Idream media
Idream media
కుటుంబ పోషణ కోసం అన్న చక్రపాణితో కలిసి మద్రాస్‌లో నాటకాలేస్తున్నప్పుడు MG రామచంద్రన్ ఊహించలేదు, తాను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అవుతానని. స్నేహితుడు కరుణానిధితో వైరం వస్తుందని ఆస్సలు ఊహించలేదు.
1972లో మధురైలో అన్నాడీఎంకే పార్టీ స్థాపన జరిగినప్పుడు అది MGR తర్వాత కూడా రాష్ట్రాన్ని ఏలుతుందని ఎవరూ ఊహించలేదు. ఎన్నో సంక్షోభాలు దాటింది. ఇప్పుడు వచ్చింది కొత్త సంక్షోభం, నాయకుడు లేడు. పళనిసామి, పన్నీరుసెల్వం , శశికళ ఈ ముగ్గురిలో ఎవరు నడుపుతారు? గతంలో జయ, జానకి రామచంద్రన్ రెండు గ్రూపులుగా విడిపోయి, మళ్లీ కలిసినట్టు ఈ ముగ్గురు ఏకమవుతారా? ఇది కూడా ఎవరూ ఊహించలేకపోతున్నారు.
MGR పార్టీ పెట్టినపుడు, కరుణానిధికి సినిమా పవర్ తెలుసు. ఆయన అక్కడి నుంచే వచ్చారు. అయితే MGR అభిమాన సంఘాలు తన పునాదుల్ని కదిలిస్తాయని తెలియదు. నెలలో పది లక్షల మంది సభ్యత్వం తీసుకున్న ఏకైక ప్రాంతీయ పార్టీ అన్నాడీఎంకే.
73లో దిండుగల్ లోక్‌సభకి , కోయంబత్తూరు వెస్ట్ అసెంబ్లీకి ఉప ఎన్నికలొచ్చాయి. MGR సత్తా చూపించారు. 76 నాటికి 16 మంది ఎమ్మెల్యేలతో పార్టీగా మారింది. ఎమర్జెన్సీలో ఇందిరమ్మని సపోర్ట్ చేయడం MGR తప్పిదం. అదే ఆయనకి అధికారాన్ని ఇచ్చింది. అవినీతి ఆరోపణలతో DMK ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసింది. 1977లో ఎన్నికలు జరిగితే MGR ముఖ్యమంత్రి.
తమిళ పార్టీల ప్రత్యేకత ఏమంటే ఎప్పుడు ఎవరితో స్నేహం చేస్తారో తెలియదు. కాంగ్రెస్‌తో రామచంద్రన్‌కి చెడింది. చరణ్‌సింగ్ అల్పాయుష్షు ప్రభుత్వంలో అన్నాడీఎంకే సభ్యులు మంత్రులు అయ్యారు. 80లో మధ్యంతర ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న డీఎంకే 37 సీట్లు గెలిస్తే MGRకి 2 దక్కాయి. ఇందిరమ్మ పవర్‌లోకి వచ్చి MGR ప్రభుత్వాన్ని రద్దు చేసింది. ఆయన పని అయిపోయిందనుకున్నారు. 1980లో 129 సీట్లతో అధికారంలోకి వచ్చారు.
84లో ఆరోగ్యం సహకరించక పోయినా గెలిచాడు. 87లో చనిపోయారు.పార్టీలో సంక్షోభం. జయలలిత నాయకత్వాన్ని పార్టీ సీనియర్ నాయకుడు RM. వీరప్పన్ ఒప్పుకోలేదు. ఆమెని గెంటేసి జానకి రామచంద్రన్‌ని ముఖ్యమంత్రి చేశారు. 23 రోజుల తర్వాత రాష్ట్రపతి పాలన వచ్చింది.
Also Read : దేశంలో బీజేపీకి ఎదురుగాలి : కారణాలు ఇవేనా..?
89లో డీఎంకేది అధికారం. జానకి గ్రూప్‌కి 2 , జయలలితకి 27 సీట్లు వచ్చాయి. కేంద్రానికి తమిళ ప్రభుత్వాలని రద్దు చేయడం ఓ సరదా. 91లో చంద్రశేఖర్ ప్రభుత్వం డీఎంకేని డిస్మిస్ చేసింది.
91లో జయలలిత గెలిచారు. కాంగ్రెస్‌తో పొత్తు కలిసొచ్చింది. 96లో జయలలిత సహా (బర్గూర్) చిత్తుగా ఓడిపోయారు. అన్నాడీఎంకేకి 4 సీట్లు దక్కాయి. ఇక ఆ పార్టీ బతకదనుకున్నారు.
98 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు. మంత్రివర్గంలో స్థానం. తమిళ ప్రభుత్వాలపై కేంద్రం ఇంత కాలం చేసిన రద్దులకి ప్రతీకారం అన్నట్టు వాజ్‌పేయ్ ప్రభుత్వం కూలిపోవడానికి జయలలిత కారణమయ్యారు. మళ్లీ కాంగ్రెస్‌తో పొత్తు.
2001లో 197 సీట్లతో కూటమి విజయం. అన్నాడీఎంకే 132 సీట్లు గెలిచింది. అక్రమాస్తుల కేసులో జయలలిత జైలుకి. పన్నీరుసెల్వం తాత్కాలిక సీఎం. కేసు వీగిపోవడంతో మళ్లీ జయలలిత సీఎం. 2004లో మళ్లీ దెబ్బ. బీజేపీతో పొత్తు దెబ్బతీసింది. ఒక్క పార్లమెంట్ సీటు కూడా లేకుండా ఓటమి.
2006లో మళ్లీ ఓటమి. 2011లో భారీ విజయం. 2014లో మళ్లీ జైలుకి. 2015లో జయలలిత సీఎం (తాత్కాలికంగా పన్నీరు సెల్వం ఉన్నాడు). 2016లో మళ్లీ గెలుపు. మొత్తం 6 సార్లు జయలలిత ప్రమాణ స్వీకారం చేశారు. అదే ఏడాది డిసెంబర్‌లో చనిపోయారు.
తర్వాత శశికళ జైలుకి. పళణిసామి ప్రభుత్వం ఎంతో కాలం ఉండదనుకున్నారు. కానీ 5 ఏళ్లు ఉంది. ఇందిరమ్మలా మోడీ ఆవేశపరుడు కాదు. రద్దు చేసి తలనొప్పి తెచ్చుకోవడం కంటే అదుపులో ఉంచుకోవడం కరెక్ట్ అనుకుంటాడు.
MGR , కరుణానిధి లాంటి ఉద్ధండుల ప్రభుత్వాలు రద్దు కావడం పళణిసామి లాంటి నిమిత్త మాత్రులు 5 ఏళ్లు కొనసాగడం తమిళ రాజకీయ వింత. ఇప్పుడు కూడా జనం అన్నాడీఎంకేని చిన్న చూపు చూడలేదు. బాగానే గెలిపించారు. పార్టీకి 49 ఏళ్లు నిండి 50లో పడింది. పార్టీని ఎవరు బతికిస్తారో తెలియదు. MGR , జయలలిత అయితే మళ్లీ పుట్టరు. వాళ్ల పేరు చెప్పుకుని కొంత కాలం బతకాల్సిందే.
Also Read : అమ్మ లేకపోయినా అన్నా డీఎంకే రాణించడంలో ఎవరి పాత్ర ఎంత..?