YS Jagan, YSR Pension Kanuka – వావ్‌.. జగన్‌ ఏం చెప్పారు..! కోటాలు లేవు..! కోతలు లేవు..!!

సంక్షేమ పథకాల విషయంలో గతంలో మాదిరిగా తమ ప్రభుత్వంలో కోటాలు, కోతలు లేవని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పథకం అందించాలనేదే తన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ రోజు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్సార్‌ పింఛన్‌ కానుక సొమ్ము 2500 పెంచే కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. పింఛన్‌ సొమ్మును 2,250 రూపాయల నుంచి 2,500 రూపాయలకు పెంచిన సీఎం జగన్‌.. తన ప్రభుత్వం గడిచిన 31 నెలల పాలనను మరోసారి గుర్తు చేశారు. అదే సమయంలో పేదలకు మంచి చేసే పథకాలను అడ్డుకునేందుకు ప్రత్యర్థి రాజకీయ పార్టీలు చేస్తున్న రాజకీయాలు, కోర్టుల్లో వేస్తున్న పిటీషన్ల తీరును ప్రజల ముందు ఎండగట్టారు.

‘‘ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేస్తున్నాం. సాంక్షేమ పాలన వైపు అడుగులు వేస్తున్నాం. దేశంలోనే అత్యధిక పింఛన్లు ఇస్తున్నాం. గతంలో 39 లక్షల మంది పింఛన్లు అందుకున్నారు. ఇప్పుడు దాదాపు 62 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో పింఛన్ల కోసం ప్రతి నెలా 400 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. మన ప్రభుత్వం ప్రతి నెలా చేస్తున్న ఖర్చు 1450 కోట్ల రూపాయలు. ఈ మొత్తం ఇకపై 1570 కోట్ల రూపాయలకు పెంచుతున్నాం. ఈ 31 నెలల పాలనలో కరోనా కష్టకాలంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు కన్నా.. పేద వాడికి ఉన్న ఇబ్బందులు ఎక్కువని భావించి.. పింఛన్లపైనే 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం.

ఈ పింఛన్లకు గతం మాదిరిగా కోటాలు, కోతలు లేవు. ఎలా ఎగ్గొట్టాలనే కుతంత్రాలు లేవు. ప్రతి ఒక్క అర్హుడికి అందించాలన్నదే మన లక్ష్యం. కులం, మతం, వర్గం, ఓటు వేసేరా..? లేదా..? చూడడం లేదు. ఓటు వేయని వారికి కూడా అర్హత ఉంటే.. పింఛన్‌ వారి గడప వద్దకు తీసుకెళ్లి ఇస్తున్నాం. లంచాలకు తావులేదు. దళారీలు లేరు. అయిన వారు, కాని వారు అంటూ పక్షపాతం చూపిన జన్మభూమి కమిటీలు లేవు. ఆత్మాభిమానం చంపుకుని ఆ కమిటీల ముందు మోకరిల్లాల్సిన పని లేదు. ప్రతి నెలా మొదటి రోజు మీ గడప ముందుకు వచ్చి తలుపు తట్టి వలంటీర్లు పింఛన్‌ సొమ్ము చేతిలో పెడుతున్నారు. ఇలాంటి పరిస్థితి గతంలో ఉందా..? అసలు ఇలాంటి పరిస్థితి వస్తుంది.. అని భావించారా..? అని ఒక్కసారి ఆలోచించండి.

Also Read : రాజకీయాల్లో కొత్త చ‌రిత్ర రాసిన జ‌గ‌న్

పింఛన్లు అందుకునే సమయంలో క్యూలు లేవు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న తరుణంలోనూ.. వలంటీర్లు అక్కడకు వెళ్లి పింఛన్‌ ఇస్తున్నారు. దాదాపు 2.70 లక్షల మంది ఈ యజ్ఞంలో పని చేస్తున్నారు. ప్రతి నెలా 1వ తేదీన దాదాపు 90 శాతం పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఐదో తేదీ లోపు ప్రతి ఒక్కరికీ పింఛన్‌ అందించే గొప్ప వ్యవస్థ మన రాష్ట్రంలో కొనసాగుతోంది. ఇలాంటి వ్యవస్థ దేశంలోనే ఒక్క మన రాష్ట్రంలోనే ఉంది. మన మాదిరిగా ఇతర రాష్ట్రాలు కూడా చేసేందుకు ఆరాటపడుతున్నాయి. పింఛన్లు అందుకోవడంలో ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే.. గ్రామ, వార్డు సచివాలయాలను, వలంటీర్లను సంప్రదించండి. వారు మీ సమస్యను పరిష్కరిస్తారు.

ఓర్వలేక విమర్శలు.. మంచి పనులకు అడ్డంకులు..

ఇంతగా మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వాన్ని.. ఇలాంటి మంచి పని చేయని పార్టీలు, నాయకులు ఓర్వలేక విమర్శిస్తున్నారు. వీరు… ఏనాడు కూడా పేద పిల్లలకు ఇంగ్లీష్‌ మీడియం చదువులు చెప్పించాలని ఆలోచించలేదు. పైగా ఇంగ్లీష్‌ మీడియం వద్దని కోర్టుల్లో కేసులు వేశారు. అక్కచెల్లెమ్మలకు విలువైన ఇళ్ల స్థలం ఇస్తుంటే.. కోర్టులకు వెళ్లి స్టేలు తీసుకొచ్చారు. వీరు అమరావతి అని చెప్పుకునే రాజధానిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇద్దామని మనం అనుకుంటే.. కులాల మధ్య మార్పులు చేర్పులు వస్తాయని.. కోర్టులకు వెళ్లి పిటీషన్లు వేశారు. ఇంత కన్నా దౌర్భాగ్యమైన నాయకులు ఉంటారా..?

పేదలకు వారి ఇంటిపై పూర్తి హక్కులు తెచ్చుకుని.. అమ్ముకునే, తాకట్టు పెట్టుకునే, పిల్లలకు ఇచ్చే.. పథకాన్ని కూడా విమర్శిస్తున్నారు. చివరికి పేదవాడికి అందుబాటు రేటుకు వినోదాన్ని అందించాలని సినిమా టిక్కెట్‌ ధరలు నిర్ణయిస్తే.. దానిపై కూడా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్లు పేదల గురించి ఆలోచించే వాళ్లేనా..? పట్టించుకునే వాళ్లేనా..? వీరు పేదలకు వ్యతిరేకులు కాదా..? అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. మంచి జరగాలని నాలుగు అడుగులు ముందుకు వేస్తే.. రాజకీయ స్వార్థంతో అడ్డుతగిలే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఈ జనవరి 1 నుంచి అయినా వీరికి మంచి ఆలోచన కలగాలని, పేదలకు మంచి చేస్తుంటే అడ్డుపడరాదనే జ్ఞానం కలగాలని, ప్రజలకు ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాన”ని సీఎం జగన్‌ అభిలషించారు.

Also Read : అవ్వాతాతలకు నూతన సంవత్సర కానుక

Show comments