కిడ్నాపైన భర్త కోసం భార్య సాహసం

మావోయిస్టుల చెరలో చిక్కుకున్న భర్త కోసం ఆమె సాహసంగా ముందడుగు వేసింది. భర్తను రక్షించుకోవాలన్న ఏకైక తలంపుతో దండకారణ్యంలోకి రెండేళ్ల పాపతో అడుగుపెట్టింది. రోజుల తరబడి గాలించి చివరకు భర్త ప్రాణాలను కాపాడుకుంది. తన భర్త ఏదైనా తప్పుచేసి ఉంటే క్షమించి వదిలేయాలని, తమ పిల్లల కోసమైనా ఆయనకు ప్రాణహాని తలపెట్టవద్దని భావోద్వేగంతో వేడుకున్న ఆమె, కుటుంబసభ్యులు చేసిన విజ్ఞప్తి మేరకు ఇంజనీర్‌ అశోక్‌ కుమార్‌, కార్మికుడు ఆనంద్‌ యాదవ్‌ను మావోయిస్టులు విడిచిపెట్టారు. అయితే భర్తను వెతుక్కుంటూ దట్టమైన అబుజ్‌మద్‌ అడవిలోకి వెళ్లిన సోనాలి మాత్రం ఇంకా తిరిగిరాలేదు. ఆమె స్థానిక జర్నలిస్టులు, పోలీస్‌ అధికారులతో టచ్‌లోనే ఉన్నట్టు ఏఎస్‌పీ పంకజ్‌ శుక్లా తెలిపారు.

ఐదు రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో ఇంద్రావతి నదిపై వంతెన నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో అక్కడున్న ఇంజనీర్‌ అశోక్‌ పవార్‌, కార్మికుడు ఆనంద్‌ యాదవ్‌లను మావోయిస్టులు కిడ్నాప్‌ చేశారు. తన భర్తను ఏమీ చేయొద్దని వేడుకుంటూ అశోక్‌ భార్య సోనాలి ఒక వీడియోను విడుదల చేసింది. రోజులు గడుస్తున్నా భర్త ఇంకా విడుదల కాకపోవడంతో ఆమె నేరుగా అడవిలోకి వెళ్లి మావోయిస్టులను కలిసి ప్రాథేయపడాలని నిర్ణయించుకుంది. స్థానిక జర్నలిస్టుల సాయంతో ఆమె అడవిబాట పట్టింది.

ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి మావోయిస్టులు అశోక్‌, ఆనంద్‌లను విడుదల చేశారు. ప్రస్తుతం వారిని పోలీసులు బీజాపూర్‌లోని కత్రులో ఉంచారు. అయితే వీళ్లు విడుదలైనా సోనాలి ఇంకా అడవి నుంచి బయటకు రాలేదు. దీనిపై ఏఎస్‌పీ పంకజ్‌ శుక్లా బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘అశోక్‌, ఆనంద్‌ కత్రులో క్షేమంగా ఉన్నారు. అడవిలోకి వెళ్లిన సోనాలి ప్రస్తుతం జర్నలిస్టులు, పోలీసులకు టచ్‌లోనే ఉన్నారు. ఆమె త్వరలోనే కత్రు వచ్చి భర్తను కలుసుకుంటారు’ అని వెల్లడించారు.

Show comments