Idream media
Idream media
జమిలి ఎన్నికలు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఏడాది కాలంగా అప్పుడప్పుడూ వల్లె వేస్తున్న మాట. గతేడాదిలో తెలంగాణ మంత్రి కేటీఆర్ అయితే.. పార్టీ నేతల సమావేశంలో జమిలి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పిలుపు ఇచ్చారు. పీసీసీ చీఫ్ అయ్యాక రేవంత్ రెడ్డి కూడా జమిలి ఎన్నికల ప్రస్తావన తెచ్చారు. ఇక ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా పదే పదే ఈ ప్రస్తావన తెస్తూనే ఉన్నారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చాన్నాళ్ల తర్వాత జమిలి ఎన్నికల చర్చ తెరపైకి వచ్చింది. నేటి వరకూ అమల్లోకి అయితే రాలేదు కానీ.. అప్పుడప్పుడు చర్చనీయాంశం అవుతోంది. తాజాగా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి మరోసారి జమిలి ఎన్నికల అవసరం ఉందని పేర్కొన్నారు.
జమిలి తోనే ఎన్నికలు మొదలు
జమిలి ఎన్నికలు అనేది కొత్త పద్దతేం కాదు. దేశంలోని అన్ని రాష్ట్రాల్లోనూ పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు జరగడమే జమిలి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలిసారిగా 1952లో జరిగిన ఎన్నికలు జమిలి ఎన్నికలే. అప్పుడు పార్లమెంటుతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అక్కడి నుంచి 1957, 1962, 1967 సంవత్సరాల్లోనూ పార్లమెంటు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. వరుసగా నాలుగు సార్లు దేశంలో జమిలి ఎన్నికలే జరిగాయి. నాడు దేశమంతా కాంగ్రెస్ హవానే ఉండడం, నేతల్లో సఖ్యత వల్ల ఎక్కడా ప్రభుత్వాలు మధ్యలో పడిపోయిన దాఖలాలు లేవు.
ఆ తర్వాత ఎన్నికల్లో మార్పు
1967 తర్వాత రాజకీయ సమీకరణాల్లో మార్పులు వచ్చాయి. ఫలితంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మధ్యలోనే పడిపోవడం, కొన్ని రాష్ట్రాలు ముందస్తు ఎన్నికలకు వెళ్లడం, కేంద్ర ప్రభుత్వం పడిపోవడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. అనేక కారణాల వల్ల ఒకేసారి ఎన్నికలు జరిగే జమిలి ఎన్నికల పద్ధతికి బ్రేక్ పడింది. అప్పటి నుంచి పార్లమెంటు పదవీకాలం ముగియగానే పార్లమెంటుకు, ఏ రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం ముగియగానే ఆ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. దీని వల్ల మన దేశంలో ఎప్పుడూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. అయితే, 2014 వరకూ జమిలి ఎన్నికల ప్రస్తావవ అంతగా రాలేదు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో వచ్చాక మళ్లీ జమిలి ఎన్నికలను తెరపైకి తెచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 2017లో నీతి ఆయోగ్ జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలకు సంబంధించి ఒక నివేదికను ఇచ్చింది. ఈ నివేదికలో కొన్ని మార్పులు చేసి లా కమిషన్ ఆమోద ముద్ర వేసింది. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చిన బీజేపీ నాటి నుంచీ జమిలి ఎన్నికలపై ఆసక్తిని చూపుతూనే ఉంది.
బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉందా.. రాజకీయ ప్రయోజనాలా?
జమిలి ఎన్నికల ద్వారా ఖర్చును చాలా వరకు తగ్గించవచ్చనేది కేంద్రం వాదన. తరచూ ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల వలన కలిగే ఇబ్బందులు తప్పుతాయని చెబుతోంది. ఐదేళ్ల పాటు ఎన్నికలే ఉండకపోతే పాలన బాగా సాగుతుందని చెబుతోంది. అయితే, దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. దేశమంతా ఒకేసారి ఎన్నికలు జరిగితే.. ఒకే పార్టీ పవనాలు విపరీతంగా వీచే అవకాశాలు ఉంటాయి. అదే జరిగితే.. ప్రాంతీయ పార్టీలకు నష్టం వాటిల్లుతుంది. అలాగే, జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్యం, దేశ ఫెడరల్ వ్యవస్థకు భంగం కలిగిస్తాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని పార్టీలు కూడా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరించింది. ఈ పరిస్థితుల్లో జమిలి ఎన్నికలకు వెళ్లడం ద్వారా దేశమంతా బీజేపీని విస్తరించే వ్యూహం పన్నుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఏ ఎన్నికైనా ఒకేసారి..
జమిలీ ఎన్నికలు దేశానికి అవసరమని ప్రధాని నరేంద్ర మోడీ మరోమారు ఉద్ఘాటించారు. ‘‘లోక్‌సభ ఎన్నికలే అయినా.. రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరిగినా.. పంచాయతీలు, ఇతర స్థానిక సంస్థల పోల్స్ అయినా.. ఒకేసారి నిర్వహించడం వల్ల అభివృద్ధి జరుగుతుంది. పదేపదే ఎన్నికలు జరగడం అభివృద్ధిపై ప్రతికూల ప్రభావాలు చూపుతాయి’’ అని ఆయన వ్యాఖ్యానించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకున్న మంగళవారం ఆయన బీజేపీ పన్నా ప్రముఖ్(పేజీ కార్యకర్త)లను ఉద్దేశించి మాట్లాడారు. జమిలీ స్ఫూర్తితో ‘ఒకే దేశం.. ఒకే ఓటరు జాబితా’ను రూపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఓటరు కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు.
‘‘మనం 75 ఏళ్ల స్వాతంత్య్ర దినోత్సవాలను జరుపుకొంటున్నాం. మన దేశంలో ఓటింగ్ కూడా 75 శాతాన్ని దాటాలి. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు కృషి చేయాలి. పంచాయతీ మొదలు సార్వత్రిక ఎన్నికలదాకా.. ప్రతి పోలింగ్‌లో 75 శాతం మార్కును దాటాలి’’ అని ప్రధాని ఆకాంక్షించారు. ‘‘పట్టణ ప్రాంతాల్లో ప్రజలు సమస్యలపై చర్చకు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారు. కానీ, ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపించరు. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఈ పరిస్థితిలో మార్పు రావాలి’’ అని ఆయన అభిలషించారు.
అవకాశం ఉందా?
జమిలి ఎన్నికలపై ప్రధాని మోడీ అధ్యక్షతన ఎప్పుడో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. జమిలి ఎన్నికలకు 22 పార్టీలు మద్దతు పలికాయి. అయితే, జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే ఐదు రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుంది. ఈ రాజ్యాంగ సవరణలను కనీసం దేశంలోని సగం రాష్ట్రాలు ఆమోదించాలి. ప్రస్తుతం అధిక రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నందున ఇది పెద్ద సమస్యేమీ కాదు. జమిలి ఎన్నికలకు మద్దతు పలుకుతున్న పార్టీల ఎంపీల సంఖ్య లోక్‌సభలో 440 వరకు ఉంటుందని ఒక అంచనా. రాజ్యసభలోనూ మెజార్టీ సభ్యులు జమిలికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. అయితే, రాజ్యాంగ సవరణలు అంత ఈజీకాదని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు. దాని కోసం తీవ్ర కసరత్తు చేయాల్సి ఉంటుందని, అందుకు సుదీర్ఘ సమయం అవసరం ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.