YCP, Sajjala Ramakrishna Reddy, AP BJP – బీజేపీని చూస్తే పాపమనిపిస్తోంది.. సజ్జల సెటైర్లు

భారతీయ జనతాపార్టీ (బీజేపీ)ని చూస్తే జాలేస్తోందని వైసీపీ ముఖ్యనేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. నిన్న మంగళారం విజయవాడలో బీజేపీ నిర్వహించిన జనాగ్రహ సభలో ఆ పార్టీ నేతలు చేసిన విమర్శలపై సజ్జల తనదైన శైలిలో స్పందించారు. ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడిన సజ్జల.. బీజేపీ, టీడీపీ తీరులను ఎండగట్టారు. చంద్రబాబు నాయుడు అజెండాను బీజేపీ మోస్తోందని సజ్జల విమర్శించారు. బహుశా దేశ చరిత్రలో ఓ జాతీయ పార్టీ.. ప్రాంతీయ పార్టీకి అనుబంధంగా పని చేయడం ఇదే మొదటిసారంటూ ఎద్దేవా చేశారు. బీజేపీ పరిస్థితి చూస్తే పాపమనిపిస్తోందని సజ్జల వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు అజెండా పట్టుకుని బీజేపీ సభ నిర్వహించడం విడ్డూరంగా ఉందన్నారు. 

చంద్రబాబు ఆటలో పావులుగా మారారు..

‘‘ బీజేపీ జాతీయ పార్టీ. దానికి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అద్వానీ, వాజపేయి, మోడీ లాంటి నేతలను అందించిన పార్టీ. అలాంటి పార్టీ రాష్ట్రంలోకి వచ్చే సరికి చంద్రబాబు నాయుడు అనే దుష్టశక్తి ఆటలో పావుగా మారింది. బీజేపీ, కాంగ్రెస్, ఇతర చిన్నాచితకా పార్టీలను కలిపి కూడగట్టినా రెండు, మూడు శాతం ఓట్లు లేవు. అలా అని వారి మాటలకు విలువలేదని కాదు. అయితే ఎవరి పాత్ర వారు పోషిస్తే ఫర్వాలేదు. కానీ చంద్రబాబు గంట కొడితే ఒకటో కృష్ణుడు, రెండో కృష్ణుడు మాదిరిగా బీజేపీ నేతలు పని చేయడం చూస్తుంటే.. పాపమనిపిస్తోంది. నిన్న సభలో సునిల్‌ దియోధర్‌ ముందు ఉంటాడు. వెనుక సుజనా చౌదరి ఉంటారు. మాటలు సోము వీర్రాజు మాట్లాడతారు. ఆ మాటలు ఎన్టీఆర్‌ భవన్‌ నుంచి వస్తున్నాయి.

Also Read :  జగన్‌ వద్ద 9 రత్నాలే.. మోదీ వద్ద 90 రత్నాలున్నాయట..!

బాబు చీకటి సామ్రాజ్యానికి వారిద్దరు అధిపతులు..

చంద్రబాబు చీకటి సామ్రాజ్యానికి సీఎం రమేష్, సుజనా చౌదరిలు అధిపతులు. వారిని బీజేపీ వాళ్లు ఎలా నమ్ముతున్నారో అర్థం కావడం లేదు. గతంలో మోదీతోపాటు బీజేపీ నేతలందరూ టీడీపీ చేతిలో దెబ్బతిన్నారు. అయినా చంద్రబాబు పట్ల వారు జాగ్రత్తగా ఉండడం లేదన్నట్లుగా తెలుస్తోంది. సీఎం రమేష్, సుజనా చౌదరిలు బీజేపీలో ఉంటూ టీడీపీ అజెండాను మోస్తున్నారు. ఎన్నికల నాటికి బీజేపీ, జనసేన, సీపీఐలతో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మన మనుషులు బీజేపీలో ఉన్నారని చూపుతూ.. బీజేపీతో పొత్తు పెట్టుకుంటామని చెబుతూ టీడీపీ నేతలను చంద్రబాబు కాపాడుకుంటున్నారు.

పరిపక్వతలేని రాజకీయాలు..

ఏపీలోని బీజేపీ నేతలు పరిపక్వతలేని రాజకీయాలు చేస్తున్నారు. ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాత్రమే రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఆ నిధులు ఎక్కడ నుంచి వచ్చాయి..? రాష్ట్రాల నుంచి పన్నులు కేంద్రానికి వెళుతున్నాయి,అవే మళ్లీ ఇస్తున్నారు. ఇదేదో బీజేపీ వాళ్లు వచ్చిన తర్వాత మొదలు పెట్టినట్లు చెబుతున్నారు. రాజకీయాల్లో ఉంటూ సరైన అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. కేంద్రం వాటా ఉన్న పథకాల్లో ప్రధాన మంత్రి ఫొటో, పేరు పెడుతున్నాం.

ఇచ్చేదా..? చచ్చేదా..? కొండ ఎత్తి నెత్తినపెట్టు.. అన్నట్లుగా సోము వీర్రాజు మాట్లాడుతున్నారు. మూడేళ్లలో అమరావతిలో రాజధాని కడతామంటున్నారు. వీరే అక్కడ స్కాంలు జరిగాయన్నారు. కర్నూలు పోయి హైకోర్టు అంటారు. మళ్లీ అన్నీ రాజధానిలోనే పెడతామంటున్నారు. మద్యం లేకపోతే పూటగడవని పరిస్థితి కాదు. జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజల విశ్వసనీయతను గెలుచుకున్నారు. దాన్ని నిలబెట్టుకున్నారు. దాన్ని పోగొట్టుకునేందుకే ఈ పార్టీలన్నీ నానా తంటాలు పడుతున్నాయ’’ని సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.

Also Read : రూ. 50 మద్యం ఏంటి వీర్రాజు గారూ?

Show comments