Idream media
Idream media
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదని కేంద్రం ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తోంది. ఆ దిశగా చకచకా చర్యలు చేపడుతోంది. అదే విధంగా కార్మికులు కూడా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు. రూపం మారుస్తూ తమ గళాన్ని కేంద్రానికి వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఫలితంగా విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు నినాదం.. ఇప్పుడు ఢిల్లీలోనూ మార్మోగుతోంది. ఏపీలో ఉధృతంగా సాగుతున్న ఉద్యమ సెగ రాజధానికి పాకింది. ఇప్పటి వరకు ఏపీ ఎంపీలు పార్లమెంట్ లో దీనిపై గళమెత్తగా, కార్మికులే నేరుగా ఢిల్లీ వెళ్లి ఉద్యమం చేయడం హాట్ టాపిక్ గా మారింది.
స్టీల్ ప్లాంట్ కోసం 23 వేల ఎకరాలను రైతులు త్యాగం చేశారు. స్టీల్ ప్లాంట్‌లో 1991లో ఉత్పాదన ప్రారంభమైంది. విశాఖ స్టీల్ ప్లాంట్ కెపాసిటీ 7.3 మిలియన్ టన్నులు. గతంలో దశాబ్దం పాటు పోరాటం చేసి స్టీల్ ప్లాంట్ సాధించుకున్నారు కార్మికులు. ఎన్నో త్యాగాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు జరిగింది. కరోనా సమయంలో ఎంతోమంది ప్రాణాలను స్టీల్‌ప్లాంట్ కాపాడింది. రూ.22 వేల కోట్ల అప్పులను ఈక్విటీగా మార్చి, విశాఖ స్టీల్ ప్లాంట్‌కు సొంతంగా గనులు కేటాయిస్తే ప్లాంట్ ద్వారా కేంద్రానికి కూడా ఆదాయం వస్తుంది. ఇవేమీ ఆలోచించకుండానే నష్టాలు వస్తున్నాయంటూ కేంద్రం ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతోంది. ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినా, ఉద్యమకారులు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నా పట్టనట్లు వ్యవహరిస్తోంది.
దీంతో స్టీల్ ఫ్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక పోరాటం ఇప్పుడు ఢిల్లీ కి పాకింది. ఇందుకోసమే ఉద్యోగ, కార్మిక సంఘాలు ఢిల్లీకి తరలివెళ్లాయి. సోమ, మంగళవారం జంతర్‌మంతర్, ఏపీ భవన్ దగ్గర ఆందోళన చేయాలని సంఘాల నేతలు ముందుగానే ప్రకటించాయి. దీంతో ఆందోళనలు జరగకుండా ఉద్యమ నేతలను ఎక్కడికక్కడ నిలువరించేందుకు ఢిల్లీ పోలీసులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. నిరసన ప్రదర్శన చేయడానికి వచ్చిన స్టీల్ ప్లాంట్ సిబ్బందిని అడ్డుకుంటున్నారు. న్యూ రైల్వే స్టేషన్‌లోనే రెండున్నర గంటలు నిర్బంధించారు. జంతర్ మంతర్‌కు ఆటోలో వెళుతున్నవారిని కూడా అడ్డుకున్నారు. అంతేకాకుండా పోలీసులు బెదిరిస్తున్నారని కార్మికులు చెబుతుండడాన్ని బట్టి ఉద్యమ తీవ్రతను కేంద్రం గుర్తించి అప్రమత్తం అవుతునట్లే కనిపిస్తోంది.
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులను అరెస్టు చేస్తామన్న పోలీసుల హెచ్చరికలను సైతం కార్మికులు లెక్క చేయలేదు. నెల రోజుల ముందే అక్కడి హోటల్ లో గదులు బుక్ చేసుకున్న వారిని కూడా బలవంతంగా క్యాన్సిల్ చేయించారు. అయినప్పటికీ చాలా మంది ఢిల్లీకి చేరుకున్నారు. ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేదిలేదని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం ప్రాణాలు ఇచ్చేందేకు కూడా సిద్ధమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్య రామయ్య ప్రకటించారు. కార్మికుల ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించడమే కాకుండా ధర్నాలో వైసీపీ ఎంపీలు పాల్గొనడంతో ప్లాంట్ పరిరక్షణకు ఏపీ ప్రభుత్వ చిత్తశుద్ధి మరోసారి నిరూపితమైంది.
ప్లాంట్ ను కాపాడుకోవడానికి కార్మికులు విశాఖ నుంచి ఢిల్లీ కూడా వెళ్లి నిరసనలు తెలుపుతుంటే, కేంద్రం మాత్రం వెనక్కి తగ్గేదిలేదని తెగేసి చెబుతోంది. ఇప్పటికే ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని తాజాగా మరోసారి పేర్కొంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎంపీలు సజ్దా అహ్మద్ సహా మరో ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చింది. ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని కేంద్రం పేర్కొంది. అదే విధంగా ప్రస్తుతం స్టీల్ ప్లాంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు, భాగస్వాముల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపింది. అయితే, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాంట్ ను వదులుకునేది లేదని ఉద్యమ సంఘాలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కేంద్రం పునరాలోచిస్తుందేమో చూడాలి.