020-21లోనూ ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట సవరణ చేశారు. కీలక అంశాలు ఉండడంతో సీఎం హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.