TDP, Early Elections – ఏపీలో అంత సిన్మా ఉందా?

రాజ‌కీయంగా ఎద‌గ‌డం ఏపీలోని విప‌క్షాల‌కు చాలా అవ‌స‌రంగా మారింది. ఒక‌ప్పుడు ఓ వెలుగు వెలిగిన తెలుగుదేశం ప్ర‌భ ఇప్పుడు ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు. ఇక భార‌తీయ జ‌న‌తా పార్టీ అయితే ఉనికే లేకుండా పోయింది. జ‌న‌సేన అయితే మెరుస్తూ స‌డ‌న్ గా మాయ‌మైపోతోంది. అధికార పార్టీ వైసీపీ మాత్రం తారాజువ్వ‌లా దూసుకెళుతోంది. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వ‌ర‌కూ బ‌లంగా పాతుకుపోతోంది. ఈ క్ర‌మంలో విప‌క్షాలు ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డాల్సి వ‌స్తోంది. దీనిలో ర‌క‌ర‌కాల ప్ర‌చారాల‌ను మొద‌లుపెడుతున్నాయి. ఇందులో ఒక‌టే ముంద‌స్తు ఎన్నిక‌లు.

ఎన్నిక‌లు ఎప్పుడొచ్చినా  సిద్దమంటూ టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడు ఎక్క‌డ మీటింగ్ పెట్టినా చెబుతున్నారు. అంత‌టితో ఆగ‌కుండా.. ఏపీలో ముంద‌స్తు ఎన్నిక‌ల‌పై ప్రచారం జ‌రుగుతోంద‌ని కూడా పేర్కొంటున్నారు. టీడీపీ అనుకూల మీడియా బాబు వ్యాఖ్య‌ల‌కు విప‌రీత‌మైన ప్ర‌యారిటీ ఇస్తోంది. ప‌తాక శీర్షిక‌ల్లో ప్ర‌చురిస్తోంది. ఈ క్ర‌మంలో తెలుగురాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయా? అనే చ‌ర్చ జ‌రుగుతోంది. వాస్త‌వానికి అలాంటి సిట్యువేషన్‌ ఉంటే.. అధికార పార్టీ నేతల నుంచి అలాంటి సంకేతాలు రావాలి. కానీ విచిత్రంగా ప్రతిపక్ష నేతల నోట రావ‌డం విచిత్రం అన్న వాద‌న‌లూ వినిపిస్తున్నాయి. ఏపీలో సీఎం జగన్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తారని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్ప‌డం కూడా విడ్డూర‌మ‌ని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అయితే.. చంద్రబాబు ముందస్తు మాటకి వైసీపీ కౌంటర్‌ ఇచ్చింది. అంత సిన్మానే లేదన్నారు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి. ఇక అంతకుముందు తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. గత ఎన్నికల్లో ఎలాగైతే సీఎం కేసీఆర్‌ ముందస్తుకి వెళ్లారో ఈ సారి అదే రిపీట్ అవుతుందని పార్టీ నేతలకు సూచించారు. ముందస్తు ఎన్నికలపై మంత్రి జగదీష్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. ప్రజల్ని డైవర్ట్‌ చేసేందుకు ఎన్నికల స్టంట్‌ ఎత్తుకున్నారని విమర్శించారాయన. సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలు ముందస్తు సిగ్నల్స్ ఇస్తుంటాయి. కానీ ఈసారి ప్రతిపక్ష పార్టీలే ముందస్తు నెత్తినేసుకోవ‌డం వెనుక ఉద్దేశం ఏంటో వారికే తెలియాలి.

Also Read :  మాజీ ఉప ముఖ్య‌మంత్రి కన్నీళ్లు ..

Show comments