టీం ఇండియా టెస్ట్ కెప్టెన్ ఎవరు…?

రోహిత్ శర్మ పూర్తి స్థాయి కెప్టెన్ గా బాధ్యతలు తీసుకుంటాడా…? లేదా కెఎల్ రాహుల్ కు బాధ్యతలు అప్పగిస్తారా…? లేదు బౌలర్ జస్ప్రిత్ బుమ్రాను కెప్టెన్ ను చేస్తారా…? కాదు కాదు సీనియర్ ఆటగాళ్ళు రహానే లేదా పుజారాకు బాధ్యతలు అప్పగిస్తారా…? ఫాం లేని ఇద్దరికీ ఎలా ఇస్తారు…? రహానేకు కెప్టెన్ గా మంచి ట్రాక్ రికార్డ్ ఉండటమే కాదు హెడ్ కోచ్ ద్రావిడ్ మద్దతు కూడా పుష్కలంగా ఉంది మరి. కాబట్టి అతని పేరునే పరిశీలిస్తారా…? అసలు బోర్డు మనసులో ఆలోచన ఏంటీ…? గంగూలి అడుగులు ఎటు…?

గంగూలి నిర్ణయం తీసుకున్నా బోర్డు నిర్ణయం తీసుకున్నా సరే ద్రావిడ్ ను కాదనే సాహసం చేసే సమస్యే లేదు. బ్యాట్స్మెన్ గా సైలెంట్ గానే టీంలో ఉన్న ద్రావిడ్, అంతే సైలెంట్ గా తన పని తాను చేసిన ద్రావిడ్… కోచ్ గా మాత్రం ఇండియన్ క్రికెట్ ను గాడిలో పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. అవ్వడం ఏముంది గాని ఆల్రెడీ అదే పనిలో ఉన్నాడు గ్రేట్ వాల్. ద్రావిడ్ కోచ్ గా రావడం ఖాయమైన తర్వాతి నుంచి ఇండియా టీంలో ప్రకంపనలు మొదలయ్యాయనే మాట వాస్తవం.

తిరుగులేని కోహ్లీకి వరుస ఐసిసి టోర్నమెంట్ ఓటములు ఇబ్బంది పెట్టడం, బోర్డు అధ్యక్షుడు గంగూలి పట్టుబట్టి ద్రావిడ్ ను కోచ్ ను చేయడం, నేషనల్ క్రికెట్ అకాడమీలో లక్ష్మణ్ ను కూర్చోబెట్టడం అన్నీ కూడా రోజుల వ్యవధిలో జరిగాయి. దీనితో ఏదో జరగబోతుందనే సంకేతాల నడుమ కోహ్లీ కెప్టెన్ గా తప్పుకోవడం, తప్పించడం జరిగాయి. మరి ఇప్పుడు టెస్ట్ కెప్టెన్ ఎవరు…? వైట్ బాల్ క్రికెట్ కు రోహిత్ ఓకే. రెడ్ బాల్ క్రికెట్ మాటేంటి…? 

వినపడుతున్నవి రెండే పేర్లు… కేఎల్ రాహుల్, రిశబ్ పంత్.

ఢిల్లీ టీంకు మెంటార్ గా పని చేసిన ద్రావిడ్, అండర్ 19 లో రిషబ్ పంత్ ను, కెఎల్ రాహుల్ ను ప్రోత్సహించిన ద్రావిడ్ మరో ఆలోచన లేకుండా ఈ ఇద్దరినే ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. రోహిత్ కెరీర్ మరో రెండు మూడేళ్ళు మాత్రమే ఉన్న నేపథ్యంలో అతన్ని వైట్ బాల్ క్రికెట్ కు పరిమితం చేసి… ఈ ఇద్దరినీ కెప్టెన్ గా వైస్ కెప్టెన్ గా నియమించే ప్లాన్ చేస్తున్నాడు. రిషబ్ పంత్ పేరు ఇప్పటి వరకు పరిశీలనలో ఉన్నట్టు మీడియాలో రాలేదు.

కాని యువకుడు కావడం, దూకుడు ఎక్కువగా ఉండటంతో ద్రావిడ్… పంత్ ను మాత్రమే ముందుకు నడిపించే ప్లాన్ చేస్తున్నాడు. టెస్ట్ కెప్టెన్ గా ప్రయాణం అంటే మాటలు కాదు. వైట్ బాల్ క్రికెట్ మాదిరి ఉండదు సినిమా. టీం సెలెక్షన్ నుంచి మ్యాచ్ లో చివరి బంతి వరకు కెప్టెన్ నిర్ణయాలు ప్రభావితం చేస్తాయి. ఒకసారి టెస్ట్ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టి సుదీర్ఘ కాలం పాటు కొనసాగితేనే మంచి ఫలితాలు వస్తాయి. విదేశాల్లో ఎలా ముందుకు నడిపించాలి అనేది ఒక క్లారిటీ ఉంటుంది.

ఫాస్ట్ పిచ్, స్పిన్ పిచ్ లపై ఎలా ముందుకు వెళ్ళాలి అనేది ద్రావిడ్ శిక్షణలో పంత్ రాటుదేలడం ఖాయం. అందుకే ఎవరూ ఊహించని విధంగా రిశబ్ పంత్ ను మాత్రమే టెస్ట్ కెప్టెన్ గా నియమించే ప్లాన్ చేస్తున్నాడు ద్రావిడ్. ఇందుకోసం అవసరమైతే పంత్ ను ఐపిఎల్ నుంచి కూడా పక్కన పెట్టే ప్లాన్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. టీం కెప్టెన్ ఐపిఎల్ ఆడకుండా ఉండే విధంగా నిబంధనలు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి భవిష్యత్తులో ఏ విధంగా పరిస్థితి ఉంటుందనేది చూడాలి.

Also Read : అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న అమలాపురం కుర్రోడు

Show comments