Idream media
Idream media
గుండెపోటుతో హఠాన్మరణం చెందిన ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ఈ రోజు నిర్వహించనున్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని మేకపాటికి చెందిన మెరిట్స్ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ఉదయం 11 గంటలకు గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు జరపనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో గౌతమ్ రెడ్డికి తుది వీడ్కోలు పలకనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం ఇప్పటికే పూర్తి చేసింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
గౌతమ్ రెడ్డి పార్థివదేహాన్ని నెల్లూరు నగరం డైకస్ రోడ్డులోని ఆయన స్వగృహం నుంచి రోడ్డు మార్గాన ఉదయగిరి తరలించనున్నారు. నెల్లూరు సిటీ నుంచి అంత్యక్రియలు జరిగే మెరిట్స్ ఇంజనీరింగ్ కాలేజీ వరకు అంతిమయాత్ర నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సహా, అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు గౌతమ్ రెడ్డి అంతిమ యాత్రలో పాల్గొననున్నారు. అశేషజనం తమ అభిమాన నేతకు కన్నీటి వీడ్కోలు పలికే అవకాశం ఉండడంతో.. అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది.
మంగళవారం గౌతమ్ రెడ్డి పార్థివదేహాన్ని హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ నుంచి నెల్లూరు నగరానికి తీసుకువచ్చారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు తీసుకువచ్చి, అక్కడ నుంచి ఎయిర్ అంబులెన్స్‌లో నెల్లూరుకు తరలించారు. ఎయిర్ అంబులెన్స్‌లో గౌతమ్ రెడ్డి భౌతికకాయాన్ని నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు తీసుకువచ్చి, అక్కడ నుంచి రోడ్డు మార్గాన నెల్లూరు నగరం డైకస్ రోడ్డులోని మేకపాటి స్వగృహానికి తరలించారు. ప్రజల సందర్శనార్థం మేకపాటి పార్థివదేహాన్ని ఉంచారు. రాజకీయ, నగర ప్రముఖులు, ప్రజలు గౌతమ్ రెడ్డి పార్థివదేహానికి ఘన నివాళులు అర్పించారు.